Love Today సూపర్ హిట్ గా 'లవ్ టుడే'.. వారం రోజులకే ఓటీటీలో.. ఎక్కడ అంటే?
తమిళ సినీ ఇండస్ట్రీలో మొదటి సినిమాతో సూపర్ క్రేజ్ అందుకున్న డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్. 2019లో వచ్చిన కోమలి సినిమాను తెరకెక్కించి బెస్ట్ డెబ్యుటంట్ డైరెక్టర్ గా సైమా అవార్డు అందుకున్నాడు. తాజాగా మరోసారి తన దర్శకత్వ ప్రతిభ చూపించిన చిత్రం లవ్ టుడే. ఎలాంటి అంచనాలు లేకుండా తమిళనాట నవంబర్ 4న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి తీసుకొచ్చారు. నవంబర్ 25న తెలుగులో విడుదలైన ఈ యూత్ ఫుల్ లవ్ అండ్ ఫన్ రొమాంటిక్ మూవీ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో లవ్ టుడే సినిమా ఓటీటీ విడుదల తేదిని ప్రకటించారు.

రూ. 5 కోట్లకు రూ. 70 కోట్లు..
సోషల్ ఎలిమెంట్స్ కు కామెడీ హంగులను అద్ది ఫైనల్ గా మంచి మెసేజ్ ఇవ్వడం డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ స్టైల్. అలా 2019లో కోమలి సినిమాను తెరకెక్కించి విజయం సాధించారు. ఈ సినిమాలో జయం రవి, కాజల్ అగర్వాల్, సంయుక్త హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ఈసారి అతనే హీరోగా మరి స్వీయ దర్శకత్వంలో నటించి తెరకెక్కించిన మూవీ లవ్ టుడే. సుమారు రూ. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట రూ. 70 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. తమిళంలో వసూళ్ల పరంగా దుమ్ములేపుతున్న ఈ సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేసి అదే టైటిల్ తో రిలీజ్ చేశారు.

వసూళ్ల పరంగా జోరు..
ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించి హీరోగా మెప్పించిన ఈ లవ్ టుడే చిత్రం థియేట్రికల్ హక్కులను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. అందులో భాగంగానే నవంబర్ 25న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. సినిమా తొలి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా కూడా జోరు చూపిస్తుంది. ఈ చిత్రానికి రెండు రోజుల్లో సుమారు రూ. 2.40 కోట్లు వసూళైనట్లు సమాచారం. ఇలా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న ఈ చిత్రం ఓటీటీ విడుదలను ప్రకటించి షాక్ ఇచ్చింది సదరు డిజిటల్ ఫ్లాట్ ఫామ్. అయితే లవ్ టుడే సినిమాకు సోమవారం తర్వాత వసూళ్లు అంతగా రాకపోవచ్చని ఒక టాక్ వినిపిస్తోంది.

నెట్ ఫ్లిక్స్ అప్పటి నుంచి..
తెలుగులోకి డబ్ అయి వచ్చిన తమిళ మూవీ లవ్ టుడే డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను డిసెంబర్ 2 నుంచి ప్రసారం చేయనుంది. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది. ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ లవ్ టుడే చిత్రాన్ని తమిళంతోపాటు తెలుగు భాషలోనూ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ కు జోడిగా ఇవానా నటించి ఆకట్టుకుంది. అలాగే రాధిక, సత్యరాజ్, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వారం రోజుల్లోనే ఓటీటీలోకి విడుదల చేయడం గమనార్హం.


Click it and Unblock the Notifications











