పోసాని కృష్ణమురళికి కోర్టులో ఎదురుదెబ్బ.. ఆ జైలుకి మెంటల్ కృష్ణ
కులాలు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రగిల్చేలా మాట్లాడిన కేసులో సినీనటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం కొర్లకుంటకు చెందిన జనసేన నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోసాని కృష్ణమురళిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఈ నెల 26న పోసానిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోసాని అరెస్ట్ నేపథ్యంలో సినీ , రాజకీయ రంగాలు ఉలిక్కిపడ్డాయి. ఆయన అరెస్ట్‌ను ఖండిస్తూ ఏపీ వ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు, ధర్నాలు నిర్వహించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 అనంతరం రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన పోసాని.. ప్రస్తుతం ఏ పార్టీతోనూ సంబంధం లేకుండా ఉన్నారని.. అలాంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. శివరాత్రి పర్వదినం అని కూడా చూడకుండా కూటమి ప్రభుత్వం కక్ష్య రాజకీయాలకు పాల్పడుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

తొలుత బుధవారం అర్ధరాత్రి 8.45 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని పోసాని కృష్ణమురళి నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం ఉదయం 12 గంటలకు ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. గురువారం రాత్రి 9.20 గంటలకు పోసానిని రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరచగా.. దాదాపు 8 గంటల పాటు ఇరుపక్షాల మధ్య వాదనలు వినిపించారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల వరకు వాదనలు సాగాయి. పోసాని కృష్ణమురళి తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
బీఎన్ఎస్ చట్టం ప్రకారం పోసాని కృష్ణమురళికి 41ఏ కింద నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానానికి పొన్నవోలు విజ్ఞప్తి చేశారు. దీనికి నిరాకరించిన న్యాయమూర్తి పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో మార్చి 12 వరకు పోసాని రిమాండ్‌లో ఉండనున్నారు. కోర్ట్ తీర్పు అనంతరం పోసానిని రాజంపేట సబ్‌జైలుకు తరలించారు. అయితే ఈ కేసులో పోసానికి రిమాండ్ విధించడం సరికాదని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పు ప్రకారం ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసులకు రిమాండ్ విధించకూడదని.. దీనిపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ వేస్తామని సుధాకర్ రెడ్డి చెప్పారు.
పోసాని కృష్ణమురళిపై ఏపీలోని పలు ప్రాంతాల్లో 16 కేసులు నమోదు చేశారని పొన్నవోలు మండిపడ్డారు. ప్రశ్నించేవారిన అణిచివేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఆయన అన్నారు. జగన్ ఆదేశాలతో న్యాయ పోరాటం చేస్తామని సుధాకర్ రెడ్డి తెలిపారు. పోసాని కేసులో ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే వైసీపీ వర్గాలు పోసానిపై బెయిల్‌పై ప్రయత్నాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











