నరకం చూపిస్తున్నారు.. చచ్చిపోవాలనుంది: యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఓటీటీ రంగం వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో, వెబ్ సిరీస్‌ల ద్వారా కొత్త నటీనటులకు మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే తెరపై కనిపించే గ్లామర్ వెనుక ఎన్నో సమస్యలు, ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు కూడా దాగి ఉంటాయనే విషయం మరోసారి బయటపడింది. ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో ప్రసారమవుతున్న రిస్టార్( Resort) వెబ్ సిరీస్‌కు సంబంధించిన వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ సిరీస్‌లో నటిస్తున్న యువ నటి అనుగ్రహ నంబియార్ ( Anugraha Nambiar) మేకర్స్‌పై చేసిన ఆరోపణలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇంతకీ ఏమన్నారు?
ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న 'రిసార్ట్' వెబ్ సిరీస్‌లో అనుగ్రహ 'శ్రీనిధి' అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. సిరీస్‌కు మంచి ఆదరణ లభిస్తున్నప్పటికీ, తన వ్యక్తిగత పరిస్థితి మాత్రం దారుణంగా మారిందని ఆమె తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఒక ఏడాది ఒప్పందం చేసుకున్నానని, ఆ ఒప్పందం ప్రకారం ఇతర ప్రాజెక్టుల్లో నటించవద్దని షరతులు పెట్టారని వెల్లడించారు. అయితే గత నాలుగు నెలలుగా షూటింగ్‌కు పిలవకుండా తనను ఖాళీగా ఉంచారని, మరోవైపు ఇతర అవకాశాలు కూడా రాకుండా అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. దీంతో పని లేక, ఆదాయం లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు.

"కనీసం భోజనం చేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చింది" అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు, ఆర్థిక ఒత్తిడి కారణంగా తన ఆరోగ్యం కూడా క్షీణించిందని తెలిపారు. తీవ్ర మానసిక ఒత్తిడితో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని, ఫిట్స్ వంటి సమస్యలు కూడా ఎదురయ్యాయని వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో కూడా యూనిట్ సభ్యులు ఎలాంటి సహాయం చేయలేదని ఆమె ఆరోపించారు. ఇక పారితోషికం గురించి అడిగితే తనను దారుణంగా అవమానించారని, బూతులు తిట్టారని కూడా పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో విజయ్ కుమార్ రాజేంద్రన్, నక్షత్ర మూర్తి పేర్లను ప్రస్తావిస్తూ తనపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు.
కేరళకు చెందిన అనుగ్రహ నంబియార్‌కు మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషలపై మంచి పట్టు ఉందని సమాచారం. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన ఆమెకు 'రిసార్ట్' సిరీస్ మంచి బ్రేక్ అవుతుందని భావించారు. కానీ అదే ప్రాజెక్ట్ ఇప్పుడు తన కెరీర్‌ను దెబ్బతీస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "నాకు రెమ్యునరేషన్ ఇవ్వడం లేదు.. నరకం చూపిస్తున్నారు.. ఇక చచ్చిపోవాలనిపిస్తోంది' అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలతో వెబ్ సిరీస్ టీమ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఆరోపణలపై మరోవైపు నిర్మాతల తరఫున కూడా స్పందనలు వచ్చాయి. నక్షత్ర మూర్తి మాట్లాడుతూ.. అనుగ్రహ చెబుతున్నవన్నీ అబద్ధాలని, ఇది ముందే ప్లాన్ చేసిన డ్రామా అని ఆరోపించారు. తమపై వస్తున్న విమర్శలను ఆమె ఖండించారు. తర్వాత నటుడు విజయ్ కుమార్ రాజేంద్రన్ కూడా స్పందిస్తూ తన వాదన వినిపించారు. అనుగ్రహకు వ్యక్తిగత అత్యవసర పరిస్థితుల్లో రూ.25,000 అడ్వాన్స్ ఇచ్చామని, అందులో పెద్ద భాగం ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదని పేర్కొన్నారు. షూటింగ్ రోజున మరో ఆడిషన్‌కు వెళ్లేందుకు అనుమతించడమే కాకుండా, ఒకే సీన్ షూట్ చేసినా పూర్తి డే పేమెంట్ ఇచ్చామని చెప్పారు.
అలాగే ఆమెకు ఏ పాత్ర ఇస్తున్నామో ముందే తెలుసని, దాదాపు రెండు నెలలు షూటింగ్ చేసిన తర్వాతే కాంట్రాక్ట్ సైన్ చేసిందని తెలిపారు. కథలో లవ్ ట్రయాంగిల్ ట్రాక్ వచ్చిన తర్వాతే ఆమె వీడియోలు విడుదల చేసిందని, తన స్థానంలో మరొకరిని పెట్టలేమనే ఉద్దేశంతో ఇలా చేసిందని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, పరువునష్టం దావా వేయబోతున్నానని విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ వివాదంలో తన భార్య పేరు కూడా లాగబడటం బాధాకరమని పేర్కొన్నారు.
ఇలా ఇరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొందరు అనుగ్రహకు మద్దతుగా నిలుస్తుంటే, మరికొందరు పూర్తి నిజాలు బయటకు రావాలని కోరుతున్నారు. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే నటీనటులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావడం బాధాకరమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 'రిసార్ట్' వెబ్ సిరీస్ చుట్టూ మొదలైన ఈ వివాదం ఇంకా ముగిసినట్లు కనిపించడం లేదు. నిజానిజాలు ఏమిటి? ఎవరి వాదనలో నిజం ఉంది? అనేది రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ వ్యవహారం సినీ, ఓటీటీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications