చివరి శ్వాస వరకు నా లక్ష్యం, కోరిక అదే.. పదవులపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ స్థాపించి సక్సెస్ కావడానికి ఆయన కుటుంబ సభ్యులు , అభిమానులు ఎంతో శ్రమించారు. వీరిలో కొందరిది పరోక్ష సహకారమైతే, ఇంకొందరు ప్రత్యక్షంగా ఆయన వెంట నడిచారు. కుటుంబం విషయానికి వస్తే తన చిన్న అన్నయ్య నాగబాబు.. పవన్ కోసం ప్రాణాలిస్తారు, ఆయనపై ఈగ వాలనివ్వరు. పవన్ కళ్యాణ్‌ను ఎవరైనా ఏమైనా అంటే మెగా ఫ్యామిలీ నుంచి ముందు స్పందించేది నాగబాబే. సోషల్ మీడియాలో ట్వీట్లు, వీడియోలు మొదలుపెట్టి.. అవసరమైతే మీడియాకు ముందుకు వచ్చి ఏకీపారేస్తారు.
రాజకీయాలపై తొలి నుంచి అవగాహన ఉండటంతో పాటు కాపు సామాజికవర్గం, చిరంజీవి అభిమాన సంఘాలతో నాగబాబుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు క్షేత్రస్థాయిలో కేడర్‌తో చాలా దగ్గరగా ఉన్నారు నాగబాబు. ఈ నేపథ్యంలోనే అన్నయ్య సేవలను మరింత వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఆయనను జనసేన ప్రధాన కార్యదర్శిగా నియమించారు పవన్ కళ్యాణ్. ఎన్నికల సమయంలో నాగబాబు కీలకపాత్ర పోషించారు. టీడీపీ , బీజేపీలతో పొత్తు ఉండటంతో అభ్యర్ధుల ఎంపిక, పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించే వ్యవహారాలు నాగబాబు పర్యవేక్షించారు. ఆయన క్షేత్రస్థాయిలో చాలా వరకు అసమ్మతి సెగను చల్లర్చడం వల్లే పవన్‌కు పని తేలికైందన్న వాదనలు ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో అయితే నాగబాబు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్ధుల తరపున జనసేనాని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తుండటంతో పిఠాపురం బాధ్యతను నాగబాబు తీసుకున్నారు. తన తనయుడు వరుణ్ తేజ్, మేనల్లుళ్లు సాయిథరమ్ తేజ్, వరుణ్ తేజ్‌లతో పాటు జనసేన కేడర్ ప్రచారాన్ని ఆయనే పర్యవేక్షించారు. పిఠాపురం నియోజకవర్గంలోని టీడీపీ, బీజేపీ శ్రేణులను కలుపుకుపోయారు. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే చాలు వెంటనే రంగంలోకి దిగిపోయేవారు నాగబాబు.
కూటమి అధికారంలోకి రావడంతో తొలి నుంచి తనకు అండగా నిలిచి, కష్ట సుఖాల్లో తోడుగా ఉన్న తన సోదరుడు నాగబాబుకు పవన్ కళ్యాణ్ ఏ రకంగా న్యాయం చేస్తారోనని జనసైనికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి నాగబాబు పోటీ చేయాల్సింది. అయితే పొత్తులో భాగంగా బీజేపీ ఆ సీటు కావాలని పట్టుబట్టడంతో పవన్ విజ్ఞప్తి మేరకు నాగబాబు పోటీ నుంచి తప్పుకుని త్యాగం చేశారు. నాగబాబును రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది కానీ అది కూడా ఉత్త మాటేనని తేలింది.
అనంతరం ఎమ్మెల్సీల భర్తీ సమయంలోనూ నాగబాబు పేరు తెరపైకి వచ్చింది. అయితే పార్టీ పెట్టిన నాటి నుంచి తన వెంటే ఉండి, రాజకీయ కార్యదర్శిగా సేవలందిస్తున్న హరిప్రసాద్‌కు అవకాశం కల్పించారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం నామినేటెడ్ పోస్టుల భర్తీ జరుగుతుండటంతో టీటీడీ ఛైర్మన్ రేసులో నాగబాబు పేరు వినిపిస్తోంది. ఇదే సమయంలో నాగబాబు పదవి విషయంలోనూ పవన్ క్లారిటీ ఇచ్చారు. తన కుటుంబ సభ్యులెవరూ టీటీడీ ఛైర్మన్ పదవి కోరలేదని , అయినా వారు అడిగినట్లుగా ప్రచారం జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి వేళ నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా చెక్కులను పార్టీ కార్యాలయంలో ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. పదవులపై తనకు ఎలాంటి ఆశ లేదన్నారు. తన ఒంట్లో ఓపిక, ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు జనసేన కోసం పనిచేస్తానని ఆయన కుండబద్ధలు కొట్టారు. తన సోదరుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేస్తానని.. తాను కష్టాల్లో ఉన్నప్పుడు తమ్ముడు అండగా నిలిచిన విషయాన్ని నాగబాబు గుర్తుచేసుకున్నారు.
చంద్రబాబు, పవన్ ఇద్దరూ మంచి విజన్ ఉన్న నేతలని.. వీరి భాగస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందుతుందన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు ఏం చేయని జగన్.. కూటమి అధికారంలోకి వచ్చి నెల తిరక్కుండానే మొరుగుతున్నారంటూ నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చి గాడిలో పెడతామని చురకలంటించారు. పవన్ ఎంతోమందికి చేతనైన సాయం చేశారని.. అందుకే ఈ స్థితిలో ఉన్నారని.. జగన్ తన జేబులోంచి పది రూపాయాలు తీసి ఇవ్వడం తాను చూడలేదని నాగబాబు దుయ్యబట్టారు. పదవులపై ఆయన చేసిన వ్యాఖ్యలు జనసేన వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











