ఓటీటీలోకి కె.విశ్వనాథ్ చివరి చిత్రం.. ఆ మూవీ ఏదీ? స్ట్రీమింగ్ ఎందులో అంటే?
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో దివంగత కే.విశ్వనాథ్ ఒకరు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్ని ప్రపంచ స్థాయికి తీసుకళ్లి కళాతపస్విగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. చిరకాలం గుర్తుండిపోయే చిత్రాలు.. లోతైన పాత్రలు.. వీనుల విందైన సంగీతంతో కళాఖండాలను అందించారు విశ్వనాథ్. తన ప్రతి సినిమాలోనూ అంతర్లీనంగా సామాజిక సందేశాలను మిళితం చేసి ఎక్కడా అసభ్యతకు, అశ్లీలానికి తావు లేకుండా సినిమాలు తీశారు విశ్వనాథ్. రెండేళ్ల క్రితం తిరిగిరాని లోకాలకు తరలివెళ్లిన ఆయన దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమా దాదాపు 15 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
కళాఖండాలతో కళాతపస్విగా
ఆత్మగౌరవం సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన విశ్వనాథ్.. ఐదు దశాబ్ధాల కెరీర్‌లో 50కి పైగా సినిమాలను తెరకెక్కించారు. శంకరాభరణం, సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, ఆపద్బాంధవుడు, సాగర సంగమం, సిరిసిరి మువ్వలు వంటి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. క్రైమ్, సాంఘిక చిత్రాలు దున్నేస్తున్న సమయంలో క్లాసిక్స్‌తో హిట్ కొట్టారు విశ్వనాథ్. పాశ్చాత్య సంగీతం ఎంట్రీతో భారతీయ సంగీతం మారుతున్న దశలో ఆయన తీసిన శంకరాభరణం ఓ హిస్టరీ. కనక వర్షం కురిపించిన ఈ సినిమాకు సంబంధించి ఎంత చెప్పినా తక్కువే.

అల్లరి నరేష్‌కు అదృష్టం
వృద్ధాప్యంతో పాటు నటుడిగా బిజీ కావడంతో విశ్వనాథ్ దర్శకత్వ బాధ్యతలకు చాలా వరకు దూరంగా ఉన్నారు. ఈ దశలో అల్లరి నరేష్, మంజరీ ఫడ్నిస్ హీరో హీరోయిన్లుగా కే. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం శుభప్రదం. 2010 జూలై 16న విడుదల ఈ సినిమా అప్పట్లో సంచనలం సృష్టించింది. కామెడీ హీరోగా బిజీగా ఉన్న అల్లరి నరేష్‌ను తన సినిమాకు హీరోగా అనుకోవడమే విశ్వనాథ్ సాహసానికి మచ్చుతునక. నరేష్ కూడా విశ్వనాథ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన పరిధి మేరకు రాణించారు.
డిజాస్టర్‌గా శుభప్రదం
శ్రీరాజ రాజేశ్వరి ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై హరిగోపాల కృష్ణమూర్తి, పీఎన్ తిలక్ సంయుక్తంగా శుభప్రదం చిత్రాన్ని నిర్మించారు. ఇందులో శరత్ బాబు, వైజాగ్ ప్రసాద్, గిరిబాబు, రఘుబాబు, అశోక్ కుమార్, దేవదాస్ కనకాల తదితరులు కీలకపాత్రలు పోషించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. చాలా కాలం తర్వాత విశ్వనాథ్ నటించిన చిత్రం కావడం, అందులోనూ అల్లరి పాత్రలకు కేరాఫ్ అయిన అల్లరి నరేష్ హీరో కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే పాటలు హిట్ కాగా.. హీరోయిన్ పాత్ర ఉన్నంత బలంగా, హీరో పాత్ర మెప్పించలేకపోయిందని విమర్శలు వచ్చాయి.
ఓటీటీలోకి శుభప్రదం
బాక్సాఫీస్ వద్ద శుభప్రదం నిరాశ పరిచినా కే. విశ్వనాథ్ లాంటి దిగ్గజంతో పనిచేయడం తన అదృష్టమని నరేష్ పలుమార్లు తెలిపారు. ఆయన కెరీర్‌లోనే శుభప్రదం ఓ మైలురాయిగా నిలిచిపోయింది. అలాంటి ఈ సినిమాను దాదాపు 15 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రముఖ ఓటీటీ సంస్ధ జియో హాట్‌స్టార్ ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు కే. విశ్వనాథ్ మన మధ్యలో లేకపోవడం.. పైగా కళాతపస్వి దర్శకత్వం వహించిన సినిమా కావడంతో శుభప్రదంను చూసేందుకు ఆయన అభిమానులు, సినీ ప్రియులు సిద్ధమవుతున్నారు. మరి ఓటీటీలో శుభప్రదం ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











