Gaalodu OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి గాలోడు.. ఎప్పుడు.. ఎందులో వస్తుందంటే!
తెలుగు బుల్లితెరపై అసాధారణ టాలెంట్లను ప్రదర్శించి.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు సుడిగాలి సుధీర్. అలా సుదీర్ఘ కాలంగా టెలివిజన్ రంగంలో తనదైన రీతిలో హవాను చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలు చేశాడు. ఆ తర్వాత హీరోగానూ మారి కొన్ని సినిమాలు చేశాడు. కానీ, అతడికి నిరాశే ఎదురైంది. ఇలాంటి పరిస్థితుల్లోనే గత ఏడాది సుడిగాలి సుధీర్ 'గాలోడు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరోగా రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించిన చిత్రమే 'గాలోడు'. ఈ సినిమాను గత ఏడాది నవంబర్ 18వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. దర్శక నిర్మాతల నమ్మకాన్ని నిలబెడుతూ ఈ చిత్రానికి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీ స్థాయిలోనే దక్కింది. ఫలితంగా ఈ చిత్రం అత్యధిక కలెక్షన్లను సాధించింది. ఇలా ఫుల్ రన్‌లో రూ. 9.91 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 5.35 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. తద్వారా రూ. 2.35 కోట్లు లాభాలను అందుకుని సత్తా చాటుకుంది.

ఇక, థియేటర్లలో బాగానే సందడి చేసిన 'గాలోడు' మూవీని అనుకున్న సమయానికి కంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, దీనిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సుడిగాలి సుధీర్ నటించిన ఈ మూవీని విడుదలైన మూడు నెలలకు అంటే ఫిబ్రవరి 17వ తేదీ నుంచే ఆహా సంస్థలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రకటనను సదరు సంస్థ అధికారికంగా వదిలింది. దీంతో థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన ప్రేక్షకులంతా ఆహాలో దీన్ని చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.
బుల్లితెర సెన్సేషన్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన 'గాలోడు' మూవీని రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల తెరకెక్కించారు. దీన్ని సంస్కృతి ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయనే స్వయంగా నిర్మించారు. ఈ సినిమాలో గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటించింది. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇచ్చాడు. సప్తగిరి, శకలక శంకర్, పృథ్వీ, సత్యకృష్ణలు ఇందులో కీలక పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











