కండోమ్‌తో సామాన్యుడి పాట్లు, అప్పుడే ఓటీటీలోకి దిల్‌రాజు ఫ్యామిలీ డ్రామా , ఎందులో అంటే?
ఒకప్పుడు బుల్లితెరపై కనిపిస్తే చాలని కలలుగన్న కుర్రాడు నేడు బిజీ హీరోగా మారిపోయాడు. అతనెవరో కాదు సుహాస్. కలర్ ఫోటో మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ బెజవాడ కుర్రాడు తన ప్రతిభతో ఇక్కడి వరకు చేరుకున్నాడు. చిన్న సినిమాలు, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌కు సుహాస్ కేరాఫ్‌గా నిలిచాడు. ఇతని చేతిలో ఏకంగా అరడజను సినిమాలు ఉన్నాయంటే ఇతని స్పీడ్‌ని అర్ధం చేసుకోవచ్చు. సుహాస్ నటించిన ఓ సినిమా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వివరాల్లోకి వెళితే..
మినిమం గ్యారెంటీ, ఓటీటీలలో తనకంటూ ప్రత్యేక మార్కెట్ తెచ్చుకోవడంతో సుభాస్ చిన్న నిర్మాతల పాలిట కల్పవృక్షంలా మారాడు. ఈ క్రమంలో ఏకంగా టాలీవుడ్ బడా నిర్మాత దిల్‌రాజు బ్యానర్‌లోనే సినిమా చేసే రేంజ్‌కి చేరుకున్నాడు సుహాస్. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ జనక అయితే గనక. ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు.

రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, మురళీశర్మ, ప్రభాస్ శ్రీను, గోపరాజు రమణ తదితరులు నటించిన ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ స్వరాలు సమకూర్చారు. దసరా కానుకగా అక్టోబర్ 12న రిలీజైన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు, మంచి మౌత్ టాక్ కారణంగా ప్రేక్షకులు బాగానే ఆదరించారు.
తండ్రి (గోపరాజు రమణ) తీసుకొన్న తప్పుడు నిర్ణయం కారణంగా ఆర్థిక సమస్యలతో ఎదుగుబొదుగు లేకుండా ఉండిపోయామనే ఫీలింగ్‌తో ఉండే యువకుడు ప్రసాద్ (సుహాస్). వాషింగ్ మిషన్ కంపెనీలో పని చేస్తూ భార్య (సంగీర్తన), స్నేహితుడు, లాయర్ పత్తి కిషోర్ (వెన్నెల కిషోర్)లతో ఉన్నంతలో జీవితాన్ని లాగిస్తుంటాడు. తన ఆదాయం, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో ఇప్పట్లో పిల్లల్ని కనకూడదని ప్రసాద్ దంపతులు నిర్ణయం తీసుకొంటారు. ఇందుకు సంబంధించి జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. అయితే ఓ రోజున భార్య తాను ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ప్రసాద్ షాక్ అవుతాడు.
తాను ఉపయోగించిన కండోమ్ నాణ్యతా లోపం వల్లే ఇలా జరిగిందని భావించి సదరు కంపెనీపై కోటి రూపాయల దావా వేస్తాడు. తండ్రిపై ప్రసాద్ కోపానికి కారణమేంటీ? పెళ్లైనా పిల్లల్ని కనకూడదని ప్రసాద్ అంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు? మధ్య తరగతి కష్టాలు ప్రసాద్‌పై ఎలాంటి ప్రభావం చూపాయి? కండోమ్ కంపెనీపై ప్రసాద్ ఎందుకు దావా వేశాడు? కోర్టులో టాప్ లాయర్ అజయ్ శర్మ (మురళీ శర్మ) వాదనలను ప్రసాద్ ఎలా ఎదుర్కొన్నాడా? కోటి రూపాయలు పరిహారాన్ని ప్రసాద్ పొందాడా? కండోమ్ వాడినా ప్రసాద్ భార్య ఎందుకు గర్బవతి అయిందనే ప్రశ్నలకు సమాధానమే జనక అయితే గనక సినిమా కథ.
థియేటర్‌లో ఓకే అనిపించుకున్న ఈ సినిమా కోసం ఓటీటీ లవర్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జనక అయితే గనుక ఓటీటీ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను ఆహా అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 8 నుంచి జనక అయితే గనుక అందుబాటులోకి వస్తుందని, ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లు 24 గంటల ముందే ఈ సినిమాను వీక్షించవచ్చని తెలిపింది.


Click it and Unblock the Notifications











