OTTలోకి సెన్సేషన్ క్రియేట్ చేసిన రియల్ క్రైమ్ థ్రిల్లర్... ఎందులో చూడాలంటే?
ఫిల్మ్ ఇండస్ట్రీలో నిజ జీవిత కథల ఆధారంగా సినిమాలు తెరకెక్కించడం ఎప్పటి నుంచో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఓటీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత రియల్ లైఫ్ క్రైమ్ స్టోరీస్‌ను ఎక్కువగా తెరకెక్కిస్తున్నారు. ఎందుకంటే ఓటీటీలో వీటికి మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో వెబ్ సిరీస్‌ల రూపంలో క్రైమ్ థ్రిల్లర్స్‌ను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు మేకర్స్. మరీ ముఖ్యంగా డాక్యుమెంటరీలకు మంచి ఆదరణ లభిస్తుండం వల్ల మేకర్స్ వీటినే తెరకెక్కిస్తున్నారు. రీసెంట్గా కూడా 'కర్రీ అండ్ సైనైడ్' అనే రియల్ క్రైమ్ థ్రిల్లర్ టాప్ ట్రెండింగ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సెన్సేషనల్ రియల్ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్కు రెడీ అయింది. దాని గురించే ఈ కథనం..
దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన కేసుల్లో 'షీనా బోరా' హత్య కేసు కూడా ఒకటి. 2012లో షీనా బోరా హత్య జరిగింది. కానీ 2015లోకి ఈ కేసు వెలుగులోకి వచ్చి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కన్నతల్లే సొంత కూతురిని చంపేసిందన్న విషయం తెలిసి దేశ ప్రజలంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఎన్నో మలుపులు తిరిగిన ఈ మిస్టరీ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఇంద్రాణి ముఖర్జీ ఆరున్నారేళ్లు జైలు శిక్షను అనుభవించి 2022 మే నెలలో జైలు నుంచి విడుదలైంది.

అసలేం జరిగిందంటే ? : ఓ కేసులో అరెస్టైన ఇంద్రాణీ ముఖర్జియా డ్రైవర్‌ను విచారించగా ఈ హత్యు కేసును బయటపెట్టాడు. దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం ఇంద్రాణీ తన మొదటి భర్త నుంచి విడిపోయింది. ఆ తర్వాత తన కుమార్తె షీనా, కుమారుడు మైఖెల్‌ను గువాహటిలోని తల్లిదండ్రుల వద్ద ఉంచింది. ఈ క్రమంలోనే కొన్నాళ్లకు ఆమె సంజీవ్ ఖన్నా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని, ఆ తర్వాత అతడి నుంచి కూడా డివొర్స్ అందుకుంది. అనంతరం ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్ పీటర్ ముఖర్జియాను పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలోనే పెద్దయ్యాక తల్లి గురించి తెలుసుకున్న షీనా ముంబయికి వెళ్లి ఆమెను కలిసింది.
ఆ తర్వాత పీటర్ మొదటి భార్య కుమారుడైన రాహుల్‌తో షీనాకు మంచి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారితీసింది. ఈ విషయంలో తల్లీ కుమార్తెల మధ్య గొడవలు పడేవారు. ఫైనాన్షియల్‌గా కూడా ఎన్నో విభేదాలు తలెత్తాయి. దీంతో కోపాన్ని పెంచుకున్న ఇంద్రాణీ, తన రెండో భర్త సంజీవ్, డ్రైవర్ శ్యామ్ రాయ్ సాయంతో కుమార్తె షీనాను హత్య చేసింది. ఈ విషయం దర్యాప్తులో తేలింది. అనంతరం షీనా మృతదేహాన్ని రాయ్‌గఢ్‌లోని ఓ అటవీ ప్రాంతంలో కాల్చేసినట్లు తెలిసింది.

ఈ విషయం 2015లో వెలుగులోకి వచ్చింది. అప్పుడు పోలీసు ఆఫీసర్స్ ఆ అటవీ ప్రాంతానికి వెళ్లి షీనా అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ కేసులో ఇంద్రాణీ, సంజీవ్‌లతో పాటు పీటర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారికి న్యాయస్థానం జైలు శిక్షను విధించింది. అలా జైల్లోనే ఇంద్రాణీ - పీటర్ వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పడింది. 2019లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
ఇప్పుడీ కేసు తాజాగా దృశ్యరూపంలో వచ్చేందుకు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఇది స్ట్రీమింగ్కు సిద్ధం అయింది. 'ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ : బరీడ్ ట్రూత్' పేరుతో ఫిబ్రవరి 24 నుంచి ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్. ఇందులో షానా లెవీ, ఉరాజ్ బహల్ ముఖ్య పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











