ఓటీటీలో దూసుకుపోతున్న మయసభ.. ఇండియా వైడ్ దేవకట్టా సిరీస్ ప్రభంజనం
కరోనా సమయంలో అందుబాటులోకి వచ్చిన ఓటీటీల ద్వారా ప్రేక్షకులు ప్రపంచంలోని అన్ని భాషల్లో ఉన్న ఒరిజినల్ కంటెంట్‌ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అవుతుంటాయి. విడుదలైన ప్రతి సినిమా ప్రేక్షకుడికి నచ్చాలని లేదు.. కొన్ని మాత్రమే వారు ఇష్టపడతారు. ఈ క్రమంలో ప్రేక్షకులకు నచ్చిన సినిమాలు? వెబ్ సిరీస్‌లు ఏంటీ? అనే దానిపై ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రతి నెలా సర్వే నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే ఆగస్ట్ 11 నుంచి 17 వరకు రిలీజైన సినిమాలు, వెబ్ సిరీస్‌లలో ప్రేక్షకుల ఆదరణ పొందినవి ఏవి? ఎన్ని మిలియన్ల మంది ఈ సినిమాలు చూశారన్న దానిపై ఫలితాలను ప్రకటించింది. ఈ వివరాల్లోకి వెళితే..
తెలుగు నాట విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు దేవకట్టా. రోటీన్ కమర్షియల్ సినిమాలకు దూరంగా, సామాజిక సందేశాన్ని మేళవిస్తూ విభిన్న చిత్రాలు తీయడంలో ఎక్స్‌పర్ట్ అనిపించుకున్నారు. అయితే కొన్నాళ్లుగా దేవకట్టా నుంచి సినిమాలు రావడం లేదు. ఓటీటీలు దుమ్మురేపుతుండటంతో తను చెప్పాలనుకున్న కథను మరింత బాగా చెప్పొచ్చనే ఉద్దేశంతో దేవకట్టా వెబ్ సిరీస్‌ల వైపు అడుగులు వేశారు.

ఓటీటీలో దుమ్మురేపుతోన్న మయసభ
దేవకట్టా దర్శకత్వంలో ఆది పినిశెట్టి, చైతన్యరావు నటించిన వెబ్ సిరీస్ మయసభ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయాలు, నేతల జీవితాల్లో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా దేవకట్టా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. హిట్‌మెన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై దేవకట్టా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ఇందులో సాయికుమార్, నాజర్, దివ్యా దత్తా, శత్రు, తాన్య రవిచంద్రన్, రవీంద్ర విజయ్ తదితరులు నటించారు.
కాకర్ల కృష్ణమ నాయుడిగా ఆది పినిశెట్టి, ఎంఎస్ రామిరెడ్డిగా చైతన్య రావులు అద్భుతంగా నటించారు. సోనీ లివ్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. పొలిటికల్ టచ్ ఉండటంతో తెలుగు జనాలు మయసభకు ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే భారతదేశంలో అత్యధికంగా వీక్షించిన వెబ్ సిరీస్‌లలో మయసభ 3వ స్థానంలో నిలిచినట్లు ఆర్మాక్స్ మీడియా తెలిపింది. ఇక ఆర్మాక్స్ మీడియా లిస్ట్‌లోని వెబ్ సిరీస్‌ల వివరాలు పరిశీలిస్తే..
వెన్స్ డే సీజన్ 2:
ఆర్మాక్స్ మీడియా ప్రకటించిన సర్వేలో ఇంగ్లీష్ చిత్రం వెన్స్ డే సీజన్ 2 తొలి స్థానంలో నిలిచింది. ఆల్ప్రెడ్ గాఫ్, మైల్స్ మిల్లర్‌లు దీనిని రూపొందించారు. జెన్నా ఓర్టెగా, వెండోలైన్ క్రిస్టీ, రికీ లిండ్హోమ్, హంటర్ దూహన్, హైన్స్ వైట్ తదితరులు ఈ వెబ్ సిరీస్‌లో నిర్మించారు. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ వెబ్ సిరీస్‌ను దాదాపు 4.4 మిలియన్ల మంది వీక్షించి తొలి స్థానంలో నిలబెట్టారు.
సలాకార్:
మౌనీ రాయ్, నవీన్ కస్తూరియా, ముఖేష్ రిషి, రోహిత్ తివారీ తదితరులు నటించిన వెబ్ సిరీస్ సలాకార్. ఫరూఖ్ కబీర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జియో హాట్ స్టార్‌లో 5 ఎపిసోడ్స్‌గా స్ట్రీమింగ్ అయ్యింది. 4 మిలియిన్ల వీక్షణలతో సలాకార్ ఈ లిస్ట్‌లో టాప్‌లో నిలిచింది.
బింద్యాకీ బాహుబలి:
రాజ్ అమిత్ కుమార్ దర్శకత్వంలో సౌరబ్ శుక్లా, రన్‌వీర్ షోరే, సయీ తమ్హాంకర్, షీబా చద్దా, సీమా బిస్వాస్, సుశాంత్ సింగ్, వినీత్ కుమార్ తదితరులు నటించిన సిరీస్ బింద్యా కీ బాహుబలి. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ఈ వెబ్ సిరీస్ దాదాపు 2.5 మిలియన్ల వ్యూస్‌తో లిస్ట్‌లో 4వ స్థానంలో నిలిచింది.
సారే జహా సే అచ్చా:
సుమిత్ పురోహిత్ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ సారే జహా సే అచ్చా. ప్రతీక్ గాంధీ, సన్నీ హిందూజ, రజత్ కపూర్, కృతికా కామ్రా, తిలోత్తమా షోమె, సుహైల్ నయ్యర్ తదితరులు నటించారు. స్పై, యాక్షన్ ఎలిమెంట్స్ కూడిన ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్‌ను దాదాపు 2.2 మిలియన్ల మంది వీక్షించడంతో లిస్ట్‌లో సారే జహా సే అచ్చాకు 5వ స్థానం లభించింది.


Click it and Unblock the Notifications











