టికెట్ రేట్స్ పెంపుకే సీఎం కావాలా? రేవంత్ రెడ్డి బర్త్ డే రోజున బండ్ల గణేష్ వివాదాస్పద ట్వీట్
సాధారణ కమెడియన్‌గా, హీరోల ప్రక్కన అసిస్టెంట్‌గా కెరీర్ మొదలుపెట్టిన బండ్ల గణేశ్ .. తర్వాత నిర్మాతగా మారి, కోట్లాది రూపాయల భారీ బడ్జెట్‌తో స్టార్ హీరోలతో సినిమాలు తీసే రేంజ్‌కి ఎదిగి అందరినీ ఆశ్చర్యపోయారు . ఎవరి అండా లేకుండా బండ్ల గణేష్ ఈ స్థాయికి ఎలా చేరుకున్నారంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు బండ్ల గణేష్ . తాజాగా ఆయన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నటుడిగా, నిర్మాతగా సినీ పరిశ్రమలో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు బండ్ల గణేష్. అయితే సినిమాలతో పాటు రియల్టర్‌గానూ, వ్యాపారవేత్తగానూ ఆయన రాణించారు. తర్వాత ఎందుకో సినీ పరిశ్రమకు , సినీ నిర్మాణానికి దూరమయ్యారు బండ్ల గణేష్. అయితే తొలి నుంచి రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఎక్కువ కావడంతో అటు వైపు ఓ రాయి వేశారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఢిల్లీకి వెళ్లి మరి కాంగ్రెస్ పెద్దల సమక్షంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీలో చేరారు.

నాటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచి కేసీఆర్ అధికారంలోకి రావడంతో గణేష్ కొంతకాలం సైలెంట్ అయ్యారు. అయితే 2023 తెలంగాణ ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్‌కు మద్ధతుగా ప్రచారం చేశారు. అయితే నోటి దురుసుతో ఎన్నో వివాదాల్లోనూ గణేష్ ఇరుక్కున్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా తన ఫౌల్ట్రీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చూసుకుంటున్న గణేష్.. పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ కాలం గడుపుతున్నాడు.
మనసులో ఏది దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా మొహం మీద కొట్టినట్లు మాట్లాడతారు బండ్ల గణేష్. దీనివల్ల పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ తీరు మార్చుకునేది లేదని, నా రూటే సెపరేట్ అంటూ దూసుకెళ్తున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బండ్ల గణేష్ సంచలన ట్వీట్ చేశారు. ఇది కాస్తా ప్రస్తుతం తెలుగు సినీ, రాజకీయ రంగాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆయన ఆ ట్వీట్‌లో ఏం పెట్టారంటే.

గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేదని వారికి పెద్ద నమస్కారం. టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను అంటూ ఘాటుగా కామెంట్ చేశారు. తమ సినిమాల రిలీజ్‌ల సమయంలో టికెట్స్ రేట్స్ పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేందుకు కొందరు క్యూ కడతారని.. అలాంటి వాటికే సీఎం కావాలని, ఆయన పుట్టినరోజు వస్తే కనీసం ఆయనకు విష్ చేయడానికి కూడా తీరిక లేదా అన్న అర్ధంలో బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా సినీ ప్రముఖులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











