‘వైఎస్ జగన్‌ది దారుణమైన మెంటాలిటీ , ఎమ్మెల్యేలనే కొడతాడు’
మురళీ మోహన్.. తెలుగువాళ్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. దశాబ్ధాలుగా ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటున్న ఈ దిగ్గజం.. 80 ప్లస్‌లోనూ ఎంతో యాక్టీవ్‌గా ఉంటారు. తెలుగు సినిమా స్వర్ణయుగానికి ప్రతినిధులుగా జీవించి వున్నవారిని ఇప్పుడు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.. వారిలో మురళీ మోహన్ ఒకరు. సినీ, వ్యాపార, రాజకీయ రంగాలలో తనదైన ముద్రను వేసిన ఆయన.. వ్యాపారం చేసుకుంటూ ఇండస్ట్రీ వైపు అడుగుపెట్టారు. మురళీమోహన్ అసలు పేరు మాగంటి రాజాబాబు. బెజవాడలో ఉన్నప్పుడు స్నేహితులతో కలిసి సరదాగా నాటకాలు వేసిన ఆయన .. కొందరి ప్రోత్సాహంతో సినీరంగం వైపు అడుగులు వేశారు.
1973లో విడుదలైన జగమే మాయ ద్వారా మురళీ మోహన్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమా ద్వారానే మరో దిగ్గజ నటుడు గిరిబాబు కూడా ఎంట్రీ ఇవ్వడం విశేషం. జగమే మాయలో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళీ మోహన్‌కు తర్వాతి రోజుల్లో అవకాశాలు పోటెత్తాయి. ముఖ్యంగా మంచి అందగాడు కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆయనకు ఫాలోయింగ్ ఏర్పడింది. అప్పటికే ఎన్టీఆర్ , ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు వంటి అగ్రనటులు చిత్ర పరిశ్రమను ఏలుతున్న సమయం.. కొత్త వారు వచ్చినా ఆ పోటీ మధ్య నిలదొక్కుకోవడం చాలా కష్టం. అందుకే మురళీ మోహన్ కేవలం హీరో వేషాలే వేస్తానని మడి కట్టుకుని కూర్చోలేదు. తన దగ్గరకు వచ్చిన ప్రతిపాత్రను అంగీకరించి.. వాటిలో పరకాయ ప్రవేశం చేసేవారు. కొన్ని సార్లు హీరోగా, మరికొన్ని సార్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మురళీ మోహన్ కనిపించేవారు.

నటుడిగా నిలదొక్కుకున్న తర్వాత నిర్మాతగానూ రాణించాలని మురళీ మోహన్ భావించారు. దీనిలో భాగంగా తన సహచర నటుడు గిరిబాబు నెలకొల్పిన జయభేరి సంస్థను సొంతం చేసుకుని సోదరుడు కిశోర్ ద్వారా సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు. అలా తనే హీరోగా రామదండును తెరకెక్కించిన ఆయన మహేశ్‌తో తీసిన అతడు వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూ, నిర్మిస్తూ బిజీగా ఉన్నప్పుడే .. స్వతహాగా బిజినెస్ మైండ్ కావడంతో శోభన్ బాబు సూచన మేరకు రియల్ ఎస్టేట్ రంగంలో కాలుపెట్టారు. జయభేరి గ్రూప్ పేరుతో కన్‌స్ట్రక్షన్స్ రంగంలో అడుగుపెట్టి అక్కడా హిట్ కొట్టారు.
తొలి నుంచి రాజకీయాలపై మురళీ మోహన్‌కు ఇంట్రెస్ట్ అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ప్రచారం కూడా చేశారు. నాటి నుంచి టీడీపీలో యాక్టీవ్‌గా ఉంటూ వస్తున్న ఆయన 2009 సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ 2014 ఎన్నికల్లో అదే రాజమండ్రి నుంచి ఎంపీగా విజయం సాధించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా, నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఎన్ఎఫ్‌డీసీ), ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఏపీఎఫ్‌డీసీ)లలో పలు కీలక బాధ్యతలను నిర్వర్తించి సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశారు.

ప్రస్తుతం వయసు పైబడుతుండటంతో బాధ్యతలను పిల్లలకు అప్పగించినా.. ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన మురళీ మోహన్ తన సినీరంగ ప్రవేశం, చిత్ర పరిశ్రమలో ఇబ్బందులు, రాజకీయాలపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, జగన్ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో ఏపీలో అభివృద్ధి పడకేసిందని, ఉన్న పరిశ్రమలను తరిమేశాడని మురళీమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరరాజా బ్యాటరీస్‌ను జగన్ ఎంతో వేధింపులకు గురిచేశారని, చివరికి గల్లా జయదేవ్ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారని మురళీ మోహన్ అన్నారు.
ఓటమికి గల కారణాలను వైసీపీ నేతలు జగన్ వద్ద ప్రస్తావించడం లేదని, నిజాలు చెబితే ఆయన ఎలా రియాక్ట్ అవుతారోనని వారు భయపడుతున్నారని మురళీ మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కొట్టినా ఆశ్చర్యపడనక్కర్లేదని, ఎంతోమందిని కొట్టాడని ఆరోపించారు. అమరావతిని నిర్మిస్తే క్రెడిట్ చంద్రబాబుకు దక్కుతుందనే భయంతో జగన్ మూడు రాజధానులను తెరమీదకి తీసుకొచ్చారని, ఈ గందరగోళంలో తన వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయని మురళీ మోహన్ తెలిపారు. ఈసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు అమరావతిపై గట్టి ఫోకస్ పెట్టారని, కేంద్రం నుంచి నిధులు రప్పించి పనులు మొదలుపెడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











