ఓటీటీలోకి వచ్చేసిన ఫీల్ గుడ్ మూవీ.. ఫ్యామిలీ అంతా చూసే ఇది ఎందులో ఉందంటే!
టాలీవుడ్‌లో ఎక్కువగా సీరియస్ లేదా మాస్ మూవీలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అప్పుడప్పుడూ ఫ్యామిలీ స్టోరీలతో వచ్చే సినిమాలు కూడా హిట్లను సొంతం చేసుకోవడంతో పాటు ప్రశంసలు దక్కించుకుంటున్నాయి. దీంతో ఈ తరహా చిత్రాలు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. అలా గత మార్చి నెలలో విడుదలైన చిత్రమే 'షరతులు వర్తిస్తాయి'.
'30 వెడ్స్ 21' వెబ్ సిరీస్‌తో సెన్సేషన్ అయిన చైతన్య రావు హీరోగా నటించిన తాజా చిత్రమే 'షరతులు వర్తిస్తాయి'. కుమారస్వామి తెరకెక్కించిన ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ స్టోరీతో రావడంతో ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా 'షరతులు వర్తిస్తాయి' మూవీ మార్చి 15న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

చైతన్య రావు ప్రధాన పాత్రలో నటించిన 'షరతులు వర్తిస్తాయి' మూవీకి డీసెంట్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన చాలా తక్కువగానే వచ్చింది. దీంతో ఈ చిత్రం కలెక్షన్లను అంతగా వసూలు చేయలేదు. తద్వారా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సైతం చేరుకోలేకపోయింది. అయినా రివ్యూ రైటర్ల నుంచి ప్రశంసలు అందుకుంది.
చైతన్య రావు - కుమారస్వామి కాంబినేషన్‌లో రూపొందిన 'షరతులు వర్తిస్తాయి' మూవీ థియేటర్లలో అంతగా ప్రదర్శన చేయకపోవడంతో ఇది ఓటీటీలోకి త్వరగానే వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, రెండు నెలలు గడిచినా అలా జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రంపై తెలుగు ఓటీటీ సంస్థ ఆహా అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

భావోద్వేగాలతో కూడిన ఫ్యామిలీ కథతో రూపొందిన 'షరతులు వర్తిస్తాయి' మూవీని తాజాగా ఆహా సంస్థ అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీంతో గత అర్ధరాత్రి నుంచే ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆహా 'మధ్య తరగతి వాడు తిరగబడితే ఎలా ఉంటుందో చూపిస్తా' అని హీరో చెప్పే డైలాగ్ ప్రోమోను షేర్ చేసింది. ఇక, ఈ చిత్రం ఓటీటీలో ఏమేర రాణిస్తుందో చూడాలి.
ఇదిలా ఉండగా.. చైతన్య రావు హీరోగా చేసిన 'షరతులు వర్తిస్తాయి' సినిమాలో భూమిక శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని స్టార్ లైట్స్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై శ్రీలత, నాగార్జున్ సామలలు నిర్మించారు. అరుణ్ చిలువేరు, సురేష్ బొబ్బిలి ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. ఇందులో నంద కిశోర్, సంతోష్ యాదవ్, మల్లేష్ తదితరులు కీలక పాత్రలు చేశారు.


Click it and Unblock the Notifications











