రికార్డ్ వసూళ్లతో సంచలనం.. రాజు వెడ్స్ రాంబాయి ఓటీటీలోకి ఎప్పుడు? ఎందులో అంటే?
చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది రాజు వెడ్స్ రాంబాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ రూరల్ డ్రామా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా యువత బాగా కనెక్ట్ అవుతున్నారు. రోజు రోజుకు ఈ సినిమా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇంతటి సంచలన విజయం సాధించిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ఇప్పుడు అందరి ఆసక్తి నెలకొంది. ఈ వివరాల్లోకి వెళితే...
సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్వినీ రావు హీరో హీరోయిన్లుగా నటించగా.. శివాజీ రాజా, చైతన్య జొన్నలగడ్డ, అనితా చౌదరిలు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. వాజీద్ బేగ్ సినిమాటోగ్రాఫర్‌గా, నరేష్ అడుపా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. సురేష్ బొబ్బిలి సంగీత దర్శకత్వం వహించారు. ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్స్‌లో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవిలు ఈ చిత్రాన్ని నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటిలు ఈ సినిమాను విడుదల చేశారు.

రాజు వెడ్స్ రాంబాయి బ్రేక్ ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార ఖర్చులు కలిపి రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు 3 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 3 కోట్ల రూపాయల షేర్.. 6 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
రాజు వెడ్స్ రాంబాయి కలెక్షన్స్
రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు తొలి రోజున ఇండియా వైడ్‌గా 1.15 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.15 కోట్ల రూపాయలు, మూడో రోజున 2.5 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.31 కోట్ల రూపాయలు చొప్పున 7.10 కోట్ల రూపాయల నికర వసూళ్లు.. 8 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఓవర్సీస్‌లో రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు 50 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఈ ప్రేమకథా చిత్రానికి ఇప్పటి వరకు 9.08 కోట్ల రూపాయలు వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో రాజు వెడ్స్ రాంబాయి సినిమా మరిన్ని వసూళ్లు సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రాజు వెడ్స్ రాంబాయి ఏ ఓటీటీలో అంటే?
బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపించగా.. నిర్మాత బన్నీవాసు వీటికి చెక్ పెట్టారు. సాధారణంగా తెలుగు సినిమాలన్నీ థియేటర్‌లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. అయితే రాజు వెడ్స్ రాంబాయి మూవీ ఈ నిబంధనను పక్కనపెట్టింది. 50 రోజుల తర్వాతే ఈ సినిమా థియేటర్‌లో విడుదలవుతుందని బన్నీ వాసు స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. రాజు వెడ్స్ రాంబాయి చిత్రం జనవరి 10వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ మధ్య ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. థియేటర్‌కు, ఓటీటీ రిలీజ్‌కు మధ్య అంతరం సాధారణం కంటే ఎక్కువగా ఉన్నందున.. ఇంట్లో చూడాలని అనుకుంటున్న వారు థియేటర్‌కు వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











