Pawan Kalyan : తిరుమల లడ్డూలో పంది కొవ్వు.. ఎవ్వడిని వదలం , పవన్ కళ్యాణ్ షాకింగ్ రియాక్షన్
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్న క్షేత్రం తిరుమల. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతూ.. భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, ఏడుకొండలు ఎక్కి తిరుమలకు చేరుకుని రెప్పవాల్చినంతసేపు వెంకన్నను చూస్తే చాలు తమ కష్టమంతా మరిచిపోతారు భక్తులు. దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు.. తమ కుటుంబ సభ్యుల కోసం, తమ బంధుమిత్రులకు పంచడానికి లడ్డూలను వెంట తీసుకెళ్లారు. అలాంటి లడ్డూ ఇప్పుడు ఏపీలో రాజకీయ దుమారానికి కారణమైంది. దీనిపై డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రతినిత్యం లక్షలాది భక్తుల రాకతో నిత్యకళ్యాణం పచ్చతోరణంలా ఉంటుంది తిరుమల. సామాన్యులతో పాటు దేశాధినేతలు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు స్వామి వారి సేవలో తరిస్తూ ఉంటారు. అంతటి విశిష్టత ఉన్న తిరుమల కొన్నేళ్లుగా రాజకీయాలకు వేదికగా మారుతోంది. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చాక తిరుమల క్షేత్ర నిర్వహణపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తిరుమల గిరులలో అన్యమత ప్రచార ఘటనలు ఎక్కువయ్యాయి. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ వెనుక ఉన్న చెట్లపై సిలువ గుర్తులు కనిపించడం కలకలం రేపింది.

అలాగే ఇతర మతాలకు చెందిన స్టిక్కర్లతో కూడిన వాహనాలు ఘాట్ రోడ్‌లోకి ప్రవేశించడం, ఆనంద నిలయం మీదుగా డ్రోన్లు వెళ్లడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక వైసీపీ హయాంలో శ్రీవారి దర్శనానికి వచ్చిన రాజకీయ ప్రముఖులు వచ్చామా , వెళ్లామా అన్నట్లు కాకుండా ఆలయం పక్కనే నిలబడి రాజకీయ విమర్శలు చేయడం వివాదాస్పదమైంది. ముఖ్యంగా సినీనటి , మాజీ మంత్రి రోజా తీరు ఎన్నోసార్లు ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. విపరీతంగా రద్దీ ఉండే సమయాల్నూలో రోజా దర్శనానికి వచ్చేవారు. ఆవిడ ఒక్కరే వస్తే ఏ ఇబ్బంది లేదు.. వెంట మందీ మార్బలంతో దిగేవారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో టీటీడీ తయారుచేసిన లడ్డూలో జంతువుల కొవ్వు కలిసినట్లుగా వార్తలు వస్తున్నాయి. లడ్డూల తయారీకి వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలిసి ఉండొచ్చని గుజరాత్‌కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌డీడీబీ) అనుమానం వ్యక్తం చేసింది. నెయ్యిలో కల్తీ జరిగిందని, పాల నుంచి వచ్చిన నెయ్యి కాకుండా ఇతరత్రా కొవ్వులు కలిసినట్లు ఆ పరీక్షలో వెల్లడైందని బోర్డ్ పేర్కొంది. భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో దీనిపై హిందూ సంఘాలు, సాంప్రదాయవాదులు భగ్గుమంటున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లడ్డూల ఇష్యూపై స్పందించారు. ట్విట్టర్‌లో ఓ హిందూ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుపై ఆయన స్పందించారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించడం అందరి మనోభావాలను దెబ్బతీసిందని.. వైసీపీ హయాంలో ఉన్న టీడీపీ బోర్డే దీనికి సమాధానం చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ధార్మిక పద్ధతులు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. సనాతన ధర్మానికి ఏ ముప్పు వచ్చినా కలిసికట్టుగా పోరాడాలన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











