ఓటీటీ డీల్స్‌లో వారణాసి సంచలనం.. మహేశ్- రాజమౌళీ మూవీకి ఆ ఓటీటీ కళ్లు చెదిరే ఆఫర్?
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న చిత్రం వారణాసి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి టేకప్ చేస్తోన్న ప్రాజెక్ట్ కావడంతో పాటు మహేశ్ కెరీర్‌లో 29వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాపై భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు హైప్ పెంచే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నారు. 2027 మార్చిలో వారణాసి విడుదలవుతుందని ఇప్పటికే క్లూ ఇచ్చింది చిత్ర యూనిట్. అయితే రాజమౌళి సినిమా అంటే బిజినెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ సినిమా ఓటీటీ విషయంలోనూ సరికొత్త రికార్డులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
1300 కోట్ల బడ్జెట్‌తో వారణాసి
శ్రీ దుర్గా ఆర్ట్స్, షోవింగ్ బిజినెస్ బ్యానర్స్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తీకేయ, ఎస్ గోపాల్ రెడ్డిలు సంయుక్తంగా వారణాసి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా... మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకు పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ మూవీగా వారణాసి సినిమాను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వారణాసి చిత్రాన్ని 2027 మార్చిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

మార్కెటింగ్‌లో రాజమౌళి స్ట్రాటజీ
తన సినిమాను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో రాజమౌళికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఇప్పటికే ఆయన తనదైన శైలిలో ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టారు. మందాకినిగా ప్రియాంక చోప్రా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలు పరిచయం చేయగా వాటికి భారీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా గత నెలలో నిర్వహించిన గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్‌తో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వారణాసిపై అంచనాలు పెంచేశారు రాజమౌళి. ఇక ఎద్దుపై వస్తున్న మహేశ్ లుక్ వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా ఈ ఎంట్రీ ప్లాన్ చేశారు జక్కన్న.
గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్‌తో కొత్త ట్రెండ్
సెట్స్ మీద ఉండగానే వారణాసి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ అదిరిపోయేలా జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్ ప్రసార హక్కులను జియో హాట్‌స్టార్‌కు భారీ ధరకు విక్రయించి కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు జక్కన్న. ఇక వారణాసి రిలీజ్ అయ్యే నాటికి ఎన్నో ప్రెస్‌మీట్‌లు, ఈవెంట్‌లు జరుగుతాయి. వాటికి కూడా భారీగా డీల్ సెట్ చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.
వారణాసి థియేట్రికల్ రైట్స్‌కు భారీ డిమాండ్
ఇక తెలుగు రాష్ట్రాలు, హిందీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఓవర్సీస్ ఇలా ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు వారణాసికి ఫ్యాన్సీ రేటును ఆఫర్ చేస్తున్నారు. ఇక డిజిటల్, శాటిలైట్, ఆడియో రేట్స్ కోసం బడా కంపెనీలు ఎంతైనా సరే ఇవ్వడానికి కాచుకుని కూర్చొన్నాయి. తాజాగా వారణాసి ఓటీటీ డీల్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం.. మహేశ్ బాబు- రాజమౌళి మూవీ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకునేందుకు ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చినట్లుగా ఫిలింనగర్‌లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అది ఎంత మొత్తానికి అన్న ఫిగర్ మాత్రం బయటకు రాలేదు. కాకపోతే.. వారణాసి క్రేజ్‌కు ఏమాత్రం తగ్గని విధంగా ఉంటుందని టాక్.
వారణాసి ఓటీటీ డీల్‌పై ఊహాగానాలు
ఇప్పటి వరకు భారతీయ చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ - సుకుమార్‌ల పుష్ప 2 చిత్రం ఓటీటీ డీల్స్‌లో టాప్‌లో నిలిచింది. పుష్ప 2 ది రూల్ డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 275 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకుంది. అయితే కనీవినీ ఎరుగని స్థాయిలో 750 కోట్ల నుంచి 1000 కోట్ల రేంజ్‌లో వారణాసి ఓటీటీ డీల్ జరిగేలా చర్చలు జరుగుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియాలోని అన్ని భాషలతో పాటు గ్లోబల్ ఓటీటీ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఈ స్థాయిలో వెచ్చించాలని నిర్ణయించుకుందని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. మరి నిజంగానే వారణాసి ఓటీటీ డీల్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఈ స్థాయిలో ఖర్చు పెట్టేందుకు ప్లాన్ చేస్తుందా? లేదా అన్నది చూడాలి. అదే నిజమైతే మహేశ్ బాబు - రాజమౌళి మూవీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











