Vaa Vaathiyaar OTT: ఓటీటీలోకి కార్తీ డిజాస్టర్ మూవీ.. తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి, ఎక్కడ చూడొచ్చంటే?
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన వా వాతియర్ మూవీ పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అనుకున్న షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 12న విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో ఈ సినిమా వాయిదా పడింది. అన్ని సమస్యలను అధిగమించి రిలీజ్‌కు రెడీ అయ్యింది కార్తీ మూవీ. సంక్రాంతి సమయంలో రావాల్సిన దళపతి విజయ్ నటించిన జన నాయగన్ విడుదల ఆగిపోవడంతో ఈ గ్యాప్‌ను పూరించడానికి వా వాతియర్‌ను జనవరి 14న విడుదల చేసింది. తెలుగులో అన్నగారు వస్తున్నారు అనే టైటిల్‌తో విడుదల చేయాలని నిర్ణయించినా తమిళంలో మాత్రమే రిలీజ్ చేశారు. అయితే మిక్స్‌డ్ టాక్ కారణంగా వా వాతియార్ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. దాంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయ్యింది. మరి కార్తీ సినిమా ఏ ఓటీటీలో? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది? తెలుగులో ఈ సినిమా రిలీజ్ లేనట్లేనా? ఈ వివరాల్లోకి వెళితే..
నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన వా వాతియార్ మూవీలో కార్తీ సరసన కృతిశెట్టి హీరోయిన్‌గా నటించారు. సత్యరాజ్, రాజ్ కిరణ్, నిలగళ్ రవి, ఆనంద్ రాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరన్‌లు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను నిర్మించారు. జార్జ్ సీ విలియమ్స్ సినిమాటోగ్రఫి, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి వా వాతియర్ మూవీని 40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు.

వా వాతియార్ కలెక్షన్స్
విడుదలైన రోజే కార్తీ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో దీని ప్రభావం కలెక్షన్స్‌పై పడింది. వా వాతియార్ మూవీకి తొలి రోజున 1.65 కోట్ల రూపాయలు, రెండో రోజున 2.35 కోట్ల రూపాయలు, మూడో రోజున 1.55 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.45 కోట్ల రూపాయలు, ఐదో రోజున 70 లక్షల రూపాయలు, ఆరో రోజున 38 లక్షల రూపాయలు, ఏడో రోజున 20 లక్షల రూపాయలు, ఎనిమిదో రోజున 17 లక్షల రూపాయలు, తొమ్మిదో రోజున 13 లక్షల రూపాయలు, పదో రోజున అత్యంత దారుణంగా లక్ష రూపాయల కలెక్షన్స్ మాత్రమే ఈ సినిమా రాబట్టింది.
మొత్తంగా 10 రోజుల వరకు వా వాతియార్ మూవీ ఇండియాలో 8.59 కోట్ల రూపాయల నెట్.. 10.15 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అటు నార్త్ అమెరికా, విదేశాల్లో కలిపి మొత్తంగా ఓవర్సీస్‌లో 90 లక్షల రూపాయల వసూళ్లు సాధించింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి కార్తీ మూవీకి వరల్డ్ వైడ్‌గా 11 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దాంతో సినిమా కార్తీ కెరీర్‌లోనే డిజాస్టర్‌గా నిలిచి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కోట్లలో నష్టాన్ని మిగిల్చింది.
ఓటీటీలోకి వా వాతియార్
వా వాతియార్ మూవీ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. థియేటర్‌లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని ఒప్పందం చేసుకున్నారు. అయితే వా వాతియార్ డిజాస్టర్ కావడంతో కేవలం రెండు వారాల లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని నిర్మాతలు భావించారు. జనవరి 28 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వా వాతియార్ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో తెలిపింది.
తెలుగులో డైరెక్ట్ ఓటీటీలోకి
తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి కార్తీ మూవీని థియేటర్‌లో రిలీజ్ చేయాలని భావించగా.. సంక్రాంతికి తెలుగులో థియేటర్లు దొరక్కపోవడం, తదితర కారణాలతో ఈ సినిమాను కేవలం తమిళంలో మాత్రమే జనవరి 14వ తేదీ విడుదల చేశారు. అయితే తమిళంలో వా వాతియార్ డిజాస్టర్ కావడంతో తెలుగులో విడుదలపై ఉత్కంఠ నెలకొంది. అయితే నిర్మాతలు మాత్రం తెలుగులో దీనిని థియేటర్‌లో విడుదల చేయకుండా.. నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించారు. థియేటర్‌లో డిజాస్టర్‌గా నిలిచిన వా వాతియర్ మూవీ ఓటీటీలో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











