రోడ్డు పక్కనే పవన్ కళ్యాణ్ ప్రజాదర్బార్.. కాన్వాయ్ ఆపి పూరిపాకలో బాధితుల సమస్యలపై..!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చేసినా , ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు. కెరీర్ ఆరంభం నుంచి ఆయన ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. మాస్, యాక్షన్, ఫ్యాక్షన్ సినిమాలు రాజ్యమేలుతున్న దశలో తన సీనియర్లకు, తనతో పాటే కెరీర్ ప్రారంభించిన వారికి పోటీ ఇవ్వాలన్నా.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్నా కొత్తదనం ఉండాలని పవన్ నిర్ణయించారు. అందుకు తగ్గట్లుగానే యూత్ ఫుల్ సినిమాలు తీసుకుంటూ వచ్చారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి మొన్నటి బ్రో వరకు ఆయన ఇదే సూత్రాన్ని అవలంభించారు.
రాజకీయాల్లోనూ తను డిఫరెంట్ అని నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్. పార్టీ పెట్టిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేయకపోగా.. తను మద్ధతిచ్చిన కూటమి అధికారంలోకి వచ్చినా ఏ పదవీ తీసుకోలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఊరుకోనని చెప్పి, కూటమి నుంచి బయటికొచ్చేశారు. ఎవరి మద్ధతు లేకున్నా .. తనకు పరిస్ధితులు వ్యతిరేకంగా ఉన్నా పోటీ చేశారు. తాను రెండు చోట్లా ఓడిపోయినా , గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేని వైసీపీ లాగేసుకున్నా ఎక్కడా చలించలేదు.

మొండిగా పోరాడుతూ.. పార్టీ నడపటం కోసం సినిమాలు చేసి తన సొంత డబ్బును ఖర్చు పెట్టి జనసేనను నిలబెట్టారు. బలవంతుడైన శత్రువును ఎదుర్కోవాలంటే తన బలం చాలదని భావించిన పవన్.. టీడీపీ, బీజేపీలతో కూటమి కట్టారు. బీజేపీని కూటమిలోకి తీసుకురావడానికి తనకిచ్చిన సీట్లను కూడా వదులుకున్నారు. ఆయన కృషి ఫలితంగా ఎన్నికల్లో ఘన విజయం సాధ్యమైంది. చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా, ఆరు కీలక శాఖలకు మంత్రిగా పగ్గాలు అందుకున్నారు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనన్న వైసీపీలోని కొందరు నేతల విమర్శలకు తన చేతలతోనే సమాధానమిస్తూ సగర్వంగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
జనసేన పుట్టుకకు ఐదేళ్ల ముందు నుంచే ప్రజారాజ్యం పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పవన్ .. జనం బాధలను చాలా దగ్గరి నుంచి చూశారు. పేదరికంలో పుట్టి పెరిగిన ఆయనకు ఆ కష్టాలు తెలుసు. ఉద్థానం కిడ్నీ బాధితుల సమస్యలు, కౌలు రైతులు, భవన నిర్మాణ కార్మికులు, నేతల ఆత్మహత్యలకు చలించిపోయారు. ప్రభుత్వాలు సాయం చేయకున్నా, ఎవరు ఆదుకోకున్నా.. నేనున్నానంటూ తన సొంత డబ్బులు ఖర్చు చేసి వారిని ఆదుకున్నారు.

అందరిలా కాదు ఆయనొస్తే మంచి జరుగుతుందన్న ఆశ సగటు మనిషిలో ఉంది. ఈ ఐదేళ్ల కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం, తాను చేయాలనుకున్న కార్యక్రమాలపై పవన్‌కు ఖచ్చితంగా ఓ ఐడియా ఉంది. జనవాణి సభలలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన ఆయన వాటిని జాగ్రత్తగా దాచే ఉంచి ఉంటారు. కూటమి అధికారంలోకి రావడంతో ఖచ్చితంగా నాడు ఆయనకు దరఖాస్తులు పెట్టుకున్న వారు న్యాయం జరుగుతుందని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఇవాళ పవన్ కళ్యాణ్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన స్పీకర్‌గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడిని అభినందిస్తూ ప్రసంగించారు. వైసీపీపై సెటైర్లు వేస్తూ, చంద్రబాబును, అయ్యన్నపాత్రుడిని పొగుడుతూ ఆయన ప్రసంగం సాగింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన అక్కడికి వచ్చే సమయానికి వివిధ ప్రాంతాల నుంచి తమ కష్టాలు చెప్పుకునేందుకు కార్యాలయం బయట నిరీక్షిస్తున్నారు.
జనాన్ని చూసిన పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడికక్కడే కాన్వాయ్ ఆపేసి ఆఫీసు ముందున్న పూరి పాకలో కుర్చీలు వేసుకొని బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం , కొన్నింటికి అప్పటికప్పుడే అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించే ఏర్పాట్లు చేశారు పవన్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులైతే డిప్యూటీ సీఎంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











