ఇకపై సినిమా టికెట్ రేట్లు పెంచం... నిర్మాతలకు నో ఎంట్రీ.. కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్
బోయపాటి శ్రీను దర్శకత్వంలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం అఖండ 2. ఈ సినిమా విడుదలకు ముందు విడుదల తర్వాత అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ తమకు రావాల్సిన బకాయిలు చెల్లించలేదంటూ 14 రీల్స్ ప్లస్ సంస్థపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో అఖండ 2 సినిమా విడుదల ఆగిపోయింది. టాలీవుడ్ పెద్దలంతా రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించడంతో డిసెంబర్ 5న విడుదల కావాల్సిన సినిమా వారం రోజులు ఆలస్యంగా డిసెంబర్ 12న విడుదలైంది. అయినప్పటికీ ఈ చిత్రాన్ని సమస్యలు చుట్టుముడుతూనే ఉన్నాయి.
అఖండ 2కు టికెట్ ధరల పెంపు
అఖండ 2 చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచడంతో పాటు ప్రీమియర్స్ షోకు అవకాశం కల్పించాయి. అఖండ 2 నిలిచిపోయి తిరిగి డిసెంబర్ 12వ తేదీ రిలీజ్ అయినప్పటికీ మళ్లీ కొత్త జీవో జారీ చేశాయి. ఏపీలో అఖండ 2 రేట్ల పెంపుపై పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. అయితే తెలంగాణలో మాత్రం అఖండ 2 టికెట్ రేట్ల పెంపు, ముందస్తు ప్రీమియర్ షోలపై గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన ఉన్నత న్యాయస్థానం ప్రీమియర్ షోలను రద్దు చేయడంతో పాటు టికెట్ ధరలను పెంచకూడదంటూ తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసింది.

అఖండ 2 టికెట్ల పెంపుపై కోర్టుకి
అయితే దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. దీనిని విచారించిన న్యాయస్థానం సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఈ నెల 14 వరకు స్టే అమల్లో ఉంటుందని.. తదుపరి విచారణ ఈ నెల 15 వరకు వాయిదా వేసింది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వంపైనా విమర్శలు వస్తున్నాయి. గతంలో పుష్ప 2 తొక్కిసలాట సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ప్రీమియర్స్ షోలకు, టికెట్ ధరల పెంపుకు అనుమతించబోమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
అయితే ఇటీవల విడుదలైన కొన్ని పెద్ద సినిమాలకు టికెట్ ధరలు పెంచడం, ప్రీమియర్స్‌కు అనుమతించడంతో రేవంత్ సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా అఖండ 2తో మరోసారి ప్రభుత్వంపై కొందరు విమర్శలు చేయడంతో తెలంగాణ సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు ఉండదని కరాఖండీగా తేల్చిచెప్పేశారు.
నిర్మాతలు నన్ను కలవొద్దు
ఇకపై తమ సినిమా టికెట్ ధరలను పెంచమని నిర్మాతలు, దర్శకులు ప్రభుత్వం వద్దకు రావొద్దు. అసలు హీరోలకు వందల కోట్ల రెమ్యునరేషన్ ఎవరు ఇవ్వమన్నారు? కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లాలంటే తక్కువ ధరలే అందుబాటులో ఉండాలి. మాది ఇందిరమ్మ ప్రభుత్వం.. పేదల కోసమే నిర్ణయాలు ఉంటాయి. టికెట్ ధరలు పెంచొద్దని గతంలోనే నిర్ణయించుకున్నాం.. ఈసారి పొరపాటు జరిగింది, భవిష్యత్‌లో తెలంగాణలో సినిమా టికెట్ ధరలు పెంచేది లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మరి దీనిపై తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎలా స్పందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











