The Bhootnii: ఓటీటీలోకి భూతిని .. సంజయ్ దత్ మూవీ స్ట్రీమింగ్ ఎందులో అంటే?
శ్రద్ధాకపూర్ నటించిన స్త్రీ 2 చిత్రం బాలీవుడ్‌లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏకంగా 800 కోట్లకు పైగా వసూళ్లతో బాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఈ సినిమా దెబ్బతో హార్రర్ కామెడీ సినిమాలు బాక్సాఫీస్‌ను ముంచెత్తుతున్నాయి. వీటిలో కొన్ని మాత్రమే హిట్ అవుతుండగా.. చాలా వరకు ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. ఈ కోవలోనే బాలీవుడ్‌లో దిగిన మరో హార్రర్ కామెడీ మూవీ ది భూతిని. నెలన్నర క్రితం ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాగా.. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్, నాగిని ఫేమ్ మౌనీరాయ్‌లు ది భూతినిలో కీలకపాత్రలు పోషించగా.. సన్నీ సింగ్, పాలక్ తివారీ, ఆసిఫ్ ఖాన్, నికుంజ్ లోటియాలు ఇతర పాత్రలు పోషించారు. సోహమ్ రాక్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, త్రి డైమన్షన్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై దీపక్ ముకుత్, హునర్ ముకుత్, సంజయ్ దత్, మాన్యత దత్‌లు భూతిని చిత్రాన్ని నిర్మించగా సిద్ధాంత్ సచ్‌దేవ్ దర్శకత్వం వహించారు. సంతోష్ తుండియల్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. షబ్బీర్ అహ్మద్, ముకుంద్ సూర్యవంశీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. అమర్ మొహిల్ సంగీత దర్శకత్వం వహించారు.

ది భూతిని బడ్జెట్ & బ్రేక్ ఈవెన్
హర్రర్ థ్రిల్ రావడానికి ప్రత్యేకమైన సెట్‌లు, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పరంగా ఎక్కడా తగ్గకుండా భూతిని చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ కార్యక్రమాలకు అయిన వ్యయం కలిపి ది భూతిని చిత్రానికి దాదాపు 50 కోట్ల బడ్జెట్ అయ్యింది. సంజయ్ దత్, మౌనీ రాయ్ వంటి స్టార్ క్యాస్టింగ్‌తో పాటు టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. ది భూతిని చిత్రం లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 60 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ప్రపంచవ్యాప్తంగా 2500 స్క్రీన్‌లలో ది భూతిని చిత్రాన్ని భారీగా విడుదల చేశారు.
ది భూతిని కలెక్షన్స్
మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ది భూతిని చిత్రం తొలి రోజు కేవలం 65 లక్షల రూపాయల ఓపెనింగ్స్ మాత్రమే సాధించింది. రెండో రోజు 62 లక్షల రూపాయలు, మూడో రోజు 86 లక్షల రూపాయలు, నాలుగో రోజు 1.2 కోట్ల రూపాయల చొప్పున థియేట్రికల్ రన్ ముగిసే నాటికి ఇండియాలో రూ.6.57 కోట్ల నెట్.. రూ.9.57 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దీనికి ఓవర్సీస్ కలెక్షన్స్ 3 కోట్ల రూపాయలు కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.12.52 కోట్ల రూపాయలు మాత్రమే ఆర్జించి నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.
ది భూతిని స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో?
ది భూతిని ఓటీటీ రిలీజ్ విషయానికి వస్తే.. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 దక్కించుకుంది. థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో ది భూతిని ఓటీటీ స్ట్రీమింగ్‌పై జీ5 క్లారిటీ ఇచ్చింది. జూలై 18 నుంచి ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. అదే రోజు జీ సినిమాలోనూ స్ట్రీమింగ్ అవుతుందని తెలిపింది. మరి థియేటర్‌లో ఫ్లాప్‌గా నిలిచిన ది భూతిని.. ఓటీటీలో ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











