పోసాని కృష్ణమురళీకి బెయిల్.. లాస్ట్ మినిట్‌లో సీఐడీ ట్విస్ట్!
కులాలు, పార్టీల మధ్య విద్వేషాలు రగిల్చేలా మాట్లాడిన కేసులో అరెస్ట్ అయిన సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి విడుదలపై సందిగ్ధం నెలకొంది. ఇంతకీ ఆయన బెయిల్‌పై విడుదల అవుతారా? లేదా? ఇంకెంత కాలం జైలులో ఉంటారు? అంటూ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పోసాని కృష్ణమురళీ కుటుంబ సభ్యులు సైతం ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఆ నేపథ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంది? సీఐడీ మధ్యలో ఎందుకు జోక్యం చేసుకుంది? ఈ వివరాల్లోకి వెళితే..
పోసాని కృష్ణమురళిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం కొర్లకుంటకు చెందిన జనసేన నేత స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ నెల ఫిబ్రవరి 26న పోసానిని హైదరాబాద్ గచ్చిబౌలీలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకుని ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌కు తరలించి రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు.

అయితే రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్‌లలో పోసాని కృష్ణమురళీపై కేసులు నమోదయ్యాయి. వీటిలోనూ విచారణ నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఈ నెల 3న పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు పోసానిని రాజంపేట సబ్ జైలు నుంచి పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఆయనకు న్యాయస్థానం రిమాండ్ విధించగా.. పోసానిని కస్టడీకి ఇవ్వాలంటూ నరసరావుపేట పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో రెండు రోజుల పాటు పోసానిని కస్టడీకి అనుమతించింది నరసరావుపేట కోర్ట్.
ఇది జరిగిన రెండు రోజులకే విజయవాడ భవానీపురం పోలీసులు నరసరావుపేట వచ్చి పీటీ వారెంట్‌పై ఆయనను తీసుకుని వెళ్లారు. దీంతో నరసరావుపేట పోలీసులకు కస్టడీకి తీసుకోవడం కుదరలేదు. అయితే మరోసారి పోసానిని కస్టడీకి అనుమతించాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు నరసరావుపేట పోలీసులు. ఇంతలో విజయవాడ కోర్ట్ పోసానికి బెయిల్ మంజూరు చేసింది. అటు ఆదోనీలోనూ నమోదైన కేసులోనూ పోసానికి బెయిల్ వచ్చింది. మొత్తం అన్ని కేసుల్లోనూ పోసాని కృష్ణమురళీకి బెయిల్ మంజూరు కావడంతో ఆయన విడుదల అవుతారని అంతా భావించారు. కానీ ఈలోపు ఏపీ సీఐడీ షాకిచ్చింది.

పోసానిపై గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ వేయడంతో ఆయన విడుదల నిలిచిపోయింది. పీటీ వారెంట్‌తో కర్నూలు జిల్లా జైలుకు వెళ్లిన సీఐడీ అధికారులు పీటీ వారెంట్‌పై పోసానిని కోర్టు ముందు హాజరుపరచనున్నారు. అనంతరం కర్నూలు నుంచి పోసాని కృష్ణమురళిని గుంటూరుకు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అసలు పోసాని విడుదల అవుతారా? నెక్ట్స్ ఏం జరుగుతుంది అంటూ సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











