6 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి దుల్కర్ - సంయుక్త రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మహానటి, సీతారామం, లక్కీభాస్కర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. అంతకుముందే ఆయన డబ్బింగ్ చిత్రాలు తెలుగులో విడుదలైనప్పటికీ అంతగా ఆదరణ దక్కలేదు. అయితే ఇప్పుడు ఆయన స్ట్రైట్ తెలుగు చిత్రాలు తీస్తూ క్రేజీ హీరోగా ఎదగడంతో గతంలో దుల్కర్ నటించిన చిత్రాలు ఇప్పుడు తెలుగులో ఓటీటీలోకి అందుబాటులోకి వస్తున్నాయి. దీనిలో భాగంగా ఎప్పుడో ఆరేళ్ల క్రితం దుల్కర్ సల్మాన్ నటించిన చిత్రం తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
రొమాంటిక్ హీరోగా దుల్కర్ సల్మాన్
మలయాళంలో ప్రేమకథలకు, రొమాంటిక్ మూవీస్‌కు కేరాఫ్‌గా మారారు దుల్కర్ సల్మాన్. రోటీన్ కథలు కాకుండా ప్రయోగాలు, విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన క్రేజ్, మార్కెట్ పెంచుకుంటూ కేవలం మలయాళం పరిశ్రమకే పరిమితం కాకుండా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ పలు చిత్రాలు చేస్తూ వస్తున్నారు దుల్కర్ సల్మాన్. ఆయనకు తెలుగునాట యువతలో కేరళకు మించి ఫాలోయింగ్ ఉందనడంలో అతిశయోక్తి లేదు.

దుల్కర్‌కు జోడీగా సంయుక్త మీనన్
బీసీ నౌఫల్ దర్శకత్వంలో మలయాళంలో రూపొందిన చిత్రం ఒరు యమండన్ ప్రేమకథ. ఏజే ఫిల్మ్ కంపెనీ, అల్ తారి మూవీస్ బ్యానర్లపై అంటో జోసెఫ్, సీఆర్ సలీంలు ఈ చిత్రాన్ని నిర్మించారు. దుల్కర్ సల్మాన్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించారు. సలీం కుమార్, సౌబిన్ షహిర్, విష్ణు ఉన్నికృష్ణన్, నిఖిల విమల్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. పీ. సుకుమార్ సినిమాటోగ్రఫి అందించగా.. నాదిర్షా స్వరాలు, బిజిబల్ నేపథ్య సంగీతం అందించారు.
బాక్సాఫీస్‌ను వణికించిన దుల్కర్
25 ఏప్రిల్ 2019న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఒరు యమండన్ ప్రేమకథకు థియేటర్‌లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. కేరళవ్యాప్తంగా 150 స్క్రీన్స్‌లో ఈ సినిమాను విడుదల చేశారు. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో ఒరు యమండన్ ప్రేమకథ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. తొలిరోజు థియేటర్ల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. దుల్కర్ చిత్రం కొచ్చిలోని మల్టీప్లెక్స్‌లో తొలివారం విధ్వంసం సృష్టించింది. కేవలం నాలుగు వారాల్లోనే కొచ్చిలో రూ.19.48 లక్షల కలెక్షన్స్ రాబట్టింది. థియేట్రికల్ రన్ ముగిసేసరికి దాదాపు రూ.24.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాల్లో ఒకటిగా టాప్ 10లో నిలిచింది. మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ ఆ ఏడాది రూ.128.52 కోట్ల వసూళ్లతో అగ్రస్థానంలో నిలిచింది.
6 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి
కోవిడ్‌కు ముందు రిలీజైన ఒరు యమండన్ ప్రేమకథను ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ భావించారు. ఇప్పటికే మలయాళంలో అందుబాటులోకి రాగా.. తెలుగులోకి సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ చిత్రం. ఒక యముడి ప్రేమకథ పేరుతో తెలుగులో ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేశారు. తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో దుల్కర్ - సంయుక్తల రొమాంటిక్ మూవీ అందుబాటులో ఉంది. మరి తెలుగు ప్రేక్షకులు ఈ ప్రేమకథను ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి. ఒకవేళ కథ కనుక నచ్చితే తెలుగులో ఒక యముడి కథకు మంచి వ్యూయర్‌షిప్ దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











