Sankranthiki Vasthunam: RRR రికార్డు ఔట్ .. ఓటీటీలోనూ కుమ్మేస్తోన్న వెంకటేష్ మూవీ
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రాంతీయ భాషా చిత్రాలలో సరికొత్త రికార్డులు సృష్టించడంతో పాటు ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో వెంకటేష్ తన కెరీర్‌లోనే ఆల్‌టైమ్ హిట్ మూవీని సొంతం చేసుకున్నారు. ఇటీవల ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఇక్కడా కొత్త బెంచ్ మార్క్‌లు సెట్ చేస్తోంది.
సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం వహించారు. నటీనటుల పారితోషికాలు, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి దాదాపు 80 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఆంధ్రా, నైజాంలో 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలు చొప్పున ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు దాదాపు 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు రూ. 85ను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా విలువ కట్టారు ట్రేడ్ పండితులు. అయితే కేవలం మూడు రోజుల్లోనే లాభాల బాట పట్టిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. లాంగ్ రన్‌లో దాదాపు రూ.300 కోట్లకు గ్రాస్ పైగా వసూళ్లు సాధించింది.
వరుస ఫ్లాపులతో సతమతమవుతూ , పీకల్లోతు కష్టాల్లో ఉన్న దిల్‌రాజును, ఆయన బ్యానర్‌ను ఈ సినిమా ఒడ్డున పడేసింది. తెలుగు చలన చిత్ర చరిత్రలో సక్సెస్‌మీట్‌లు, విజయోత్సవ వేడుకలను దర్శక నిర్మాతలు, లేదంటే హీరోలు నిర్మించేవారు. అయితే ఈ సాంప్రదాయానికి భిన్నంగా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను నిర్మించారు. చాలా రోజుల తర్వాత తాము లాభాలను కళ్లచూశామని పలువురు బయ్యర్లు ఎమోషనల్ అయ్యారంటే ఈ సినిమా ప్రభావం ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను జీ5 సంస్థ సొంతం చేసుకుని మార్చి 1వ తేదీన ఓటీటీ, టెలివిజన్‌లో ఒకేసారి అందుబాటులోకి తీసుకొచ్చింది. లేట్‌గా దిగినా ఈ సినిమా ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. కేవలం 12 గంటల వ్యవధిలోనే ఈ సినిమా 100 మిలియన్లకు పైగా వ్యూస్ మినిట్స్ సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. అలాగే దాదాపు 13 లక్షల మంది సినిమాను వీక్షించారని జీ5 పేర్కొంది. అంతేకాదు.. టాలీవుడ్ బడా చిత్రాలు ఆర్ఆర్ఆర్, హనుమాన్‌ల ఓటీటీ ఓపెనింగ్స్ రికార్డులను సంక్రాంతికి వస్తున్నాం బద్ధలు కొట్టిందని ఓటీటీ సంస్థ తెలిపింది. మరి రానున్న రోజుల్లో ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











