నాది సీమ బ్లడ్డే .. జేసీ ప్రభాకర్ రెడ్డిని మళ్లీ కెలికిన మాధవీలత
సినీనటి , బీజేపీ నేత మాధవీలత - టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జేసీ క్షమాపణలతో ముగిసిపోయింది అనుకున్న ఈ వివాదాన్ని మాధవీలత మళ్లీ రేపారు. మీడియా ముందుకు వచ్చి మరోసారి జేసీకి వార్నింగ్ ఇవ్వడంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తాను న్యూ ఇయర్ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమంపై మాధవీలత విమర్శలు చేయడంతో వివాదం ప్రారంభమైంది. జేసీ పార్క్ వైపు మహిళలు వెళ్లొద్దని.. అక్కడ దారుణమైన ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. మాధవీలత వ్యాఖ్యలపై వెంటనే రియాక్ట్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. మహిళలను కించపరిచేలా ఆమె మాటలు ఉన్నాయంటూ మండిపడ్డారు. జేసీ పార్క్‌లో ఎలాంటి దారుణ సంఘటనలు జరగడం లేదన్నారు. అక్కడితో ఆగితే ఏ గొడవ ఉండేది కాదు.. కానీ మాధవీలత ప్రాస్టిట్యూట్, వేస్ట్ ఫెలో అంటూ జేసీ చేసిన వ్యాఖ్యలు మంట పుట్టించాయి.

తనపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాధవీలత స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. సినిమాల్లో నటించే మహిళలంతా వ్యభిచారులు కాదని.. ప్రభాకర్ రెడ్డి వయసుకు నేను గౌరవం ఇస్తానని , అంతే తప్పించి తాను ఎవరికీ భయపడే రకం కానని చెప్పారు. నన్ను చంపితే చంపుకోండి అంటూ మాధవీలత సవాల్ విసిరారు. స్క్రీన్‌పై కనిపించే ఆడవాళ్లు క్యారెక్టర్‌లెస్, గలీజ్ వాళ్లు అయితే తాడిపత్రిలో ఉండే పతివ్రతలని.. వాళ్లు సినీ రంగంలోకి రావొద్దంటూ ఆమె సెటైర్లు వేశారు.
మాధవీలతకు సపోర్ట్‌గా మైక్ అందుకోవడంతో పాటు అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గారు. మాధవీలత గురించి తాను అలాంటి మాటలు మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని.. ఆమెకు క్షమాపణలు కూడా చెప్పారు. ఇక అక్కడితో ఈ వివాదం సద్దుమణిగిపోయినట్లేనని బీజేపీ, టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మాధవీలత మరోసారి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు.

తనపై , సినీ పరిశ్రమపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌కు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలోని మహిళపై జేసీ ప్రభాకర్ రెడ్డి తప్పుగా మాట్లాడారని, ఇప్పటికే దీనిపై హెచ్ఆర్సీ, పోలీసులకు ఫిర్యాదు చేశానని మాధవీలత తెలిపారు. జేసీ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ స్పందించలేదని.. ఈ నేపథ్యంలో ఆయనపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
సినిమా అనేది నా ప్యాషన్.. సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలకు , రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలు చాలా తేడా ఉందని అందుకే జేసీ వ్యాఖ్యలకు హర్ట్ అయ్యానని ఆమె తెలిపారు. నువ్వు ఫ్యాక్షనిస్ట్ అయితే ఏంటీ? నేను కూడా రాయలసీమ బిడ్డనే, రాగి సంగటి , నాటుకోడి తినే పెరిగానని ఎన్నో ఫ్యాక్షన్ స్టోరీలు చూశానని మాధవీలత చెప్పారు. ఆయన మహిళలను అవమానించేలా మాట్లాడారని.. జేసీపై న్యాయ పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం మాధవీలత వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











