Maa Oori Polimera 2: ఒకరోజు ముందే ఓటీటీలోకి పొలిమేర 2.. కానీ ఒక కండీషన్
తెలుగు చిత్ర పరిశ్రమలో సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌తో సాగే సినిమాలు భారీ సంఖ్యలో వస్తున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ఓ రేంజ్‌లో ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుని సక్సెస్ అవుతున్నాయి. అలాంటి వాటిలో ఇటీవలే విడుదలైన 'మా ఊరి పొలిమేర 2' సినిమా ఒకటి. నేరుగా ఓటీటీలో విడుదలై బిగ్ హిట్ అయిన 'పొలిమేర'కు ఇది సీక్వెల్‌గా రూపొందింది.
సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమానే 'మా ఊరి పొలిమేర 2'. అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ మూవీని భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. దీనికి తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీగా వచ్చింది. ఫలితంగా ఈ మూవీ కోట్ల లాభాలను సొంతం చేసుకుంది.

సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన 'మా ఊరి పొలిమేర 2' మూవీపై ఆరంభం నుంచీ అంచనాలు నెలకొనడంతో.. దీని డిజిటల్ రైట్స్‌కు భారీ స్థాయిలో పోటీ ఏర్పడింది. తీవ్ర డిమాండ్ నడుమ ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ఫేమస్ తెలుగు సంస్థ ఆహా దక్కించుకుంది. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు భారీ మొత్తాన్నే చెల్లించినట్లు తెలిసింది.
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'మా ఊరి పొలిమేర' సినిమాను థియేటర్లలో విడుదలైన 30 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా ఆహా సంస్థతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని ఓ న్యూస్ ప్రచారం అయింది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని డిసెంబర్ 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించారు. కానీ, ఈ అర్ధరాత్రి నుంచే ఆ ఓటీటీలో ప్రత్యక్షం అయిపోయింది.

'మా ఊరి పొలిమేర 2' సినిమాను ఆహా సంస్థ నేటి నుంచే అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే, ఇప్పుడు ఈ చిత్రాన్ని చూడాలనుకున్న వాళ్లు మాత్రం 'ఆహా గోల్డ్' మెంబర్‌షిప్‌ను తీసుకోవాల్సి ఉంటుందని ఓ కండీషన్ పెట్టింది. లేకుంటే సాధారణ మెంబర్‌షిప్ ఉన్న వాళ్లు డిసెంబర్ 8వ తేదీ నుంచి ఆహాలో వీక్షించవచ్చు. దీంతో కొందరు పోటీ పడుతున్నారు.
ఇదిలా ఉండగా.. విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'మా ఊరి పొలిమేర 2' మూవీలో కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శ్రీను, రాకేందు మౌళి తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరీ కృష్ణ నిర్మించారు. దీనికి జ్ఞాని సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











