Srikakulam Sherlock Holmes : ఓటీటీలలో వెన్నెల కిషోర్ నయా హిస్టరీ.. స్టార్లకే లేని రికార్డ్ కొట్టిన షెర్లాక్
ప్రపంచాన్ని కోవిడ్ కుదిపేసిన సమయంలో అందుబాటులోకి వచ్చిన ఓటీటీ మాధ్యమం ప్రజలకు ఇంట్లోనే కావాల్సినంత వినోదాన్ని అందించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోని ఒరిజినల్ కంటెంట్, వెబ్‌సిరీస్‌లను ఆస్వాదించారు జనం. కోవిడ్ తర్వాతి నుంచి ప్రేక్షకులు సినిమా చూసే కోణం పూర్తిగా మారిపోయి కథకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలైంది. స్టోరీ లేకుండా హంగులు , ఆర్భాటాలు, రోటీన్ కమర్షియల్ ఫార్మాట్‌తో సినిమాలు తీస్తే పక్కన పెట్టేస్తున్నారు. ఎంత పెద్ద సూపర్‌స్టార్ నటించినా , తమ అభిమాన హీరో అయినా సరే తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరించారు.
కరోనా తగ్గుముఖం పట్టి పరిస్ధితులు సాధారణ స్థితికి మారినప్పటికీ కూడా జనం ఓటీటీలను విడిచిపెట్టలేదు. ప్రస్తుతం ఓ కుటుంబం మొత్తం థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే ఖచ్చితంగా రూ.1500 నుంచి రూ.2000 వెచ్చించాలి. పెట్రోల్ ఖర్చులు, పాప్ కార్న్ , సమోసా దీనికి అదనం. ఇంటికి వస్తూ ఏ రెస్టారెంట్‌కో వెళితే మరో రెండు వేలో, మూడు వేలో ఖాళీ. దీంతో మధ్య తరగతి, పేదలు థియేటర్ వంక కన్నెత్తి చూడటం లేదు. 1000 నుంచి 2000 ఖర్చుతో మొత్తం ఓటీటీ ఫ్లాట్‌ఫాంల ఏడాది సబ్‌స్క్రిప్షన్ తీసుకుని.. ఓ పది రోజులు ఓపిక పడితే ఇంట్లోనే సినిమా చూడొచ్చనే అభిప్రాయానికి జనం వచ్చేస్తున్నారు.

చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా కథ బాగుంటే ఓటీటీలలో సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. థియేటర్‌లో ఫెయిలైన కొన్ని సినిమాలు ఓటీటీలలో దుమ్మురేపాయి. ఈ కోవలోకే వస్తుంది టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ నటించిన కామెడీ థ్రిల్లర్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. రైటర్‌గా పనిచేసిన మోహన్ తొలిసారిగా మెగాఫోన్ పట్టి ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ విడుదలైంది.
శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా.. వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల, శియా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ మహాదాస్యం, ప్రభాకర్, మురళీధర్ గౌడ్ తదితరులు నటించగా సునీల్ కశ్యప్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాకు చంటబ్బాయి గారి తాలూకా అనే ట్యాగ్ లైన్ కూడా అదనపు ఆకర్షణగా నిలిచింది. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరిగిన రోజే శ్రీకాకుళంలో రోజ్ మేరీ అనే యువతి బీచ్‌లో అనుమానాస్పద స్థితిలో చనిపోతుంది. దీంతో హంతకులను పట్టుకునే పనిని డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్‌కు అప్పగిస్తాడు సీఐ. ఈ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? చివరికి ఏమైంది అన్నదే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా .

థియేటర్‌లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమా తొలుత ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. బుధవారం నుంచి ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అనూహ్యంగా ఈ సినిమా ఓటీటీ లవర్స్‌కి బాగా నచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్‌లో ఉన్న సినిమాల్లో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఆరో స్థానంలో నిలిచి షాకిచ్చింది. దీంతో స్టార్లు, సూపర్‌స్టార్‌లకే లేని రికార్డును వెన్నెల కిషోర్ సాధించాడంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











