#BFF Web Series review సిరి హన్మంతు, రమ్య పసుపులేటి గ్లామర్ షో.. కొత్తదనం కనిపించని వెబ్ సిరీస్
తెలుగులో వెబ్ సిరీస్ ట్రెండ్ భారీగానే కనిపిస్తున్నది. ఓటీటీ అందుబాటులోకి రావడంతో ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా ఫ్యామిలీ, యూత్, క్రైమ్ లాంటి అంశాలతో కంటెంట్‌ను అందించే ప్రయత్నం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ #BFF. హిందీలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న అడల్టింగ్ అనే వెబ్ సిరీస్ ఆధారంగా రూపొందింది. అడల్టింగ్‌లో అయేషా ఆహ్మద్, యశష్మిని దయానా, విరాజ్ గెహ్లానీ తదితరులు నటించారు. తెలుగులో సిరి హన్మంతు, రమ్య పసుపులేటి, అంజలి, ప్రణీత పట్నాయక్, శోభన్ నటించారు. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

#BFF గురించి
#BFF వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. హైదరాబాద్ లాంటి మహానగరంలో విభిన్న అభిరుచులు, స్వతంత్ర భావాలున్న ఇద్దరు అమ్మాయిల జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలకు తెర రూపం ఈ వెబ్ సిరీస్. ఐదు ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్‌లో ఒక్కో ఎపిసోడ్ సుమారు 20 నుంచి 25 నిమిషాలు నిడివిని కలిగి ఉంది. ఎపిసోడ్1: అయ్యోయ్యో.. జేబులు ఖాళీ అయ్యనే.., ఎపిసోడ్ 2: అమ్మా మేము హైదరాబాద్, ఎపిసోడ్ 3: ఒట్టు తీసి గట్టు మీద పెట్టు, ఎపిసోడ్ 4: బాస్ బాధితులు, ఎపిసోడ్ 5: అప్పుడు ఇప్పుడు అనే కేటగిరిలతో ఉన్నాయి.

#BFF కథ ఏమిటంటే?
నిత్యా కొటారి (సిరి హన్మంతు), తారా యాదవ్ (రమ్య పసుపులేటి) హైదరాబాద్‌లో తమకు నచ్చినట్టుగా సమాజ కట్టుబాట్లకు దూరంగా బతికే ఆధునిక యువతులు. మద్యం, సిగరెట్లు, బాయ్‌ఫ్రెండ్స్, పబ్, హోటల్స్ కల్చర్‌తో జీవనం సాగిస్తుంటారు. వారి జీవితాలను పెద్దగా ప్రభావితం చేసినట్టు సంఘటనలు కనిపించవు. అడపదడపా ఆఫీసులో బాస్ వేధింపులు, ఇంటి ఓనర్ నస పక్కన పెడితే.. సరదాగా వారి జీవితాలు సాగిపోతున్నట్టు కనిపిస్తాయి.

#BFF ఎలా ఉందంటే
అయితే ఈ వెబ్ సిరీస్‌లో అమ్మాయిల జీవితాల మధ్య భావోద్వేగమైన బంధం సరిగా ఎస్టాబ్లిష్ కాలేదని చెప్పవచ్చు. ఏదో చిన్న చిన్న సంఘటనలు, నేటి జనరేషన్‌లో అమ్మాయిలు ఎలా బతకాలని అనుకొంటున్నారు. ఎలా బతుకుతున్నారనే రొటీన్ విషయాలనే తెరపైన చూపించే ప్రయత్నం చేశారు. ఐదు ఎపిసోడ్‌లో ప్రేక్షకుడికి పెద్దగా కనెక్ట్ అయ్యే సీన్లు కనిపించవు. చివరకు ఈ వెబ్ సిరీస్ ద్వారా ఏం చెప్పాలనుకొంటున్నారో అర్ధం కాని పరిస్థితి ప్రేక్షకుడికి ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తుంది.

సిరి హన్మంతు, రమ్య గురించి
నిత్య కొఠారిగా బిగ్‌బాస్ తెలుగు ఫేమ్ సిరి హన్మంతు, తారా యాదవ్‌గా బిగ్‌బాస్ తమిళ్ ఫేమ్ రమ్య పసుపులేటి నటించింది. అయితే ఈ ఇద్దరికి సంబంధించిన క్యారెక్టర్ల బలంగా డిజైన్ చేయలేకపోవడం వల్ల పెద్దగా కనెక్ట్ కావు. తెర మీద గ్లామరస్‌గా తప్పితే.. ఇద్దరు చాలా రొటీన్‌గా కనిపించారు. కొన్ని సన్నివేశాల్లో వారి పెర్ఫార్మెన్స్ బాగుంది. బలమైన కథ, మంచి సన్నివేశాలు లేకపోవడం వల్ల వారు కూడా నటించడానికి ఏమీ లేదని విషయం స్పష్టమవుతుంది. నిత్య కొఠారి తల్లిగా యాంకర్ అంజలి, ఇంటి ఓనర్‌గా ప్రణీత పట్నాయక్ వెబ్ సిరీస్‌లో కనిపించారు.

సాంకేతిక విభాగం పనితీరు
సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే.. కథ, కథనాలకు తగినట్టుగా టీమ్ అంతా న్యాయం చేసేందుకు ప్రయత్నించారు. రొటీన్, రెగ్యులర్‌గా ఉండటంతో ఎడిటర్ బాల మనోజ్, మ్యూజిక్ డైరెక్టర్ నరేన్, సినిమాటోగ్రాఫర్ అభిరాజ్ నాయర్ తమ వంతుగా మంచి అవుట్‌పుట్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. నరేన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అభిరాజ్ నాయర్ హైదరాబాద్ బ్యూటీని మరోసారి అందంగా చూపించారు. ప్రోడక్షన్ వ్యాల్యూస్ బాగా ఉన్నా.. కథ, కథనాల్లో ప్రత్యేకత ఏమీ కనిపించదు.

#BFF గురించి ఫైనల్‌గా
#BFF గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. ఎలాంటి కొత్తదనం లేని రొటీన్ ఫ్యామిలీ డ్రామా. ఈ వెబ్ సిరిస్‌లోని సన్నివేశాలు పేలవంగా ఉన్నాయి. కథ, కథనాలు ఆకట్టుకొనే విధంగా లేవనే చెప్పాలి. ఇప్పటి వరకు గొప్పగా ఆకట్టుకోలేదు. కానీ ఇక ముందు కొత్త ఎపిసోడ్స్ వస్తే.. అందులోనైనా అసలు కథ, ఎమోషన్స్ పండుతాయో వేచి చూడాల్సిందే.

#BFF నటీనటులు, సాంకేతిక నిపుణులు
నటీనటులు: సిరి హన్మంతు, రమ్య పసుపులేటి, అంజలి, ప్రణీత పట్నాయక్, శోభన్ తదితరులు
రచన: శ్రీకాంత్ సలానా
ఎడిటర్: బాల మనోజ్
మ్యూజిక్ డైరెక్టర్: నరేన్ ఆర్కే సిద్దార్థ
సినిమాటోగ్రాఫర్: అభిరాజ్ నాయర్
నిర్మాతలు: అశ్విన్ సురేష్, అదితి శ్రీవాస్తవ, అనిరుధ్ పండిత
దర్శకత్వం: భార్గవ్ మాచర్ల


Click it and Unblock the Notifications











