కుక్కల్లా అరవకండి.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు పవన్ కల్యాణ్ వార్నింగ్
26 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్‌పై మెరుపుదాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరిట మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పాటు పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద క్యాంపులను నేలమట్టం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 80 నుంచి 100 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లుగా భారత సైన్యం ప్రకటించింది. పాక్ మిలటరీ క్యాంప్‌లు, పాకిస్తాన్ పౌర నివాస సముదాయాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పక్కా ప్లానింగ్‌తో భారత్ ఈ దాడులు చేసింది.

పాక్‌ను ఏమార్చి చావుదెబ్బ కొట్టిన భారత్
దేశం మొత్తాన్ని మాక్ డ్రీల్స్‌కు రెడీ ఉండమని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడంతో భారత్ సైనిక చర్యకు దిగుతుందని సరిహద్దులకు తన ఆయుధ సంపత్తిని మోహరించిన పాకిస్తాన్‌కు షాకిచ్చింది భారత సైన్యం. దాడుల విషయం ఎక్కడా బయటకు రాకుండా భారత్ జాగ్రత్తలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆపరేషన్ సింధూర్‌ను పర్యవేక్షించారు. మంగళవారం అర్ధరాత్రి 1.30 నిమిషాలు దాటిన తర్వాత ఈ దాడులు మొదలైనట్లుగా వార్తలు వస్తున్నాయి. నిమిషాల వ్యవధిలోనే భారత సైన్యం మిషన్ పూర్తి చేసింది.
మహిళలు ప్రతీకారం తీర్చుకోగలరు
టెర్రరిస్టులతో నిండిన 9 ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించి తమ లక్ష్యం ఉగ్రవాదంపైనే అని భారత్ ప్రపంచానికి చాటి చెప్పింది. దాడి తర్వాత మీడియాకు బ్రీఫింగ్ ఇవ్వడంలోనూ భారత్ తన ప్రత్యేకతను చాటుకుంది. మహిళా సైనికాధికారులు కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లతో ప్రపంచానికి ఆపరేషన్ సింధూర్ గురించి తెలియజేసింది ప్రభుత్వం. నాడు పహల్గామ్‌లో భార్యల ముందే భర్తలను చంపిన ఉగ్రవాదులు .. పోయి మీ మోడికీ చెప్పుకోమని సవాల్ విసిరారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న భారత్.. మహిళలు నాయకత్వం వహిస్తారు, ప్రతీకారం కూడా తీర్చుకుంటారనే సందేశం పాకిస్తాన్‌కు, ఉగ్రవాదులకు ఇచ్చింది.
భారత సైన్యానికి సెల్యూట్
ఆపరేషన్ సింధూర్ గురించి వార్తలు బయటికి వచ్చిన నాటి నుంచి భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ వారి ఆత్మలకు శాంతి చేకూరిందని పహల్గామ్ దాడి బాధితులు పేర్కొన్నారు. రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార తదితర రంగాల ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా భారత సైన్యానికి సెల్యూట్ చేశారు. ఉగ్రవాదంపై పోరులో దేశమంతా మీ వెంటే ఉంటుందని వారు తెలిపారు. ఇదే సమయంలో ఆపరేషన్ సింధూర్‌పై సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ చక్కర్లు కొట్టడంతో పాటు భారత సైన్యం మనోస్థైర్యం దెబ్బతీసేలా వార్తలు చక్కర్లు కొట్టడంతో కేంద్రం సీరియస్ అయ్యింది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఇలాంటి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోడీ వెంటే ఉంటామన్న పవన్
హైదరాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్‌పై స్పందించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఎదురుచూసిందని మోడీ నాయకత్వంలో త్రివిధ దళాలు పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేశాయని పవన్ అన్నారు. మోడీ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. నాడు మతం పేరు అడిగి మరి ఉగ్రవాదులు కాల్చి చంపారని.. మోడీ నాయకత్వంపై యుద్ధం జరుగుతోందన్నారు.
పిచ్చికుక్కల్లా అరవొద్దు
చివరి ఉగ్రవాదిని అంతం చేసేవరకు ప్రధాని పోరాటం ఆగదన్నారు. ఇండియాలో ఉంటూ పాకిస్తాన్‌కు మద్ధతుగా మాట్లాడటం, భారత సైన్యాన్ని కించపరిచేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కుక్కలు అరిచినట్లుగా ఎవరూ అరవొద్దని, దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే సెలబ్రెటీలైనా , సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ అయినా చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











