ప్రకాశ్ రాజ్ కనిపిస్తే నరికి వేయండి.. నాదే బాధ్యత.. బీజేపీ నేత హుకుం జారీ
నటుడు ప్రకాశ్ రాజ్‌పై హిందుత్వ వాదులు, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత జనవరిలో కేరళలో కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. రావణుడు దక్షిణ భారత్‌కు చెందిన ఒక గిరిజన నాయకుడు. కేవలం పండ్లు దొంగిలించడం వల్లే వారి మధ్య ఘర్షణ మొదలైంది అనే విధంగా కామెంట్స్ చేశారు. పండ్ల ధర చెల్లించే విషయంలో రాముడు, రావణుడి చెల్లెలు శూర్పణఖకు గొడవ జరిగింది అనే విధంగా వ్యాఖ్యలు చేశారు. అయితే జనవరిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. దాంతో ఆ అంశం సినీ, రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే శ్రీరాముడిపై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు అంటూ హిందుత్వ వాదులు మండిపడ్డారు. తాజాగా బీజేపీ నేత వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
శ్రీ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బ తీసిన ప్రకాశ్ రాజ్‌ను తెలుగు సినిమా పరిశ్రమ నుంచి బహిష్కరించాలి. అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, రామకృష్ణ సినీ స్డూడియో ల్లాంటి సంస్థలు ఆయనపై వేటు వేయాలి. ఎఫ్‌డీసీ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఇతర నిర్మాతలు ఆయనకు సినిమా ఆఫర్లు ఇవ్వకూడదు అని బీజేపీ నేత శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.

సినీ ప్రముఖులకు రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే? ప్రకాశ్ రాజ్ స్త్రీ లోలుడు, తాగుబోతును తెలుగు సినిమా పరిశ్రమలో ప్రోత్సహించకూడదు. వేషాల కోసం వస్తే తగిన బుద్ది చెప్పాలి. హిందూ దేవతలను దూషించిన వ్యక్తికి అఫర్లు ఇస్తారా? డబ్బు సంపాదన కాకుండా విలువలు పాటించాల్సిన అవసరం ఉంది. విలువలేని ప్రకాశ్ రాజ్‌ను సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి అని ఆయన అన్నారు.
సనాతన ధర్మం, శ్రీరాముడి గురించి తప్పుగా మాట్లాడితే ఈ భూమ్మీద బతికే అర్హత కోల్పోవాలి. గతంలో శ్రీకృష్ణుడి తప్పుగా చూపించారు. కానీ ఇప్పుడు నయా భారత్. ఆ రోజలకు ఇక స్వస్తి. వినోదానికి కూడా హద్దు ఉండాలి. హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా సినిమాలు తీస్తే ఖబర్దార్. ఈ సందర్భంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, నిర్మాతల మండలికి చెప్పేదేమిటంటే.. తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కడా ప్రకాశ్ రాజ్ కనిపించకూడదు అని అన్నారు.
ప్రకాశ్ రాజ్ తాను నాస్తికుడు అని చెప్పుకొంటాడు. ఆయన తల్లి చనిపోతే క్రిస్టియన్ మత ప్రార్థనల్లో ఎలా పాల్గొన్నాడు. ఇతర మతాలను ఆచరిస్తూ హిందూ దేవుళ్లపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తారా? ఇలాంటి విషయాలను గ్రహించాలి. దేశాన్ని విచ్చిన్నం చేసే కుట్రలో ప్రకాశ్ రాజ్ భాగం. దేశ వ్యతిరేకి. విలక్షణ నటుడి అనే పేరుతో అమాయక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు అని బీజేపీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూ వ్యతిరేక విధానాలు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారు బతకడానికి వీల్లేదు. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రకాశ్ రాజ్‌ను కోర్టులోకి లాగాలి. రామోజీ ఫిలిం సిటీ, ఇతర స్టూడియోలలో ఎక్కడ కనిపిస్తే.. అక్కడ నరకాలి. దేశం మొత్తం వెతుకుతున్నారు. ఎవ్వడు చంపినా ఆ కేసులో ఏ1గా ఉంటాను. అందుకు నేను బాధ్యత వహిస్తాను అని బిజేపీ నేత శ్రీనివాస్ రెడ్డి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.


Click it and Unblock the Notifications