Thammudu: ఓటీటీలోకి తమ్ముడు.. నితిన్ మూవీ స్ట్రీమింగ్ ఎందులో? ఎప్పుడంటే?
ఎప్పుడో రెండు దశాబ్ధాల క్రితం కెరీర్ స్టార్ట్ చేసిన నితిన్ ఒక హిట్ ఇస్తే .. 10 ఫ్లాప్‌లు అన్నట్లుగా బండి నడుపుకుంటూ వస్తున్నాడు. ఈ ఏడాది రాబిన్‌హుడ్‌తో డిజాస్టర్ అందుకున్న నితిన్.. రెండు నెలలు తిరిగేసరికి జూలై 4న తమ్ముడు అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. వారం తిరిగే సరికే తన థియేట్రికల్ రన్ ముగించి నితిన్ కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది . తాజాగా తమ్ముడు మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ వివరాల్లోకి వెళితే..
తమ్ముడు బడ్జెట్ ఎంత?
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఈ తమ్ముడు చిత్రాన్ని నిర్మించారు. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్ తెరకెక్కించిన వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నితిన్ సరసన కాంతారా ఫేమ్ సప్తమీ గౌడతో పాటు వర్ష బొల్లమ్మ, స్వస్తికలు హీరోయిన్లుగా నటించారు. సీనియర్ హీరోయిన్ నటి కీలకపాత్ర పోషించారు. బిగ్‌బాస్ ఫేం హరితేజ, యానిమల్ ఫేం సౌరబ్ సచ్‌దేవ, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. కాంతార చిత్రానికి స్వరాలు సమకూర్చిన అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. కేవీ గుహన్, సమీర్ రెడ్డి, సేతు సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ఈ సినిమాకు సుమారుగా 75 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి.

తమ్ముడు బిజినెస్ ఎంత?
నితిన్ వరుస ఫ్లాపులతో ఉన్నప్పటికీ దిల్‌రాజు బ్యానర్.. ప్రచార కార్యక్రమాలతో తమ్ముడు చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. నైజాంలో 8.5 కోట్ల రూపాయలు, సీడెడ్ రైట్స్ 3 కోట్ల రూపాయలు, ఇతర జిల్లాల హక్కులు 8.5 కోట్ల రూపాయలకు అమ్మడైనట్లుగా ఫిలింనగర్ టాక్. మొత్తంగా తమ్ముడు చిత్రానికి ఆంధ్రా, నైజాంలలో 20 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ పండితులు తెలిపారు. ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లలో 4 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. దీంతో కలుపుకుని మొత్తంగా తమ్ముడు చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నితిన్ మూవీ లాభాల్లోకి రావాలంటే 25 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు. తమ్ముడుపై ఉన్న హైప్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్లలో విడుదల చేశారు.
తమ్ముడు కలెక్షన్స్ ఎంతంటే?
మార్నింగ్ షో నుంచి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న నితిన్ మూవీ తొలి రోజు రూ.1.9 కోట్లు, 2వ రోజు రూ.1.2 కోట్లు, 3వ రోజు రూ.1.15 కోట్లు, 4వ రోజు రూ.60 లక్షలు, 5వ రోజు రూ.50 లక్షలు, 6వ రోజున రూ.40 లక్షలు, 7వ రోజున 32 లక్షలు చొప్పున తొలి వారం రూ.7 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత కలెక్షన్స్ కోల్పోతూ.. థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఇండియాలో రూ.6.97 కోట్ల నెట్.. రూ.7.33 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దీనికి ఓవర్సీస్‌లో రూ. కోటి కలిపితే ప్రపంచవ్యాప్తంగా తమ్ముడు సినిమా రూ.8.33 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. 25 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగి కేవలం 4 కోట్ల రూపాయల షేర్ మాత్రమే రాబట్టి.. 21 కోట్ల రూపాయల నష్టాలను మిగిల్చాడు తమ్ముడు.
తమ్ముడు ఏ ఓటీటీలో?
తమ్ముడు ఓటీటీ డీల్ కోసం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లు హోరాహోరీగా పోటీపడగా.. చివరికి ఫ్యాన్సీ రేటుకు నితిన్ మూవీ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా థియేట్రికల్ రన్ ముగియడంతో తమ్ముడు సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై నెట్‌ఫ్లిక్స్ కీలక ప్రకటన చేసింది. ఆగస్ట్ 1 నుంచి ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుందని తెలిపింది. థియేటర్‌లో డిజాస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీలో ఏ మేరకు ఆదరణ పొందుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











