Thudarum: 230 కోట్ల కలెక్షన్స్‌తో సరికొత్త చరిత్ర.. మోహన్‌లాల్ క్రైమ్ థ్రిల్లర్ ఎందులో అంటే?
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ విరామం లేకుండా శ్రమిస్తున్నారు. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నారు. ఎల్ 2: ఎంపురాన్‌తో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న మోహన్‌లాల్.. నెల తిరిగే సరికి తుడరంతో వచ్చారు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ ఫ్యామిలీ, క్రైమ్ థ్రిల్లర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైనప తుడరం హిట్ టాక్ తెచ్చుకుంది. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం మే మూడో వారం నాటికే ఈ సినిమా ఓటీటీలోకి రావాల్సింది. కానీ బాక్సాఫీస్ వద్ద మోహన్‌లాల్ ప్రభంజనంతో లెక్కలు మారిపోయాయి. దీనితో పాటు మరికొన్ని కారణాలు తుడరం ఓటీటీ రిలీజ్‌ను వెనక్కి నెట్టాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.
ఏళ్ల తర్వాత మోహన్‌లాల్ సరసన శోభన
దశాబ్ధాల క్రితం మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసిన మోహన్ లాల్, శోభన జంట చాలా కాలం తర్వాత కలిసి నటించడం ముందుగా తుడరం సినిమాకు పాజిటివ్ హైప్ తీసుకొచ్చింది. తుడరం చిత్రానికి తరుణ్ మూర్తి దర్శకత్వం వహించారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ రాజపుత్ర విజువల్ మీడియా బ్యానర్‌పై ఎం రంజిత్ ఈ సినిమాను నిర్మించారు. ప్రకాశ్ వర్మ, బిను పప్పు, భారతీ రాజా, థామస్ మ్యాథ్యూ, సంగీత్ ప్రతాప్, అర్ష చాందిని బైజూ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

తుడరం బడ్జెట్ & బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ , ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను 90 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తుడరంను నిర్మించారు. సాధారణ అంచనాలు ఉన్నప్పటికీ మోహన్‌లాల్ క్రేజ్ కారణంగా ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు మలయాళ సినీ వర్గాలు తెలిపాయి. తుడరం లాభాల్లోకి రావాలంటే రూ.46 కోట్ల షేర్ .. రూ. 92 కోట్ల గ్రాస్ రావాలని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు.
రికార్డు కలెక్షన్స్‌తో మోహన్‌లాల్ ఊచకోత
అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ తుడరం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తొలి వారం ఇండియా వైడ్ రూ.51.4 కోట్లు, రెండో వారంలో రూ.35.35 కోట్లు, మూడో వారంలో రూ.20.8 కోట్లు, నాలుగో వారంలో రూ.9.8 కోట్లు చొప్పున 32 రోజుల వరకు రూ.121 కోట్ల నెట్, రూ.140 కోట్ల గ్రాస్ ఆర్జించింది. ఓవర్సీస్‌లో అయితే మోహన్‌లాల్ ఊచకోత కోశాడు ఏకంగా 94 కోట్ల రూపాయల కలెక్షన్స్‌తో సరికొత్త చరిత్ర సృష్టించాడు. తద్వారా ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.232.92 కోట్ల వసూళ్లతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను అందించాడు మోహన్‌లాల్. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో మూడో స్థానంలో నిలవగా.. కేరళలో రూ.100 కోట్లు సాధించిన తొలి సినిమాగా రికార్డు సృష్టించింది. విడుదలై నెల రోజులు దాటినప్పటికీ థియేటర్లలో మంచి హోల్డ్ సాధిస్తూ ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది.
ఓటీటీ స్ట్రీమింగ్‌పై క్లారిటీ
తుడరం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను జియో హాట్‌స్టార్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నట్లు మాలీవుడ్ టాక్. థియేటర్‌లో విడుదలైన 5 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలన్న నిబంధన మేరకు తుడరం మే మూడో వారంలో స్ట్రీమింగ్ అవ్వాల్సింది. కానీ మలయాళం సహా తెలుగు, తమిళ మార్కెట్స్‌లో ప్రేక్షకుల ఆదరణ దృష్ట్యా స్ట్రీమింగ్‌ను కొంతకాలం వాయిదా వేశారు మేకర్స్. తాజాగా ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ మే 30 నుంచి తుడరం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని జియో హాట్ స్టార్ ప్రకటించింది. థియేటర్‌లో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











