Ori Devuda OTT: ఆహాలో విశ్వక్ సేన్ రికార్డు.. రెండో రోజే అన్ని మిలియన్లా!
తెలుగు సినీ ఇండస్ట్రీతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. వరుస సినిమాలతో సందడి చేస్తోన్న యంగ్ హీరో విశ్వక్ సేన్. కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన చిత్రాలను చేస్తోన్న అతడు.. ఇటీవలే 'ఓరి దేవుడా' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అశ్వత్ మరిముత్తు తెరకెక్కించిన ఇది 'ఓ మై కడవులే' అనే తమిళ చిత్రానికి రీమేక్‌గా వచ్చింది. ఈ సినిమాను అక్టోబర్ 21వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీనికి పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లను మాత్రం ఆశించినట్లుగా రాణించలేదు. దీంతో ఈ చిత్రం సెమీ హిట్‌తో సరిపెట్టుకుంది.
సినిమా హాళ్లలో బాగానే సందడి చేసిన విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా' మూవీని అనుకున్న సమయానికి కంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ మూవీని విడుదలైన నాలుగు వారాల లోపే అంటే నవంబర్ 11వ తేదీ నుంచే ఆహా సంస్థలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అందులో కూడా ఈ చిత్రానికి ఆశించిన దాని కంటే ఎక్కువ స్పందన దక్కుతోంది. థియేటర్లలో మిస్ అయిన చాలా మంది వీక్షకులు ఆహాలో ఈ సినిమాను చూస్తున్నారు. దీంతో ఈ చిత్రానికి చాలా తక్కువ సమయంలోనే మంచి వ్యూస్ దక్కుతున్నాయి.

విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'ఓరి దేవుడా' మూవీ ఆహాలో వంద మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను సాధించింది. అది కూడా కేవలం నలభై గంటల్లోనే ఈ చిత్రం ఈ మార్కును చేరుకుంది. తద్వారా విశ్వక్ సేన్ కెరీర్‌లోనే అదిరిపోయే రికార్డును ఈ సినిమా అందుకుంది. అంతేకాదు, ఆహాలో వేగంగా వంద మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను అందుకున్న చిత్రాల జాబితాలోనూ ఇది చోటు దక్కించుకుంది. దీనిపై అటు ఆ ఓటీటీ సంస్థతో పాటు చిత్ర యూనిట్ కూడా ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ మేరకు సదరు సంస్థ 'అర్జున్ అండ్ అను అందరి హృదయాలు ఎలా గెలిచారు? ఓరి దేవుడా రికార్డులు బ్రేక్ చేస్తోంది' అని ట్వీట్ చేసింది.
ఇక, 'ఓరి దేవుడా' మూవీలో మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కామియో రోల్ చేశారు. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లపై పరవ్ వీ పొట్లూరి నిర్మించారు. లియాన్ జేమ్స్ దీనికి సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











