టాలీవుడ్ విజయవాడకి షిఫ్ట్ అవ్వాలి .. మరోసారి తేనెతుట్టెను కదిపిన ఏపీ మంత్రి
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ అధికారంలో ఉన్నన్ని రోజులు చిత్ర పరిశ్రమ ఎన్నో ఇబ్బందులు పడింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సినీ పరిశ్రమ ఎంతో ఇష్టపడే నారా చంద్రబాబు నాయుడు సీఎం కాగా.. స్వయంగా సినీరంగానికే చెందిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో టాలీవుడ్‌కు ఏపీలో మంచిరోజులు వచ్చాయని భావిస్తున్నారు. అయితే సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి.
తెలుగు చిత్ర పరిశ్రమ తెలుగు రాష్ట్రంలోనే ఉండాలనే ఉద్దేశంతో మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చింది టాలీవుడ్. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియో నిర్మించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఆ వెంటనే రామానాయుడు , ఎన్టీఆర్, కృష్ణ వంటి దిగ్గజాలు స్టూడియోలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమకు, సినీ ప్రముఖులకు అనేక రాయితీలు ప్రకటించి ఇండస్ట్రీ హైదరాబాద్‌లో స్థిరపడేందుకు సాయం చేసింది. తర్వాతి రోజుల్లో డబ్బింగ్ , రికార్డింగ్, రీ రికార్డింగ్, ఎడిటింగ్, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ ఇలా వేల మందికి ఉపాధి కల్పించే పోస్ట్ ప్రొడక్షన్ విభాగాలు హైదరాబాద్‌లో నెలకొన్నాయి. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ రాకతో హైదరాబాద్‌కు చిత్ర నిర్మాణ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది.

అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో చిత్ర పరిశ్రమ కూడా ఏపీకి తరలివెళ్లాలనే డిమాండ్లు వినిపించాయి. నిజానికి టాలీవుడ్‌కు 60 శాతానికి పైగా ఆదాయం కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచే వస్తోంది. విశాఖలో ఆల్రెడీ రామానాయుడు స్టూడియో ఉండగా తలకొన, తడ, హార్స్‌లీ హిల్స్, కోనసీమలలో అందమైన షూటింగ్ స్పాట్‌లు ఉన్నాయి. ఏపీకి చిత్ర పరిశ్రమను తరలించి .. అమరావతిలో సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ఓ ప్రాంతాన్ని కేటాయించాలన్న ప్రతిపాదనలు సైతం వచ్చాయి.
2014-2019 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టాలీవుడ్‌ను ఏపీకి తరలించే ప్రయత్నాలు జరిగాయని అంటారు. అయితే తర్వాత వచ్చిన జగన్ హయాంలో ప్రయత్నాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రావడంతో టాలీవుడ్‌ను ఏపీకి తరలిస్తారా అన్న చర్చ జరుగుతోంది. తాజాగా విశాఖపట్నంలో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన టూరిజం అండ్ ట్రావెల్ సమ్మిట్ 2024లో మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో సినిమా చిత్రీకరణలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. సినీ పరిశ్రమకు సహకరిస్తామని, కానీ దాని కంటే ముందు విజయవాడకు ఇండస్ట్రీ తరలిరావాలని దుర్గేష్ కోరారు. ఏపీలో చిత్రీకరణలు జరుపుకుంటున్న ప్రాంతాల వివరాలను సినిమాలలో ప్రస్తావించాలని.. అప్పుడే ఈ ప్రదేశాల గురించి పది మందికి తెలుస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టే స్థితిలో లేదని, అందువల్ల పీపీపీ విధానంపై ఫోకస్ చేస్తున్నట్లు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. విశాఖలో షూటింగ్స్ కోసం సింగిల్ విండో విధానం తీసుకొస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మరి దీనిపై సినీ పరిశ్రమ, తెలంగాణ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











