The Romantics Review గుండెను పిండేసే యష్ చోప్రా లైఫ్ జర్నీ.. DDLJ కోసం షారుక్‌ను ఒప్పించడం ఎంత కష్టమైందంటే?
బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు, కింగ్ ఆఫ్ రొమాన్స్‌గా పేర్కొనే యష్ చోప్రా, ఆయన కుమారుడు ఆదిత్య చోప్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ The Romantics. నాలుగు ఎపిసోడ్స్‌గా సాగే సుమారు 4 గంటల వెబ్ సిరీస్ భావోద్వేగంగా సాగిందనే ఫీలింగ్ కలుగుతుంది. భారత్, పాకిస్థాన్ విభజన నుంచి నెహ్రూ ప్రధానిగా సినిమా పరిశ్రమను ఉద్దేశించి చేసిన ప్రసంగం లాంటి ఎన్నో అంశాలు ఈ డాక్యుమెంటరీలో కనిపిస్తాయి. ది రొమాంటిక్ వెబ్ సిరీస్‌లోని ప్రధాన అంశాలు ఏమిటంటే..
భారత్‌లోని జలంధర్ పట్టణానికి చెందిన ఓ దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడు యష్ చోప్రా.. సినిమాపై ఆసక్తితో బీఆర్ చోప్రా వద్ద వేతన ఉద్యోగిగా చేరి.. భారతీయ సినిమా పరిశ్రమలో అత్యున్నత స్థాయికి చేరిన ఫిల్మ్ మేకర్‌గా యష్ చోప్రా జర్నీ ఎమోషనల్‌గా తెరపైన కనిపిస్తుంది.

యష్ చోప్రా తీసిన సినిమాలు.. అవి సాధించిన విజయాలు, పరాజయాలకు సంబంధించిన సంఘటనల వెనుక ఆసక్తికరమైన అంశాలను సినీ ప్రముఖులు చెప్పడం, వారి అనుభవాలను షేర్ చేసుకోవడం స్పూర్తిని కలిగించేలా ఉంటుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న సమయంలో శ్రీదేవితో చాందిని తీసిన సమయంలో ఇండస్ట్రీ నుంచి వీచిన వ్యతిరేక పవనాలను తట్టుకొని యష్ చోప్రా చెప్పిన సమాధానం ప్రతీ ఒక్కరికి ఇన్స్‌పైరింగ్‌గా కనిపిస్తుంది.
అమితాబ్ బచ్చన్, రిషీ కపూర్, షారుక్ ఖాన్, కరణ్ జోహర్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా, జూహీ చావ్లా, మాధురీ దీక్షిత్, కాజోల్, కత్రినా కైఫ్, పద్మిని కొల్హాపురి, రాణి ముఖర్జీ, రాఖీ యష్ చోప్రా, భూమి పడ్నేకర్, వద్ద పనిచేసిన సాంకేతిక నిపుణులు, మొత్తం 35 మంది పంచుకొన్న అనుభవాలు అత్యంత ఆసక్తిని కలిగిస్తాయి. సాధారణ దర్శకుడి నుంచి అసాధారణ వ్యక్తిగా తన జీవితాన్ని మలుచుకొన్న తీరు గొప్పగా కనిపిస్తుంది. ఇక తన పేరిట స్టూడియో కట్టడం వెనుక కారణాలను చెప్పిన తీరు మరింత స్పూర్తి దాయకంగా ఉంటుంది.

తన కుమారులు ఆదిత్య చోప్రా, ఉదయ్ చోప్రా బాల్యం, వారి ఎదుగుదల గురించి అభిషేక్, అమితాబ్ బచ్చన్, హృతిక్ చెప్పిన విషయాలు చాలా ఇంట్రెస్టింగ్‌గా కనబడుతాయి. బాలీవుడ్ సినిమా చరిత్రను తిరగరాసిన దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే సినిమా బిహైండ్ మేకింగ్ సీన్లు గొప్పగా ఉంటాయి.
డర్ సినిమా సమయంలో యష్ చోప్రా పక్కన ఉన్న ఆదిత్య చోప్రా ఎవరో తెలియకపోవడం.. ఆ తర్వాత ఆదిత్యతో షారుక్‌కు ఏర్పడిన విడదీయలేని బంధం గురించిన ఎపిసోడ్ బాగుంటుంది. అయితే యాక్షన్ హీరోగా రాణిస్తున్న షారుక్‌ను లవ్, రొమాంటిక్ సినిమాల్లో నటింపజేయడానికి, ముఖ్యంగా డీడీఎల్‌జే సినిమా చేయడానికి పడిన కష్టాలను ఆదిత్య చెప్పిన తీరు ఆకట్టుకొంటుంది.
చివరి ఎపిసోడ్‌లో యష్ చోప్రా చివరి చిత్రం జబ్ తక్ జాన్ సినిమా షూటింగు వివరాలు, ఆ సినిమా షూట్ సమయంలో అస్వస్థతకు గురైన విషయాలు, సినిమా ప్రమోషన్‌లో షారుక్, యష్ చోప్రా ఇంటర్వ్యూ గుండెను పిండేస్తాయి. తనకు ఇక సినీ జీవితం చాలూ.. జబ్ తక్ జాన్ అనే సినిమానే నాకు చివరి సినిమా. ఇక సినిమా తీయను అంటూ తన మరణానికి కొద్ది రోజుల ముందే చెప్పిన విషయం చూస్తే కంటతడి పెట్టించకమానదు. ది రొమాంటిక్స్ గొప్ప అనుభూతిని పంచే బయోపిక్ లాంటి డాక్యుమెంటరీ, వెబ్ సిరీస్


Click it and Unblock the Notifications











