ఏపీ ప్రభుత్వంలో నాగబాబుకు కీలక పదవి.. పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్!
జనసేన పార్టీకి విశేష సేవలు అందిస్తున్న నాగబాబుకు అరుదైన గౌరవం దక్కింది. పార్టీకి విశ్వాసంగా, నిస్వార్ధ సేవలందించిన ఆయనకు సముచిత స్థానం కల్పించాలని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నాగబాబుకు పార్టీలో దక్కిన గౌరవం ఏమిటి? ఆయనకు ఎలాంటి పదవి వరించబోతున్నదనే వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ కల్యాణ్‌తోపాటు నాగబాబు బేషరతుగా సేవలు అందించారు. అప్పటి ప్రభుత్వ నేతలు, వైసీపీ పార్టీ నాయకులు చేసే అసత్య ఆరోపణలను తిప్పి కొడుతూ.. పార్టీ కార్యకర్తల్లో నైతికంగా బలాన్ని అందించారు. అంతేకాకుండా అప్పటి ప్రభుత్వ విధానాలను, వారి అరాచకాలను య్యూటూబ్ ఛానెల్ ద్వారా ఎండగట్టారు.

పార్టీకి సేవలు, కార్యకర్తలు, నేతలతో అనుసంధానం, పార్టీ సిద్దాంతాల పట్ల అవగాహన కల్పించారు. పార్టీకి ఎదురైన గడ్డు పరిస్థితుల్లో ఎదురులేని ధైర్యాన్ని అందించారు. అంతేకాకుండా గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే పదవికి పోటీ చేయాల్సిన పరిస్థితుల్లో పొత్తుల్లో భాగంగా ఆ సీటును కూడా త్యాగం చేసి పార్టీ పట్ల నిబద్దతను, అంకితభావాన్ని, విశ్వాసాన్ని చాటుకొన్నారు. గత దశాబ్ద కాలానికిపైగా పార్టీకి ఎనలేని సేవలు అందించారు.
గత కొన్నేళ్లుగా పార్టీ నియమాలకు, నిబంధనలకు కట్టుబడి పనిచేస్తున్న నాగబాబుకు శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్న నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని పార్టీ కేంద్ర కార్యాలయం సమాచారం ఇచ్చారు అని పార్టీ ముఖ్య నేత హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
నాగబాబును ఎమ్మెల్సీ పదవికి అభ్యర్థిగా నిర్ణయించడంతో పార్టీ శ్రేణులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన నామినేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. త్వరలోనే ఆయన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. అయితే ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత నాగబాబును మంత్రివర్గంలోకి కూడా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











