This Week Movie Releases: ఈ ఏడాది విడుదలయ్యే చివరి సినిమాలు ఇవే.. ఓటీటీలోనూ సందడి..
This Week Movie Releases: 2025 సంవత్సరం సినిమా పరంగా ఎన్నో మలుపులు తిరిగింది. భారీ అంచనాలతో విడుదలైన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టగా, ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ మారాయి. మూవీ మేకర్స్ కు కాసుల వర్షం కురిపించాయి. స్టార్ సినిమాల హవా ఒకవైపు కొనసాగుతుండగా, కంటెంట్ ఉన్న సినిమాలే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలవని ఈ ఏడాది మరోసారి నిరూపితమైంది. ఈ నేపథ్యంలో 2025 చివరి శుక్రవారం ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్న సినిమాలపై ఆసక్తి నెలకొంది. క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదల కానున్న సినిమాలివే.
ఛాంపియన్ (Champion)
సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఛాంపియన్ (Champion). ఈమూవీలో అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ ఫుట్‌బాల్ నేపథ్యంతో రూపొందిన పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా సాగుతోంది. యువతను ఆకట్టుకునేలా స్పోర్ట్స్, భావోద్వేగాల మేళవింపుతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి స్వప్న సినిమాస్ సంస్థ నిర్మించిన ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

శంబాల (Shambhala)
హారర్, సస్పెన్స్‌తో పాటు బలమైన ఎమోషన్స్‌తో రూపొందిన సినిమా శంభాల (Shambhala). ఆది సాయికుమార్ హీరోగా యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అర్చన అయ్యర్, స్వసిక, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. ఊహించని ట్విస్టులతో కథ సాగుతుందని హీరో ఆది చెబుతుండటంతో, థ్రిల్లర్ అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.
ఈషా (Eesha)
ఇటీవల లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి వంటి చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన బన్నీ వాస్, వంశీ నందిపాటి ఇప్పుడు ఈషా (Eesha)పేరుతో ఓ హారర్ థ్రిల్లర్‌తో రాబోతున్నారు. త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాకు శ్రీనివాస్ మన్నె తెరకెక్కించగా, కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. ఈ నెల 25న సినిమా విడుదల కానుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.
దండోరా ( Dhandoraa )
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న కలర్ ఫోటో, బాక్సాఫీస్ హిట్ బెదురులంక 2012 వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని తాజాగా నిర్మించిన సినిమా దండోరా ( Dhandora). మురళీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ కీలక పాత్రలు పోషిస్తుండగా, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బింధు మాధవి, రాధ్య, అదితి భావరాజు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వీడియో గ్లింప్స్, టీజర్, పాటలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం డిసెంబర్ 25న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
పతంగ్ (Patang)
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మూవీ పతాంగ్ ( Patang).ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కు ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రముఖ సింగర్ ఎస్పీ చరణ్ కీలక పాత్రలో కనిపించడం విశేషం. డి. సురేష్ బాబు సమర్పణలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి కలిసి ఈ సినిమాను నిర్మించారు.యువతను ఆకట్టుకునే అంశాలతో రూపొందిన 'పతంగ్' డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
వృషభ (Vrusshabha)
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ (Mohanlal) హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ 'వృషభ'(Vrusshabha). నందకిశోర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని కనెక్ట్ మీడియా, బాలాజీ మోషన్ పిక్చర్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్ సహా పలువురు ప్రముఖ నిర్మాతలు ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములయ్యారు. ఈ నెల 25న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండగా, తెలుగులో గీతా ఆర్ట్స్ (Geetha Arts) ద్వారా అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు. సమర్జిత్ లంకేశ్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా, గరుడ రామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ వారం ఓటీటీలో సందడి చేసే కంటెంట్ ఇదే..
థియేటర్లతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫాంలలో కూడా ఈ వారం కొత్త కంటెంట్ సందడి చేయనుంది. నెట్‌ఫ్లిక్స్‌లో పోస్ట్ హౌస్, గుడ్‌బై జాన్, ప్యారడైజ్, ఆంధ్రాకింగ్ తాలూకా వంటి సినిమాలు విడుదల కానుండగా, అమెజాన్ ప్రైమ్‌లో సూపర్ నేచురల్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. జీ5లో ఏక్ దివానే కీ దివానియత్ మూవీ విడుదల కానుంది. మొత్తంగా చూస్తే 2025 చివరి వారం థియేటర్లు, ఓటీటీల్లో సినిమాల పండగే అని చెప్పాలి. మీరు ఏ సినిమా చూడబోతున్నారు?


Click it and Unblock the Notifications











