ఓటీటీలోకి 13000 కోట్ల స్కామ్ .. ఇండియాని వణికించిన కేటుగాడిపై సినిమా, ఎందులో అంటే?
ఓటీటీల రాకతో భారతీయ సినీ పరిశ్రమ పయనం పూర్తిగా మారిపోయింది. ఓటీటీలో ప్రపంచ స్థాయి , క్వాలిటీ కంటెంట్ అందుబాటులో ఉండటంతో ప్రేక్షకుడు సినిమాను చూసే విధానం పూర్తిగా మారిపోయింది. కథ , కథనాలు ఏమాత్రం బాగోపోయినా .. ఎంత పెద్ద స్టార్ హీరో నటించినా ప్రేక్షకులు నిర్మొహమాటంగా పక్కనపెట్టేస్తున్నాడు. అందుకే దర్శక నిర్మాతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని అన్ని రకాల జాగ్రత్తలతో సినిమాలు తీసి మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
క్రైమ్, సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లర్, హార్రర్, కామెడీ కథలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తుండంతో దర్శక నిర్మాతలు అటువైపు అడుగులు వేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు నిర్మాతలు, ప్రొడక్షన్ కంపెనీల నుంచి ఓటీటీ సంస్థలు ఆయా సినిమాల డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేసేవి. అయితే ఇప్పుడు ఓటీటీ సంస్థలే నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రేక్షకుడికి ఏం కావాలో పక్కా అంచనాతో ఒరిజినల్ కంటెంట్, వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్నాయి.

బయోపిక్‌లు, యథార్థ సంఘటనలకు ఆదరణ నేపథ్యంలో ఓటీటీ సంస్థలు పక్కా ప్లానింగ్‌తో వ్యవహరిస్తున్నాయి. జనానికి బాగా తెలిసిన కథలనే సినిమాలుగా, వెబ్ సిరీస్‌లుగా తీసుకొచ్చి హిట్ కొడుతున్నాయి. 90వ దశకంలో భారతీయ స్టాక్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించిన హర్షద్ మెహతా కుంభకోణం గురించి స్టాక్ మార్కెట్ అనలిస్టులు, మదుపర్లు, కార్పోరేట్ సంస్థలు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఈ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన 1992 స్కామ్ వెబ్ సిరీస్ ఓటీటీలో మంచి ఆదరణ పొందింది.
తాజాగా ఇలాంటి కుంభకోణాన్ని తెర మీదకి తీసుకురావాలని సన్నాహాలు మొదలయ్యాయి. అదే నీరవ్ మోడీ- మెహుల్ ఛోక్సీ స్కామ్. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ .. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ని దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా మోసం చేశారని చేసిన వ్యవహారం 2018 ప్రాంతంలో భారతీయ బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేసింది. రుణాల ఎగవేత, మోసాలకు పాల్పడిన వజ్రాల వ్యాపారులు మెహుల్ ఛోక్సీ అతని మేనల్లుడు నీరవ్ మోడీలు దేశం విడిచి పారిపోయారు. ఛోక్సీ ఆంటిగ్వా - బార్బుడాకు వెళ్లగా.. నీరవ్ మోడీ లండన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. వీరిద్దరి వ్యవహారంతో భారతీయ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో లోపాలు వెలుగుచూశాయి. సామాన్యుల నుంచి రుణాలను ముక్కుపిండి వసూలు చేసే బ్యాంక్‌లు , పెద్దలను మాత్రం వదిలేస్తున్నాయంటూ పలువురు విమర్శించారు.
ఇంతటి కల్లోలానికి కారణమైన నీరవ్ మోడీ జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. బాలీవుడ్ దర్శకుడు పలాష్ వాస్వానీ దీనికి దర్శకత్వం వహిస్తుండగా .. దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ నిర్మించనుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. నీరవ్ జీవితంపై పవన్ సి లాల్ రచించిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో నీరవ్ జీవితం, వ్యాపారం, 13 వేల కోట్ల స్కామ్ , విదేశాలకు పారిపోవడం, అతనిని భారత్‌కు రప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు వంటి వాటిని టచ్ చేసే అవకాశం ఉంది.
బాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరో ఈ వెబ్ సిరీస్‌లో నీరవ్ మోడీగా నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లనుంది? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది? అనే అంశాలపై నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











