షో చూపిస్తానంటోన్న రానా .. కొత్త అవతారంలో భల్లాలదేవుడు .. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ?
కరోనా సమయంలో ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో అందుబాటులోకి వచ్చిన ఓటీటీలు బాగా క్లిక్ అయ్యాయి. ఓ సినిమాకు పెట్టే ఖర్చుతో ఏడాది మొత్తం ఇంట్లోనే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్, ఒరిజినల్ కంటెంట్ చూసే అవకాశం రావడంతో మధ్య తరగతి వర్గాల ప్రజలు ఓటీటీలకు బాగా అలవాటు పడుతున్నారు. ఇక స్టార్స్ సైతం ఈ ఓటీటీల రాకతో హోస్ట్‌లుగా అవతారమెత్తుతున్నారు. తెలుగులో ఇప్పటికే గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ .. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే పేరిట ఆహా ఓటీటీలో సందడి చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి యువ హీరో రానా దగ్గుబాటి చేరారు. ఈ వివరాల్లోకి వెళితే..
మూవీ మొఘల్ డాక్టర్ డి. రామానాయుడు కుటుంబం నుంచి వచ్చిన మూడో తరం నటుడు రానా . ఆరడుగులకు పైగా హైట్‌తో పర్ఫెక్ట్ హీరో మెటీరియల్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్ ద్వారా హీరోగా మొదలుపెట్టిన రానా.. భాషా బేధం లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రోటీన్‌కు భిన్నంగా వైవిధ్యమైన చిత్రాలను ఏరి కోరి చేశారు రానా. కృష్ణం వందే జగద్గురుమ్, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలు ఇలాంటివే.

హీరోగా ఎదుగుతున్న దశలో విలన్ అవతారమెత్తి తనలోని మరో కోణాన్ని చూపించాడు రానా. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సిరీస్‌లో భల్లాలదేవుడిగా భయపెట్టారు. తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్యారెక్టర్‌లో నటించారు. తర్వాత అరణ్య, భీమ్లా నాయక్, విరాట పర్వం, 1945, వెట్టయన్ చిత్రాలు రానాకు మంచి పేరు తీసుకొచ్చాయి.
హీరోగానే కాదు విలన్‌గా, విజువల్ ఎఫెక్ట్స్ కో ఆర్డినేటర్‌గా, టెలివిజన్ ప్రెజెంటర్‌గా, నిర్మాతగానూ చిత్ర పరిశ్రమకు సేవలందిస్తున్నారు రానా. మిహికా బజాజ్‌ను ప్రేమించి పెళ్లాడిన ఆయన ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓటీటీ లవర్స్‌ను అలరించేందుకు రెడీ అయ్యారు రానా. ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్‌లో ఓ షోకు హోస్ట్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. ది రానా దగ్గుబాటి షో పేరుతో నవంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

మొత్తం 8 ఎపిసోడ్లుగా ఈ సిరీస్ ప్రసారం కానుంది. ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించడంతో పాటు రానా దగ్గుబాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నాడు. దుల్కర్ సల్మాన్, నాగచైతన్య, సిద్ధూ జొన్నలగడ్డ, నాని, రాజమౌళి, శ్రీలీల, రామ్ గోపాల్ వర్మ వంటి వారిని రానా ఇంటర్వ్యూ చేయనున్నారని ఫిలింనగర్ టాక్. అయితే ఫస్ట్ ఎపిసోడ్‌కి ఎవరు గెస్ట్‌గా రాబోతున్నారన్నది మాత్రం నిర్వాహకులు చెప్పలేదు. అయితే గతంలో నెంబర్ వన్ యారి పేరుతో రానాకు హోస్ట్‌గా చేసిన అనుభవం ఉంది. మరి కొత్త షోలో రానా ఎలాంటి మేజిక్ చేస్తాడో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











