ఎమ్మెల్యేగా ఉంటే ఎంత? లేకపోతే ఏంటి? బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌పై యాంకర్ శ్యామల మండిపాటు
చిన్నా చితకా సినిమా ఈవెంట్లు చేస్తూ తన అంద చందాలతో స్టార్ యాంకర్‌గా నిలిచింది శ్యామల. ఓ బిడ్డకు తల్లయినా చెక్కు చెదరని గ్లామర్‌తో సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటో షూట్‌లతో హల్‌చల్ చేసింది. పలు సినిమాలలోనూ అవకాశాలు దక్కించుకుని.. హోస్ట్‌గా, నటిగా బిజీగా ఉన్న దశలో రాజకీయాల్లోకి వేలు పెట్టి చేతులు కాల్చుకుంది. శ్యామల భర్త నరసింహారెడ్డికి వైఎస్ కుటుంబంతో సత్సంబంధాలు ఉండటంతో వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిలతో సన్నిహితంగానే ఉండేది శ్యామల.
2024 ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్
గతంలో జగన్, షర్మిల నిర్వహించిన పాదయాత్రలో కనిపించి షాకిచ్చిన షర్మిల.. 2024 ఏపీ ఎన్నికల్లో మాత్రం నేరుగా ప్రచార బరిలోకి దిగిపోయింది. వైసీపీ అభ్యర్ధుల తరపున పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించింది శ్యామల. అంతేకాదు ఓ ఇంటర్వ్యూలో ఏకంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను ముసలి నక్క, గుంట నక్కలతో పోలుస్తూ ఆమె చెప్పిన కథ దుమారం రేపింది. అప్పుడే టీడీపీ, జనసేన కేడర్ శ్యామలపై విరుచుకుపడింది.

చంద్రబాబు, పవన్‌లపై కథ
ఆ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఖచ్చితంగా తనకు ఏదో ఒక పదవి గ్యారెంటీ అనుకుంది శ్యామల. కానీ అందుకు భిన్నంగా వైసీపీని కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారు ప్రజలు. ఊహించని పరాజయంతో స్వయంగా వైఎస్ జగన్ ఫలితాల నాడు భావోద్వేగానికి గురయ్యారు. వైసీపీ కేడర్ చాలా రోజుల జనంలోకి రాలేకపోయాయి. ఇక వైసీపీకి మద్ధతుగా మాట్లాడిన చాలా మంది సినీ జనాలు అజ్ఞాతంలోకి వెళ్లిపోగా.. శ్యామలకు పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన శ్యామలకు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవిని కట్టబెట్టారు జగన్.
పవన్ కనిపించడం లేదు
నాటి నుంచి కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియా, మీడియా ద్వారా విమర్శలు గుప్తిస్తూ వస్తున్నారు శ్యామల. తాజాగా శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలపై ఘాటు విమర్శలు చేసింది. పవన్ కనిపించడం లేదంటూ స్టేజ్ మీదే ఫ్లకార్డులు ప్రదర్శించిన శ్యామల.. పవన్ ఎక్కడున్నారో చెప్పాలంటూ సెటైర్లు వేశారు.
బాలయ్యది గెలుపే కాదు
మూడు సార్లు గెలిచానని చెప్పుకునే నందమూరి బాలకృష్ణ గారు ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కనిపించారని శ్యామల ప్రశ్నించింది. ఏదైనా మీటింగ్ ఉంటే ఫేస్ చూపించి వెళ్లిపోతారు తప్పించి.. ఇక్కడి సమస్యలు, సంగతులు ఆయనకి ఏం తెలుసు ఆయన ఎలాంటి బాధ్యత వహిస్తారని శ్యామల నిలదీసింది. హిందూపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అన్న బోర్డు మాత్రమే కొన్ని సంవత్సరాలుగా కనిపిస్తోందని.. అలాంటప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఆయన ఉంటే ఎంత లేకపోతే ఎంత అని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికల్లో భారీ విజయం వచ్చినట్లుగా కూటమి నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారని, నిజంగా వాళ్లు గెలిచిన గెలుపు ఎలాంటి గెలుపు అనేది హిందూపురం నియోజకవర్గమే తెలియజేస్తుందని శ్యామల అన్నారు. ఒక్కబూతులో ఒక్క ఓటు.. కనివినీ ఎరిగామా? ఇలాంటివి.. దీనిని బట్టి వాళ్లు గెలిచిన గెలుపు ఎలాంటిదో అర్ధమవుతోందన్నారు. మీ నియోజకవర్గమే దీనిని ప్రూవ్ చేసిందని .. దానిని దృష్టిలో పెట్టుకుని ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు ఈవీఎంల వల్ల గెలిచిన గెలుపు అనేది అర్ధమవుతోందన్నారు.
ప్రస్తుతం శ్యామల వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై టీడీపీ, జనసేన కేడర్ కౌంటర్ ఇస్తోంది. హిందూపురంలో వైసీపీకి ఆదరణ లేదని బాలయ్య ఎమ్మెల్యేగా బాగా పనిచేస్తుండటంతో, అభివృద్ధి కార్యక్రమాల వల్లే ప్రజలు ఆయనను మూడు సార్లు గెలిపించారని తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నాయి.


Click it and Unblock the Notifications











