Oscars 2026: ఆస్కార్ రేసులోని భారతీయ బ్లాక్‌బస్టర్ మూవీస్.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
Oscars 2026: సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ మొదలైంది. 98వ ఆస్కార్ అవార్డుల దిశగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS) విడుదల చేసిన జనరల్ ఎంట్రీ లిస్ట్'లో భారతీయ సినిమాలు చోటుదక్కించుకున్నాయి. మొత్తం 317 సినిమాలు వివిధ విభాగాల్లో అర్హత సాధించగా, అందులో ఉత్తమ చిత్రం (Best Picture) కేటగిరీ కోసం 201 సినిమాలు ఎంపికయ్యాయి. ఈ జాబితాలో భారత్ నుంచి ఐదు సినిమాలు చోటు దక్కించుకోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ సినిమాలు ఏంటీ? ఆ సినిమాలను ఏ ఓటీటీ ప్లాట్పామ్ లో చూడవచ్చు.
గతంలో ఆస్కార్ వేదికపై భారతీయ సినిమాలకు పరిమిత గుర్తింపే లభించింది. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. భారీ బడ్జెట్ హాలీవుడ్ చిత్రాలతో పాటు, మన ప్రాంతీయ సినిమాలు కూడా సమానంగా పోటీ పడుతున్నాయంటే... భారతీయ సినిమా స్థాయి ఎంతగా పెరిగిందో అర్థమవుతోంది. ముఖ్యంగా ఈసారి పోటీలో నిలిచిన సినిమాలు కేవలం ఆర్ట్ సినిమాలు కాదు... బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్లు కావడం విశేషం.

కాంతార 1 (Kantara: A Legend - Chapter 1)
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార 1 (Kantara: A Legend - Chapter 1) ఆస్కార్ రేసులో నిలిచింది. 2022లో వచ్చిన కాంతార మూవీకి ప్రీక్వెల్‌గా రూపొందిన సినిమా ఇది. తులునాడు ప్రాంతంలో దైవారాధన సంప్రదాయాల మూలల ఆధారం తెరకెక్కించారు. 2025లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.850 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, కన్నడ సినిమా స్థాయిని గ్లోబల్ మార్కెట్‌లో మరో మెట్టు పైకి తీసుకెళ్లింది.
OTT ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో (కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది)
మహావతార్ నరసింహ (Mahavatar Narasimha)
భారతీయ యానిమేషన్ రంగానికి గర్వకారణంగా నిలిచిన సినిమా మహావతార్ నరసింహ (Mahavatar Narasimha). భగవాన్ విష్ణువు నాలుగో అవతారమైన నరసింహుడి కథను ఆధునిక 3D టెక్నాలజీతో తెరకెక్కించిన ఈ సినిమా, భారతీయ యానిమేషన్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.325 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.యానిమేటేడ్ ఫిచర్స్ ఫిల్మి విభాగంలో ఆస్కార్ అవార్డు గెలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
OTT ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్ (హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం)
తన్వి ది గ్రేట్ (Tanvi The Great)
వెటరన్ నటుడు అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించిన తన్వి ది గ్రేట్ (Tanvi The Great) మూవీ కూడా ఆస్కార్ రేసులో నిలవడం పెద్ద సర్ప్రైజ్‌గా మారింది. ఆటిజం స్పెక్ట్రమ్‌లో ఉన్న యువతి, తన తండ్రి కలను నెరవేర్చేందుకు భారత సైన్యంలో చేరాలనే లక్ష్యంతో చేసే ప్రయాణమే ఈ సినిమా కథ. భావోద్వేగాలతో పాటు ప్రేరణాత్మక కథనంతో రూపొందిన ఈ సినిమా, అకాడమీ సభ్యులను ఆకట్టుకునే అవకాశముందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
OTT అప్‌డేట్:థియేటర్ల తర్వాత త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశం
టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family)
యంగ్ అండ్ న్యూ డైరెక్టర్ అభిషన్ జీవింత్ తెరకెక్కించిన తమిళ సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ(Tourist Family). ఫీల్-గుడ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. శ్రీలంక నుంచి తమిళనాడుకు వలస వచ్చిన ఒక కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక, సామాజిక సమస్యలను మానవీయంగా చూపించిన ఈ సినిమా, థియేటర్లలో రూ.90 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఆస్కార్ బెస్ట్ ఫిక్చర్ రేసులో చోటు దక్కించుకోవడం విశేషం.
OTT ప్లాట్‌ఫామ్: జియో హాట్‌స్టార్ (తెలుగు వెర్షన్‌తో సహా అందుబాటులో ఉంది)
సిస్టర్ మిడ్‌నైట్ ( Sister Midnight)
యూకే-ఇండియా కో-ప్రొడక్షన్‌గా రూపొందిన సిస్టర్ మిడ్‌నైట్ (Sister Midnight) అంతర్జాతీయ అవార్డ్ సర్క్యూట్‌లో మంచి బజ్ సృష్టిస్తోంది. రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటించిన ఈ డార్క్ కామెడీ-థ్రిల్లర్, లేడీ ఓరియెంట్ స్టోరీతో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
OTT ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ (ప్రాంతాలవారీగా అందుబాటులో ఉంది)
హోమ్‌బౌండ్ (Homebond)
భారత్ తరఫున 'హోమ్ బౌండ్' మూవీ అధికారిక ఎంట్రీ సాధించింది. 'ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్' విభాగంలో ఈ సినిమా పోటీ పడనుంది. ఈ కేటగిరీలో టాప్-15 షార్ట్‌లిస్ట్ లో నిలిచింది. ఇది నామినేషన్ దశకు చేరితే భారతీయ సినిమాకు మరో చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుంది. ఈ చిత్రం నామినేషన్ దశకు చేరితే, అది కేవలం ఒక సినిమా విజయం మాత్రమే కాదు... భారతీయ సినిమాకు మరో చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక 98వ అకాడమీ అవార్డ్స్ కు సంబంధించిన తుది నామినేషన్ల జాబితాను జనవరి 22న ప్రకటించనుండగా, ప్రధాన ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 15న లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుంది. గతంలో RRR చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ గెలిచి చరిత్ర సృష్టించగా, ఇప్పుడు మళ్లీ ఐదు భారతీయ సినిమాలు ప్రధాన విభాగాల్లో పోటీలో నిలవడం మన సినిమా గ్లోబల్ స్థాయిలో ఎదిగిందని సూచిస్తోంది.ఈసారి కూడా ఆస్కార్ వేదికపై భారత్ మరో చరిత్ర రాస్తుందా? అన్నది ఉత్కంఠగా మారింది.


Click it and Unblock the Notifications











