Jana Nayagan: ఓటీటీ డీల్స్‌లో జననాయగన్ సంచలనం.. దళపతి విజయ్ మూవీకి ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ సూపర్‌స్టార్ దళపతి విజయ్ రాజకీయాల్లోకి దూకిన సంగతి తెలిసిందే. తనను ఇంతటి వాడిని చేసిన సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అనే పార్టీని స్థాపించి ఎన్నికల బరిలో దిగారు. 2026 తమిళనాడు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్.. జననాయగన్ సినిమాలో నటిస్తున్నారు. ఇది విజయ్ కెరీర్‌లో 69వ సినిమా. రాజకీయాల్లోకి ప్రవేశించడంతో ఇది తన సినీ జీవితంలో చివరి సినిమా అని దళపతి ప్రకటించారు.
విజయ్ చివరి చిత్రంగా జననాయగన్
కోలీవుడ్‌లో రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న నటుడిగా విజయ్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ షేక్ అవుతుంది. వందల కోట్ల కలెక్షన్స్ వచ్చిపడతాయి. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా విజయ్ సినిమాలు భారీ ఓపెనింగ్స్, వసూళ్లను సాధిస్తున్నాయి. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో ఎవరికీ అందనంత రేంజ్‌లో ఉన్నారు విజయ్ దళపతి. ఆయన నటించిన చివరి ఐదు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాయి. ఈ నేపథ్యంలో విజయ్ సినీ జీవితంలో చివరి మూవీగా తెరకెక్కుతోన్న జననాయగన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రికార్డ్ ఓపెనింగ్స్‌ని, కలెక్షన్స్‌ని సాధిస్తుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

జననాయగన్ బడ్జెట్ ఎంతంటే?
హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న జననాయగన్ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. మమితా బైజు, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్, రెబా మోనికా జాన్, మోనిషా బ్లెస్సీ, నిళగల్ రవి, రేవతి, శ్రీకాంత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కేలు జననాయగన్ మూవీని దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా, ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్, అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న జననాయగన్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రికార్డు స్థాయిలో జననాయగన్ బిజినెస్
విజయ్ చివరి చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దాంతో జననాయగన్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం బడా సంస్థలు ఎగబడుతున్నాయి. తమిళనాడు థియేట్రికల్ రైట్స్ కోసం సెవెన్ స్క్రీన్ స్టూడియో, రోమియో పిక్చర్స్, వీ క్రియేషన్స్ సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇక జననాయగన్ ఓవర్సీస్ రైట్స్‌ను పార్స్ ఫిలింస్ సంస్థ దాదాపు 9.2 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 78 కోట్ల రూపాయలు) రికార్డు ధరకు సొంతం చేసుకుంది. ఒక తమిళ చిత్రానికి ఓవర్సీస్ రైట్స్ ఈ స్థాయిలో ధర పలకడం ఇదే తొలిసారి. అలాగే 4 సీజన్స్ క్రియేషన్స్ సంస్థ యూరప్ హక్కులను, బోలెన్ సినిమా సంస్థ యూకే హక్కులను సొంతం చేసుకుంది.
జననాయగన్ ఓటీటీ రైట్స్ ఎంతంటే?
ఇక జననాయగన్ డిజిటల్ రైట్స్ కోసం కూడా భారీ డిమాండ్ నెలకొంది. ఓటీటీ దిగ్గజాలన్నీ ఈ సినిమా హక్కుల కోసం పోటీపడగా.. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దాదాపు 110 కోట్ల రూపాయల రికార్డ్ ధరకు జననాయగన్ ఓటీటీ హక్కులను (తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ) సొంతం చేసుకుంది. విజయ్ కెరీర్‌లో లియో మూవీ డిజిటల్ రైట్స్ రికార్డ్ స్థాయిలో 120 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసి కోలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. దీనితో సమానంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ మూవీ డిజిటల్ రైట్స్ 120 కోట్ల రూపాయలకు బిజినెస్ చేసింది. ఇక జననాయగన్ శాటిలైట్ రైట్స్‌ను దాదాపు 68 కోట్ల రూపాయలు వెచ్చించి సన్ టీవీ దక్కించుకుంది. దీంతో థియేట్రికల్ బిజినెస్ పరంగా విజయ్ దళపతి ఇంకెన్ని రికార్డులు నెలకొల్పుతాడోనని కోలీవుడ్ జనాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











