Thug Life: కొత్త ఓటీటీ డీల్‌తో షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్.. కమల్ మూవీకి ఎన్ని కోట్ల నష్టం అంటే?
ఏ ముహూర్తంలో థగ్‌లైఫ్ చిత్రాన్ని మొదలుపెట్టారో కానీ అన్నీ అవాంతరాలు, వివాదాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈరోజుకీ కూడా ఈ సినిమా విషయంలో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. లిప్‌లాక్‌లు, రొమాంటిక్ సీన్స్, కన్నడ భాషపై కమల్ వ్యాఖ్యలు, కోర్టుల వరకు వెళ్లడం, పైగా సినిమా డిజాస్టర్ కావడంతో చిత్ర యూనిట్ పీకల్లోతు సమస్యల్లో కొట్టుమిట్టాడుతూనే ఉంది. డిజిటల్, శాటిలైట్ రైట్స్‌తో కోలుకోవాలని నిర్మాతలు అనుకుంటుండగా.. ఈ విషయంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ వివరాల్లోకి వెళితే..
భారీ బడ్జెట్‌తో థగ్‌లైఫ్
థగ్‌లైఫ్ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో కమల్ హాసన్, మహేంద్రన్, శివ అనంత్, ఉదయనిధి స్టాలిన్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా, రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. శింబు, త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మీ, జోజూ జార్జ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థగ్‌లైఫ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

కన్నడ భాషపై కమల్ వ్యాఖ్యలు
థగ్‌లైఫ్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా బెంగళూరులో జరిగిన ఈవెంట్‌లో కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. కర్ణాటక ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడినందుకు గాను కమల్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేదంటే రాష్ట్రంలో థగ్‌లైఫ్ విడుదల కానివ్వమని చిత్ర యూనిట్‌కు కన్నడ సంఘాలు వార్నింగ్ ఇచ్చాయి. కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలి కూడా కన్నడ సంఘాలకు మద్ధతు పలికింది.
థగ్‌లైఫ్ రిలీజ్‌కు సుప్రీంకోర్ట్ ఆదేశాలు
దీనిపై చిత్ర యూనిట్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం సైతం కర్ణాటక ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సూచించింది. దీనికి కమల్ ససేమిరా అనడంతో థగ్‌లైఫ్ విడుదల నిలిచిపోయింది. ఆ తర్వాత వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో కమల్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. సినిమా చూడాలో? వద్దో నిర్ణయించే అధికారం ప్రజలదని.. బెదిరింపులతో సినిమాను అడ్డుకోలేరని సుప్రీం వార్నింగ్ ఇచ్చింది. థగ్‌లైఫ్ ప్రదర్శించే థియేటర్ల వద్ద భద్రత కల్పించాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్ట్ ఆదేశించింది.
100 కోట్ల క్లబ్‌లోకి చేరని థగ్‌లైఫ్
థగ్‌లైఫ్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా 21 రోజుల వరకు ఇండియాలో రూ.48.15 కోట్ల నెట్.. రూ.56.22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే ఓవర్సీస్‌లో రూ.41.2 కోట్లు అందుకుంది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లతో కలిపి థగ్‌లైఫ్‌కు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.97.42 కోట్ల కలెక్షన్స్ ఆర్జించింది. కనీసం రూ.100 కోట్ల క్లబ్‌లోకి కూడా ఈ సినిమా అడుగుపెట్టకపోవడం కమల్ హాసన్ అభిమానులకు షాకిచ్చింది. థగ్‌లైఫ్ డిజాస్టర్ కావడంతో దర్శకుడు మణిరత్నం ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. ప్రజలు మా నుంచి నాయకన్ రేంజ్ సినిమాను ఆశించారని.. కానీ తాము అంచనాలను అందుకోలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
థగ్‌లైఫ్ ఓటీటీ డీల్‌పై నెట్‌ఫ్లిక్స్ షాక్
సినిమా డిజాస్టర్ కావడంతో థగ్‌లైఫ్ ఓటీటీ డీల్‌పై పున: సమీక్షించాలని ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించింది. థగ్‌లైఫ్ డిజిటల్ నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.130 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకుంది. కమల్ మూవీ డిజాస్టర్ కావడంతో రూ.130 కోట్లు తాము ఇవ్వలేమని, 25 శాతం మొత్తాన్ని లేదా రూ.30 కోట్లను తగ్గించాలని పట్టుపట్టింది. తాజాగా థగ్‌లైఫ్ పాత ఓటీటీ డీల్‌ను పక్కనపడేసి.. కొత్త ఓటీటీ డీల్‌ను తెరమీదకి తీసుకొచ్చినట్లుగా కథనాలు వచ్చాయి. దీని ప్రకారం మొత్తం డీల్‌లో రూ.20 కోట్లను నెట్‌ఫ్లిక్స్ కట్ చేసినట్లుగా సమాచారం. అంతేకాదు.. థగ్‌లైఫ్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ముందుకు జరిగినట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. తొలుత ఈ సినిమాను ఆగస్ట్ 15న స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించారు. కానీ కాస్త ముందుగానే జూలై చివరి వారం లేదా ఆగస్ట్ తొలి వారంలో థగ్‌లైఫ్ ఓటీటీలో రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.
థగ్‌లైఫ్ నిర్మాతలపై మల్టీప్లెక్స్‌లు ఆగ్రహం
ఓటీటీలో థగ్‌లైఫ్ ముందుగా స్ట్రీమింగ్ రావడం కూడా వివాదాస్పదమైంది. నిర్మాతల నిర్ణయంపై మల్టీప్లెక్స్ థియేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కమల్ హాసన్ థగ్‌లైఫ్ థియేటర్‌లో విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీలో ప్రసారం చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారని.. కానీ దానిని ఇప్పుడు రద్దు చేసి ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు రూ.25 లక్షల జరిమానా విధించినట్లుగా టాక్. అలా సినిమా విడుదల నుంచి నేటి వరకు థగ్‌లైఫ్ వివాదాల్లోనూ కొనసాగుతోంది. మరి త్వరలో ఇంకెన్ని వివాదాలు మూటకట్టుకోవాల్సి వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











