Anaganaga: అక్కినేని హీరో సరికొత్త చరిత్ర.. ఓటీటీ నుంచి థియేటర్లలోకి సుమంత్ మూవీ
సిల్వర్ స్క్రీన్ మీద ప్రయోగాలు చేయడానికి భయపడే దర్శకులు, నిర్మాతలు, నటీనటులకు ఓటీటీలు ఓ వేదికగా నిలిచాయి. పైగా మూడు గంటల్లో తాము చెప్పాల్సినది చెప్పలేనప్పుడు ఎపిసోడ్స్‌గా, సిరీస్‌లుగా కొనసాగించేందుకు ఓటీటీలు వీలు కల్పిస్తున్నాయి. అందుకే వెండితెర మీద సక్సెస్ కానీ నటీనటులు ఓటీటీలలో స్టార్స్‌గా మారుతున్నారు. ఇలాంటి వారి కోసం ఓటీటీ దిగ్గజాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఇక ఓటీటీలు నిర్మాతలకు అదనపు ఆదాయంగా మారుతున్నాయి.
భారతీయ సినిమాకు పెరుగుతున్న ఆదరణ
థియేటర్‌లలో ఫ్లాపైన ఎన్నో సినిమాలు ఓటీటీలో దుమ్మురేపుతున్నాయి. భారతీయ సినిమా తన పరిధిని విస్తరించుకుంటూ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా మన సినిమాకు ఆదరణ దక్కుతోంది. ఇందుకు ఓటీటీలే కారణం. మన సినిమాల్లోని డ్రామా, రొమాన్స్, కామెడీ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రాంతీయ భాషలతో పాటు ఇంగ్లీష్‌లో సినిమా అందుబాటులో ఉండటంతో ప్రపంచంలో ఏ మూల ఉన్న ప్రేక్షకుడికైనా భారతీయ సినిమా చేరువ అవుతోంది.

నత్తనడకన సుమంత్ కెరీర్
ఒడ్డూ పొడుగు, బలమైన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ ఎందుకో సుమంత్ క్లిక్ కాలేకపోయాడు. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, నాగార్జున మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ తొలినాళ్లలో రొమాంటిక్ మూవీస్‌తో సత్తా చాటాడు . కానీ ఎందుకో తర్వాత డల్ అయిపోయాడు. వరుస ఫ్లాపులతో నెంబర్ గేమ్‌లో వెనుకబడిపోయాడు. అడపాదడపా సినిమాలతో అలరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మంచి టేస్ట్ ఉన్న హీరోగా, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటాడన్న పేరును మాత్రం సుమంత్ సంపాదించారు.
ఓటీటీలపై సుమంత్ కన్ను
సీతారామంలో బ్రిగేడియర్‌గా అలరించిన సుమంత్‌కు ఓటీటీల రాక ప్లస్‌గా మారిందని అంటున్నారు సినీ పండితులు. సీనియర్ నటులు, విభిన్న సబ్జెక్ట్స్‌తో వచ్చే వారికి ఓటీటీలు బ్రహ్మరథం పడుతున్నాయి. కరోనా తర్వాత ప్రేక్షకుడి అభిరుచులు పూర్తిగా మారిపోవడంతో సుమంత్ వంటి హీరోలకు గిరాకీ బాగా పెరుగుతోంది. శివాజీ, జేడీ చక్రవర్తి, రాజేంద్రప్రసాద్ లాంటి నటులు ఓటీటీలను దున్నేస్తున్నారు. మంచి రెమ్యునరేషన్‌తో పాటు జనంలో ఆదరణ బాగా దక్కుతుండటంతో ఈ తరహా నటులు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు సుమంత్ కూడా దీనిని అందిపుచ్చుకోవాలని చూస్తున్నాడు.
అనగనగాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా
తాజాగా సుమంత్ నటించిన మూవీ అనగనగా. రాకేష్ రెడ్డి గడ్డం, రుద్ర మాదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. సుమంత్ సరసన కాజల్ చౌదరి హీరోయిన్‌గా నటించారు. మాస్టర్ విహర్ష్, శ్రీనివాస్ అవసరాల, అను హాసన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మే 15న ఈ సినిమా ఈటీవీ విన్‌లో నేరుగా స్ట్రీమింగ్ అయ్యింది. అయితే ఫ్యామిలీ, తండ్రీ కొడుకులు, భార్యాభర్తల అనుబంధం, కార్పోరేట్ విద్య వంటి అంశాలను ఇతివృత్తంగా తెరకెక్కిన అనగనగా చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. అనగనగాను థియేటర్‌లలో రిలీజ్ చేయాలని నిర్ణయించింది.
థియేటర్‌లలోకి అనగనగా
దీనిలో భాగంగా తొలుత మే 24న విజయవాడలో, మే 25న విశాఖలో రిలీజ్ చేయనున్నారు. ప్రేక్షకుల స్పందన ఆధారంగా థియేటర్ల సంఖ్య పెంచుతామని హీరో సుమంత్ ప్రకటించారు. సాధారణంగా థియేటర్‌లలో రిలీజైన తర్వాత సినిమాలు ఓటీటీలోకి వస్తాయి, లేదా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతాయి. అలాంటిది ఓటీటీలోకి వచ్చిన తర్వాత థియేటర్‌లలో రిలీజయ్యే సరికొత్త ట్రెండ్‌కు సుమంత్ శ్రీకారం చుట్టారు. మరి థియేటర్‌లో అనగనగా ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











