నా జోలికి రావద్దు.. వైఎస్ జగన్‌కు శివాజీ వార్నింగ్
Actor Sivaji: టాలీవుడ్ నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల మహిళల వస్త్రధారణపై వ్యాఖ్యలు చేయడం తీవ్ర దూమారం రేపింది. ఆయన వ్యాఖ్యలను కొంతమంది సపోర్టు చేయగా.. మరికొందరూ తీవ్రంగా విమర్శించారు. ఈ క్రమంలో మహిళ కమిషన్ ఎంట్రీ వంటి పలు కీలక పరిణామాలు జరిగాయి. ఈ వివాదాన్ని జనాలు మర్చిపోకముందే ఇప్పుడు మరోసారి మరో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. ఈ సారి ఏపీ రాజకీయాలు, ప్రతి పక్ష వైసీపీ పై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు.ఇంతకీ ఏమైందంటే?
శివాజీ లేటెస్ట్ మూవీ సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసిని. ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయింది. అయితే ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేకపోయింది. కొన్ని ఏరియాల్లో మాత్రం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఈ క్రమంలో హీరో శివాజీ ఓ వీడియోని రిలీజ్ చేశారు. అందులో ఆయన సినిమా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంతే కాదు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అది హాట్ టాపిక్ గా మారింది. అసలు శివాజీ ఏం మాట్లాడారంటే?

శివాజీ మాట్లాడుతూ... తన సినిమా బాగోలేదని సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ కావాలనే ప్రచారం చేస్తోందని ఆరోపించారు. 'సినిమా నిజంగా బాగోలేకపోతే మార్నింగ్ షో తర్వాత థియేటర్లకు ఎవ్వరూ రారు. కానీ కొందరు సోషల్ మీడియా ద్వారా మిక్స్‌డ్ టాక్ అంటూ ప్రచారం చేస్తున్నారు. పేటీఎం బ్యాచ్ ఎంత ప్రయత్నించినా నా సినిమాకు పెద్దగా నష్టం ఉండదు' అని ఆయన అన్నారు. తాను మంచి సినిమా తీసానని, సినిమా బాగుందా లేదా అన్నది ప్రేక్షకులే నిర్ణయిస్తారని, సోషల్ మీడియాలో ప్రచారం చేసే వాళ్లు కాదని స్పష్టం చేశారు.
అంతేకాదు, సినిమా విడుదలకు ముందే కొందరు రివ్యూలు ఇవ్వడం కూడా ఆయన తప్పుబట్టారు. 'ఎవరికి వేయి సబ్‌స్క్రైబర్లు ఉన్నా చాలు... వెంటనే రివ్యూలు ఇవ్వడం మొదలుపెడుతున్నారు. సినిమా చూడకుండానే నెగటివ్ టాక్ క్రియేట్ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు' అని అన్నారు. తన సినిమాను అడ్డుకోవడానికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని ఆరోపించిన శివాజీ... 'ప్రేక్షకులు ఒకసారి సినిమా చూస్తే అసలు విషయం వారికి అర్థమవుతుంది. కొద్ది రోజుల్లో పరిస్థితి మారుతుంది'అని ధీమా వ్యక్తం చేశారు.
ఇంకో వీడియోలో ఆయన రాజకీయాలపై కూడా మాట్లాడటం మరింత చర్చకు దారి తీసింది. 'నాకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదు. నేను నా సినిమాలు చేసుకుంటూ ఉండాలనుకున్నాను. కానీ మీ చేష్టలు చూస్తుంటే ఇక రాజకీయాల గురించి మాట్లాడక తప్పడం లేదు' అని అన్నారు. అమరావతి అంశంపై తాను ఎప్పుడైనా మాట్లాడతానని, ఏ పార్టీతోనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
తన సినిమాపై జరుగుతున్న ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుచరులే కారణమని శివాజీ ఆరోపించారు. 'మీరు సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్‌లను పెట్టి ప్రచారం చేస్తున్నారు. రివ్యూ రైటర్లతో కంటెంట్ రాయిస్తున్నారు. కామెంట్లు పెట్టిస్తున్నారు. సినిమా విడుదలకు ముందే నెగటివ్ రివ్యూలు ఇస్తున్నారు' అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 'మీరు సినిమాను అడ్డుకోగలరేమో కానీ శివాజీని ఆపలేరు'అంటూ సవాల్ విసిరారు.
ఇదే సందర్భంలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి కూడా విజ్ఞప్తి చేస్తానని అన్నారు. 'ఈ దేశంలో సీబీఐపై ప్రజలకు నమ్మకం ఉండాలంటే... సీబీఐ కేసులు ఉన్న వ్యక్తులను రాజకీయాల నుంచి పక్కన పెట్టాలి. ఈ విషయం గురించి ప్రధాని మోదీ గారిని కూడా అడుగుతాను. సోషల్ మీడియా వేదికగా ప్రతిరోజూ ప్రశ్నిస్తాను'అని వ్యాఖ్యానించారు. తాను ఏ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్లి సహాయం కోరలేదని కూడా శివాజీ స్పష్టం చేశారు. 'నేను నిజాయితీగా బతుకుతున్నాను. ఎవరి దగ్గరికి వెళ్లి చేతులు జాపలేదు. ఈ జీవితం నాకు ఇచ్చింది ప్రజలే. అందుకే నేను ప్రజల కోసం నిలబడతాను'అని అన్నారు. తనపై ఎవరైనా ఒత్తిడి తెచ్చినా భయపడనని, తప్పు జరిగితే ఎదురు నిలబడి పోరాడతానని తెలిపారు.
అలాగే మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి కూడా శివాజీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'మీరు సీఎంగా ఉన్నప్పుడే నాపై ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఏం చేస్తారు? పైన దేవుడు ఉన్నాడు... మీరు చేసే పనులన్నీ చూస్తున్నాడు' అంటూ వ్యాఖ్యానించారు. పేటీఎం బ్యాచ్‌ల ద్వారా ఇతరుల జీవితాలతో ఎంతకాలం ఆడుకుంటారని కూడా ప్రశ్నించారు. చివరగా... 'ఇకపై ప్రతిరోజూ మాట్లాడుకుందాం. మీ గురించి, మీ నాయకుడు వైఎస్ జగన్ గురించి కూడా మాట్లాడుతాను. చూసుకుందాం ఏమవుతుందో'అంటూ శివాజీ సవాల్ విసిరారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.


Click it and Unblock the Notifications











