అమ్మలక్కలకు ఐదేళ్ల క్రితం హామీ.. తొలి సంతకంతో మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. లక్షలాది మంది అభిమానులు , సన్నిహితులు , కార్యకర్తలు ఈ తరుణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశారు. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు, హేళనలను భరించి .. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పవన్ ఈ స్థాయికి చేరుకున్నారు. టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లలో ఆయన సంతకం పెడుతున్న దృశ్యాలను చూసి వారంతా భావోద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ సెక్రటేరియట్‌లో బాధ్యతలు స్వీకరించిన ఫోటోలు , వీడియోలు ట్రెండ్ అయ్యాయి. మీ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని అభిమానులు ఆకాంక్షించారు.
బుధవారం సెక్రటేరియట్‌కు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ .. బ్లాక్ - 2లోని తన ఛాంబర్‌లో సర్వమత ప్రార్థనల అనంతరం బాధ్యతలు స్వీకరించారు. తన వదిన సురేఖ ఇటీవల పవన్‌కు ఓ కాస్ట్‌లీ పెన్నును బహుకరించారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించే సమయంలో ఆ పెన్ను మరిచిపోయినట్లుగా గుర్తించిన పవన్ .. సిబ్బందికి చెప్పి సూట్‌కు కేసును తెప్పించి అందులో ఉన్న పెన్ను తీసుకుని మంత్రిగా సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, టీడీపీ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఏ ఫైల్‌పై సంతకం పెడతారోనని ప్రజలు, అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూశారు. ఇక్కడ కూడా తన విలక్షణను, ప్రత్యేకత, ఆడబిడ్డలపై తన అభిమానాన్ని చాటుకున్నారు పవన్ . తాను మాటిస్తే తప్పనని .. ఏళ్లు గడిచినా అది తన గుండెల్లోనే ఉంటుందని ఈ సందర్భంలో పవన్ ప్రూవ్ చేసుకున్నారు. పవన్ ఏం మాట ఇచ్చారు, ఎవరికిచ్చారు, ఏ ఫైల్‌పై సంతకం పెట్టారోననే కదా మీ డౌట్. అది తెలియాలంటే ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లాల్సిందే.
పదేళ్ల రాజకీయ ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ ఎక్కడికెళ్లినా చెప్పే డైలాగ్ సమస్యలపై అధ్యయనం. ఆనాడు ప్రత్యర్ధులు ఈ మాటను హేళన చేసినా పవన్ పట్టించుకోలేదు. సమస్యలు , వాటి పరిష్కారంపై ఆయన ఎంతో స్టడీ చేశారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పుడే రుజువు చేసుకున్నారు. అందుకే ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ తొలి సంతకం చేశారు
డిప్యూటీ సీఎం. ఐదేళ్ల క్రితం 2019 మహిళా దినోత్సవం నాడు ఆంధ్రప్రదేశ్‌లోని ఆడపడుచులకు ఓ హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తా.. గుర్తుపెట్టుకోండి నా పేరు పవన్ కళ్యాణ్. మహిళా దినోత్సవం రోజున జనసేన ఇస్తున్న మాట ఇది అంటూ చెప్పుకొచ్చారు.

రాజకీయ నాయకులు ఎన్నో వాగ్థానాలు చేస్తారు కానీ వాటిని నిలబెట్టుకున్న సందర్భాలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. పైగా ఐదేళ్ల నాటి మాట ఎవరికి గుర్తుంటుంది అని అంతా అనుకున్నారు. కానీ అక్కడుంది పవన్ కళ్యాణ్ . కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఐదేళ్ల నాటి హామీపైనే, మేనిఫెస్టోలో పెట్టిన అంశంపైనే తొలి సంతకం చేశారు. దీనికి సంబంధించిన నిధులను విడుదల చేస్తూ ఇచ్చిన మాట తప్పనని సంకేతాలు పంపారు. అలాగే గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణంపై రెండో సంతకం చేశారు డిప్యూటీ సీఎం.
బాధ్యతల స్వీకరణ నాడు కేవలం సంతకాలతోనే సరిపెట్టలేదు పవన్ .. డిప్యూటీ సీఎం హోదాలో తన శాఖలపై ఐఏఎస్ అధికారులతో రివ్యూ చేశారు. గ్రామాల్లో రోడ్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. ప్రతిపక్షంలో ఉండగా రోడ్ల సమస్యను హైలైట్ చేసింది జనసేనే. పంచాయతీల్లో రోడ్ల నిర్మాణం .. తన శాఖ పరిధిలోకి వస్తుండటంతో సీరియస్‌గా ఫోకస్ చేశారు. గ్రామాల్లో మౌలిక వసతులు, మంచినీటి కొరత రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పవన్ దిశానిర్దేశం చేశారు.
అంతేకాదు.. 3 నెలల్లో సమస్యలను పరిష్కరించాలని డెడ్ లైన్ సైతం విధించారు. మొత్తంగా బాధ్యతల స్వీకరణ నాడే ఏకంగా 10 గంటలపాటు వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్.. తాను మిగిలిన రాజకీయ నాయకుల మాదిరి కాదనే సంకేతాలు పంపారు. అపార అనుభవం ఉన్న అధికారులే ఆయన స్పీడ్ , సబ్జెక్ట్‌లపై అవగాహన చూసి ఆశ్చర్యపోయారంటే అతిశయోక్తి కాదు. మొత్తం మీద పాలకుడిగా తొలిరోజే హిట్ కొట్టారు జనసేనాని.


Click it and Unblock the Notifications











