1300 కోట్ల పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఓటీటీలోకి.. ఈ వారం స్ట్రీమింగ్ కానున్న టాప్ మూవీస్..
Weekend OTT Releases: ప్రస్తుతం థియేటర్లలో ఇంకా సంక్రాంతి సినిమాల సందడే కొనసాగుతోంది. పెద్ద స్టార్ సినిమాలు ఇప్పటికే విడుదల కావడంతో, ఈ వారం కొత్తగా భారీ చిత్రాలు థియేటర్లలోకి రావడం లేదు. అయితే చిన్న, మిడిల్ బడ్జెట్ సినిమాలు మాత్రం ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాయి. తరుణ్ భాస్కర్, ఇషాల నటించిన ఓం శాంతి శాంతి శాంతి, అలాగే త్రిముఖ, ప్రేమకడలి వంటి సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. మరోవైపు తమిళ స్టార్ విజయ్ సేతుపతి నటించిన గాంధీ టాక్స్, అలాగే తుంబాడ్ దర్శకుడి కొత్త సినిమా మయసభ కూడా ఈ వారాంతంలో బిగ్ స్క్రీన్‌పై ప్రేక్షకులను పలకరించనున్నాయి.
అయితే థియేటర్ల కంటే భిన్నంగా, ఓటీటీ ప్రపంచంలో ఈ వారం మాత్రం భారీ కంటెంట్ రెడీగా ఉంది. క్రైమ్ థ్రిల్లర్లు, స్పై యాక్షన్ సినిమాలు, హారర్-కామెడీ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు వరుసగా స్ట్రీమింగ్‌కు వస్తుండటంతో, ఇంట్లో కూర్చుని ఎంటర్‌టైన్ కావాలనుకునే ప్రేక్షకులకు ఇదొక పండుగలాంటిది. ముఖ్యంగా థియేటర్లలో రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన భారీ మూవీ ధురంధర్ ఓటీటీలోకి రానుందన్న వార్త సినిమాప్రేమికుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా ఈ వారం స్ట్రీమింగ్‌కు రానున్నాయి. మరి ఈ వారంలో ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన టాప్ కంటెంట్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

ధురంధర్ (Dhurandhar)
ఈ వారం ఓటీటీ రిలీజ్‌లలో హైలైట్‌గా నిలుస్తున్న సినిమా ధురంధర్. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్ థియేటర్లలో సంచలన విజయం సాధించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 1300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. పాకిస్థాన్‌లోని కరాచీ అండర్‌వర్‌ల్డ్, ఐఎస్ఐ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ఒక టాప్ RAW ఏజెంట్ చేసే సాహసోపేతమైన పోరాటమే ఈ సినిమా కథ. ఈ సినిమాలో ఐబీ డైరెక్టర్ అజయ్ సన్యాల్‌గా ఆర్.మాధవన్ నటించగా, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రల్లో కనిపించారు. దేశభక్తి, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు, రియలిస్టిక్ టోన్ ఈ సినిమాకు ప్రధాన బలం. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఛాంపియన్ (Champion)
యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఛాంపియన్ కూడా ఈ వారం ఓటీటీలోకి వస్తోంది. హీరో రోషన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు ఈ చిత్రం జనవరి 29 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనస్వర రాజన్, అవంతిక, హైపర్ ఆది కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఇందులోని 'గిర గిర గింగిరాగిరే' పాట అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది.
దల్దల్ (Daldal)
బహుముఖ ప్రజ్ఞాశాలి భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దల్దల్ కూడా ఈ వారం ఓటీటీలోకి వస్తోంది. విష్ ధమీజా రాసిన 'భిండీ బజార్' నవల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్‌లో, ముంబైలో జరిగే వరుస హత్యల కేసును డిసిపి రీటా ఫెరీరా ఎలా ఛేదించిందనేదే కథ. తన వ్యక్తిగత గాయాలు, వ్యవస్థలోని అవినీతితో పోరాడుతూ నేరగాళ్లను పట్టుకునే ఈ పాత్ర ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠలో ఉంచుతుంది. జనవరి 30 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
సర్వం మాయ (Sarvam Maya)
మలయాళ స్టార్ నివిన్ పౌలీ నటించిన హారర్-కామెడీ మూవీ సర్వం మాయ కూడా ఈ వారం ఓటీటీకి రానుంది. థియేటర్లలో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అలరించేందుకు సిద్ధమైంది. నాస్తికుడైన ఓ గిటారిస్ట్ తన పూర్వీకుల పురోహిత వృత్తిలోకి మారాల్సి వచ్చే పరిస్థితి, ఆ సమయంలో 'డెలూలు' అనే జెన్-జీ దెయ్యంతో అతనికి ఎదురైన వింత అనుభవాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. జనవరి 30 నుంచి జియో హాట్‌స్టార్ లో అందుబాటులోకి రానుంది.
దేవ్‌ఖేల్ (Devkhel)
మరాఠీ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో ఆసక్తికరమైన సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దేవ్‌ఖేల్. కొంకణ్ తీరంలోని దేవ్‌తాలి గ్రామంలో ప్రతి హోలీ పౌర్ణమికి ఒకరు అనుమానాస్పదంగా మరణిస్తుంటారు. దీనికి కారణం శంకసురుడు అనే రాక్షసుడని గ్రామస్తుల నమ్మకం. కానీ ఇన్‌స్పెక్టర్ విశ్వాస్ ఈ మూఢనమ్మకాన్ని ఛేదిస్తూ అసలు నిజాన్ని ఎలా బయటపెట్టాడనేదే ఈ సిరీస్ కథ. జనవరి 30 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది.
పతంగ్ (Patang)
సికింద్రాబాద్ బస్తీ నేపథ్యం, గాలిపటాల పోటీల ఇతివృత్తంతో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ పతంగ్ కూడా ఈ వారం ఓటీటీలోకి వస్తోంది. గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక సన్ నెక్స్ట్ ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకోగా, జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. నిర్మాత డి.సురేష్ బాబు సమర్పణలో ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రీతి పగడాల, వంశీ పూజిత్, ప్రణవ్ కౌశిక్ ప్రధాన పాత్రల్లో నటించారు. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఎస్.పి.చరణ్ కీలక పాత్రల్లో నటించారు.
ఇలా ఈ వారం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి తక్కువగా ఉన్నా, ఓటీటీలో మాత్రం ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ రెడీగా ఉంది. స్పై థ్రిల్లర్ నుంచి హారర్ -కామెడీ వరకు, క్రైమ్ సిరీస్‌ల నుంచి యూత్ ఎంటర్‌టైనర్‌ల వరకు అన్ని జానర్స్‌లోనూ కొత్త కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. కాబట్టి ఈ వారాంతం సోఫాలో కూర్చుని కుటుంబంతో కలిసి మంచి సినిమాలు, సిరీస్‌లు చూసే ప్లాన్ ఉంటే... ఈ ఓటీటీ లిస్ట్‌ను మిస్ అవ్వకుండా చూసేయండి.


Click it and Unblock the Notifications











