Netflix నుంచి రానా నాయుడు అవుట్.. వాళ్లు కోరినట్లుగానే? వెంకటేష్, రానా బూతులు భరించలేక!
టాలీవుడ్ స్టార్ హీరోలలో దగ్గుబాటి విక్టరీ వెంకటేష్ ఒకరు. ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో నటించిన ఆయన ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అగ్ర నిర్మాత కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తన నటనతో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. టాలీవుడ్ వివేకానంద అని అన్ స్టాపబుల్ టాక్ షోలో ఏకంగా బాలకృష్ణే ప్రశంసించారు. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా మల్టీస్టారర్ చిత్రాలు చేస్తున్న ఆయన ఇటీవలే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రానా నాయుడు అనే వెబ్ సిరీస్ ద్వారా బాబాయ్, అబ్బాయ్ (రానా) డిజిటల్ తెరపై కనువిందు చేశారు. అయితే తాజాగా వీరిద్దరు నటించిన ఈ సిరీస్ కు నెట్ ఫ్లిక్స్ షాక్ ఇచ్చినట్లు సమాచారం.

ఒకేసారి ఎంట్రీ..
టాలీవుడ్ లో బాబాయ్ అబ్బాయిగా మంచి ఫామ్ లో ఉన్న నటులు వెంకటేష్, దగ్గుబాటి రానా. వీళ్లిద్దరు కలిసి ఒకేసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలా వీళ్లిద్దరు డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన వెబ్ సిరీసే రానా నాయుడు. ఈ సిరీస్ లో రానా, వెంకటేష్ ఇద్దరు తండ్రీ కొడుకులుగా కలిసి నటించడం విశేషం. ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ నిర్మించగా.. సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకత్వం వహించారు.

చాలా కాలం గ్యాప్..
ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన రానా నాయుడు వెబ్ సిరీస్ పాపులర్ అమెరికన్ సిరీస్ 'రే డోనోవర్' కు ఇండియన్ అడాప్షన్ వెర్షన్ గా నిర్మించారు. బాలీవుడ్ హాట్ బ్యూటి సుర్విన్ చావ్లా చాలాకాలం గ్యాప్ తర్వాత ఇందులో తళుక్కుమంది. ఇక ఆశిష్ విద్యార్థి, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, ఆదిత్య మీనన్, ముకుల్ చద్దా తదితరులు కీలక పాత్రలు పోషించారు. రానా నాయుడు వెబ్ సిరీస్ ను హిందీతోపాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల చేశారు.

శృతిమించి ఉండటం..
మార్చి 10 నుంచి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న రానా నాయుడు వెబ్ సిరీస్ పై విడుదలైనప్పటి నుంచి వ్యతిరేకత వస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ పై తెలుగు ప్రేక్షకులు కాస్తా అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇందులో ఎక్కువగా బూతులు, శృతిమించిన అడల్ట్ కంటెంట్ ఉందని వారు ఆరోపించారు. అయితే ఇలా హిందీ, ఇంగ్లీషు వెబ్ సిరీస్ లలో అలా ఉండటాన్ని యాక్సెప్ట్ చేసిన తెలుగు ప్రజలు రానా నాయుడును మాత్రం అంగీకరిచలేకపోయారు.

సెలబ్రిటీల విమర్శలు..
ఫ్యామిలీ హీరోగా స్టార్ బ్రాండ్ తెచ్చుకున్న వెంకటేష్ తో అలా బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పించడం పట్ల తెలుగు ప్రేక్షకులు పెదవి విరిచారు. అంతేకకాకుండా శివకృష్ణ, విజయ శాంతి వంటి పలువురు సెలబ్రిటీలు కూడా రానా నాయుడు సిరీస్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ సిరీస్ పై తీవ్రమైన నెగెటివిటీ స్ప్రెడ్ అయింది. ఈ క్రమంలో వారి డిమాండ్స్ కు తగినట్లుగా అన్నట్లుగానే రానా నాయుడకు నెట్ ఫ్లిక్స్ షాక్ ఇచ్చింది.

కావాలనే చేశారా..
అయితే రానా నాయుడు వెబ్ సిరీస్ ను మొదటగా హిందీలో చిత్రీకరించారు తర్వాత తెలుగులో డబ్ చేశారు. రిలీజ్ తర్వాత ఇందులోని బూతులపై చెప్పలేనంత ట్రోలింగ్, వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రానా నాయుడు సిరీస్ కు సంబంధించిన తెలుగు ఆడియోను నెట్ ఫ్లిక్స్ నుంచి తొలగించబడింది. అయితే ఇది పొరపాటున జరిగిందా.. లేదా ఉద్దేశపూర్వకంగా తొలగించారా అనేది క్లారిటీ లేదు. మొత్తానికి సెలబ్రిటీలు కోరుకున్నట్లుగా జరిగిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ట్రెండింగ్ లో టాప్..
ఇదిలా ఉంటే రానా నాయుడు వెబ్ సిరీస్ కు తెలుగు డబ్బింగ్ చెబుతున్న సమయంలో వెంకటేష్ చాలా ఇబ్బంది పడినట్లు ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు వెంకీ మామ. ఇక ఈ సిరీస్ పై ఎంత నెగెటివిటీ వచ్చినా నెట్ ఫ్లిక్స్ లో మాత్రం టాప్ ట్రెండింగ్ లో ఉండటం విశేషం.


Click it and Unblock the Notifications











