కాదంబరీ జత్వానీ కేసు.. ఆ ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెన్స్‌లో ట్విస్ట్!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సినీనటి కాదంబరీ జత్వానీ కేసు కలకలం రేపింది. వైసీపీకి చెందిన కీలక నేత ఒకరు తనను కిడ్నాప్ చేసి హింసించారని.. తనను తన కుటుంబాన్ని బెదిరించారంటూ ఆమె పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం కాదంబరీ కేసును విచారించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు దశలోనే పలువురు రాజకీయ నేతలు, అధికారుల పేర్లు రావడంతో ప్రభుత్వ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.
బాలీవుడ్‌కు చెందిన హీరోయిన్ కాదంబరీ జత్వానీని కృష్ణాజిల్లా మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ కుక్కల నాగేశ్వరరావు తనయుడు విద్యాసాగర్ ప్రేమించానని.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. తనను వదిలించుకోవాలని విద్యాసాగర్ పక్కాగా వ్యూహ రచన చేసినట్లుగా చూసినట్లుగా కాదంబరీ ఆరోపించారు. తన పరపతిని ఉపయోగించి నాటి వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పెద్దల సాయం తీసుకున్నాడని, ఇందుకు పోలీస్ శాఖలోని పెద్ద స్థాయి అధికారులు సైతం సహకరించినట్లుగా వార్తలు వచ్చాయి.
ఈ కేసుపై స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు పర్యవేక్షించడంతో పాటు ప్రత్యేకాధికారిని నియమించి ప్రభుత్వం విచారణ చేయించింది. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లుగా తేలడంతో నాడు విజయవాడలో విధులు నిర్వర్తించిన ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపైనా ప్రభుత్వం వేటు వేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.

ఈ కేసులో అసలు దోషులను పట్టుకునేందుకు అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఉత్తరాఖండ్‌లో విద్యాసాగర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను విచారించారు. నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లుగా ఆరోపణలు రావడంతో వారు ఎవరు? ఎందుకు ఇదంతా చేశారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఎలాంటి హంగామా లేకుండా సైలెంట్‌గా నడుస్తోన్న కాదంబరీ జత్వానీ కేసులో కదలిక వచ్చింది.
ఈ కేసులో సస్పెన్షన్‌కు గురైన ముగ్గురు ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలకు ప్రభుత్వం షాకిచ్చింది. ఈ ముగ్గురి సస్పెన్సన్‌ను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు మార్చి 12న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం సెప్టెంబర్ 25 వరకు ఈ ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ కొనసాగనుంది. అఖిల భారత సర్వీసు నిబంధనలన్ని వీరు ముగ్గురు ఉల్లంఘించినట్లుగా అభియోగాలు నమోదైనట్లుగా వార్తలు వస్తున్నాయి. వీలైనంత త్వరగా కాదంబరీ జత్వానీ కేసును పరిష్కరించి కొలిక్కి తీసుకురావాలని పోలీస్ శాఖ కూడా గట్టి పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెన్షన్ పొడిగింపు చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











