అంత ఇవ్వలేం.. థగ్‌లైఫ్ డిజాస్టర్‌తో నెట్‌ఫ్లిక్స్ మెలిక.. కమల్‌కు కోట్లలో నష్టం?
నాయకుడు లాంటి క్లాసిక్ సినిమా తర్వాత కమల్ హాసన్- మణిరత్నం కాంబోలో తెరకెక్కిన చిత్రం థగ్‌లైఫ్. దాదాపు 38 ఏళ్ల తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలు, భారీ స్టార్ క్యాస్టింగ్‌తో థగ్‌లైఫ్‌పై భారీ హైప్ నెలకొంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. భారతీయుడు 2 డిజాస్టర్ కావడంతో ఆ ముద్రను చెరిపిసుకోవడానికి థగ్‌లైఫ్‌తో హిట్ కొట్టాలని భావించిన కమల్ హాసన్‌కు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచగా, కమల్ కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
వివాదాల్లో థగ్‌లైఫ్
తొలి నుంచి ఈ సినిమా అనేక వివాదాల్లో చిక్కుకుపోయింది. ముఖ్యంగా 70 ఏళ్ల వయసులో తన కూతురు వయసున్న హీరోయిన్లు అభిరామి, త్రిషలతో రొమాన్స్ చేయడంతో కమల్‌పై నెటిజన్లు మండిపడ్డారు. దీనికి చిత్ర యూనిట్ తమదైన శైలిలో కౌంటరిచ్చింది. ఇది చాలదన్నట్లు కన్నడ భాషపై కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. క్షమాపణలు చెప్పడానికి నిరాకరించడంతో కర్ణాటకలో థగ్‌లైఫ్‌ను రిలీజ్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. నేటికీ కోర్టుల్లో ఈ వివాదం నడుస్తూనే ఉంది. కానీ కమల్ మాత్రం తన పంతం వీడటం లేదు.

బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా
అటు బాక్సాఫీస్ పరంగానూ థగ్‌లైఫ్‌కు ట్రబుల్ తప్పడం లేదు. తొలి వారమే 100 కోట్లు కొడుతుందని అందరూ భావించగా.. ఇండియాలో ఫస్ట్ వీక్ కేవలం రూ.44 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. 9 రోజుల వరకు ఇండియాలో 44.74 కోట్ల రూపాయల నెట్.. రూ.51.35 కోట్ల గ్రాస్ మాత్రమే థగ్‌లైఫ్ ఆర్జించింది. కమల్ మార్కెట్ దృష్ట్యా ఓవర్సీస్‌లో రూ.44 కోట్ల కలెక్షన్స్ సాధించిన థగ్‌లైఫ్.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.92.35 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా కనీసం రూ.120 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం థగ్ లైఫ్‌కు థియేటర్లకు వస్తున్న జనాన్ని చస్తే ఇది కష్టమేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కమల్ హాసన్‌కు షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్
సినిమాకు నష్టాలు వచ్చినప్పటికీ డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ ద్వారా ఒడ్డున పడిపోదామని నిర్మాతలు భావిస్తున్నారు. థగ్‌లైఫ్ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.130 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకుంది. అలాగే శాటిలైట్ రైట్స్‌ను విజయ్ టీవీ దాదాపు రూ.60 కోట్లతో దక్కించుకుంది. తమిళ సినిమా చరిత్రలో ఇది ఓ రికార్డు. దీని ద్వారా పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చేసినట్లయ్యింది. అయితే ఇప్పుడు నిర్మాతలకు ఈ ఆనందం దక్కేలా కనిపించడం లేదు. థగ్‌లైఫ్ బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ కావడంతో నెట్‌ఫ్లిక్స్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
షెడ్యూల్ కంటే ముందే ఓటీటీలోకి
థగ్‌లైఫ్ డిజాస్టర్ కావడం.. 10 రోజులు కావొస్తున్నా కనీసం రూ.100 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోవడంతో ఓటీటీ డీల్‌ను పున: సమీక్షించాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించింది. దీని ప్రకారం రూ.130 కోట్లు తాము ఇవ్వలేమని, దానిలో కనీసం 25 శాతం మొత్తాన్ని లేదా రూ.30 కోట్లను తగ్గిస్తేనే తాము అంగీకరిస్తామని నెట్‌ఫ్లిక్స్ కరాఖండీగా చెప్పేసిందట. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు నిర్మాతలతో నెట్‌ఫ్లిక్స్ చర్చలు జరుపుతున్నట్లుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. డిజాస్టర్ కావడంతో థగ్‌లైఫ్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా మారినట్లుగా వార్తలు వస్తున్నాయి. తొలుత ఈ సినిమాను ఆగస్ట్ 15న స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించారు. కానీ థగ్‌లైఫ్ రిజల్ట్ తేడా కొట్టడంతో కాస్త ముందుగానే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని కథనాలు వెలువడుతున్నాయి. జూలై చివరి వారం లేదా ఆగస్ట్ తొలి వారంలో థగ్‌లైఫ్ ఓటీటీ ప్రేక్షకులను పలకరించే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











