Sankranthiki Vasthunam : వెంకటేష్ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన దిల్‌రాజు.. ఇలాగైతే ఓటీటీలో దెబ్బే?
వెంకటేష్ కెరీర్ అయిపోయింది ఇక ఆయన రిటైర్ అవ్వాలని, క్యారెక్టర్ రోల్స్ వేసుకోవాలంటూ సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్‌కు గట్టి సమాధానం ఇచ్చారు విక్టరీ వెంకటేష్. ఒకే ఒక్క సినిమాతో అందరి నోళ్లు మూయించడంతో పాటు సీనియర్ హీరోలలో ఎవ్వరికీ లేని అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. అదే సంక్రాంతికి వస్తున్నాం చిత్రం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వెంకటేష్‌కు , ఆయన అభిమానులకు మరుపురాని జ్ఞాపకంగా మిగిల్చింది.
గతంలో వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3లు ఘన విజయం సాధించాయి. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇండస్ట్రి హిట్‌గా నిలిచింది. ఈ మూడు సినిమాలు ఒక్కొక్కటి రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాయి. సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు. దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ. 85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని నిర్దేశించారు ట్రేడ్ పండితులు. అయితే కేవలం విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కొట్టిపడేసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. దాదాపు రూ. 160 కోట్లకు పైగా లాభాలను డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు పంచిపెట్టింది. దాదాపు రూ.300 కోట్లకు గ్రాస్ పైగా వసూళ్లతో రీజనల్ చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించింది.
సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను జీ5 కళ్లు చెదిరే ధరకు సొంతం చేసుకుంది. అయితే థియేట్రికల్ రన్ బాగుండటంతో ఈ సినిమా ఆలస్యంగా ఓటీటీలోకి వచ్చింది. ఇంతలో జీ5 సంస్థ మరో షాక్ ఇచ్చింది. ఈ సినిమాను ఓటీటీ , టెలివిజన్‌లలో ఒకేసారి అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. మార్చి 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులోనూ, జీ 5 ఓటీటీలోనూ అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ కూడా జీ5 మరో ట్విస్ట్ ఇచ్చింది.
తొలుత థియేటర్‌లో నిడివి ఎక్కువైందనే కారణంతో సంక్రాంతికి వస్తున్నాం కొన్ని సీన్లను కట్ చేశారు. అయితే ఓటీటీ వెర్షన్‌లో ఆ సన్నివేశాలను యాడ్ చేస్తారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా మీనాక్షి చౌదరి- వెంకటేష్ మధ్య ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెరుగుతుందని గాసిప్స్ వైరల్ అయ్యాయి. వెంకీ అభిమానులు కూడా ఈ విషయం తెలిసి ఎంతో సంబరపడ్డారు. అయితే ఓటీటీలో చూస్తే జనాలకు షాక్ తగిలింది. ఎక్స్‌ట్రా సీన్స్‌ను యాడ్ చేయకపోగా.. ఉన్న సన్నివేశాలకే కత్తెర వేశారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. థియేటర్‌తో పోలిస్తే దాదాపు 8 నిమిషాల తక్కువ నిడివితో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి దీనిపై చిత్ర నిర్మాతలు, జీ5 సంస్థ ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











