పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు.. ఏపీ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైఎస్ జగన్ పాలన మరోసారి తమకొద్దని ప్రజలు తిరస్కరించారు. వ్యూహాలు, ఎత్తుగడలు, ఎలక్షనీరింగ్ ఇలా పలు అంశాలు కూటమికి విజయానికి కారణం కావొచ్చు.. కానీ వీటికి మించి అసలైన శక్తి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్. జగన్ నిన్ను ఈసారి గెలవనివ్వను, అథ:పాతాళానికి తొక్కేస్తానన్న పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగానే దానిని నిలబెట్టుకున్నారు. నచ్చినా, నచ్చకున్నా ఈ విషయాన్ని ఒప్పుకుని తీరాలి.
తన అభిమానులు, కాపు సామాజికవర్గం ఓట్లను కూటమి వైపు పొలరైజ్ చేశారు పవన్. కేవలం జనసేనానిని చూసే 90 శాతం మంది కాపులు కూటమి అభ్యర్థులకు ఓట్లేశారని అంచనా. ఈ వర్గం బలంగా ఉన్న ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి , ఇతర జిల్లాల్లో కూటమికి వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ తమ సామాజికవర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత దక్కదని భావించిన కాపులు ఏకమయ్యారు.

కేవలం పవన్ అనే వ్యక్తి లేకుంటే ఈ స్థాయి విజయం కూటమికి లభించేది కాదన్నది అందరూ అంగీకరించే విషయం. ఎమ్మెల్యే సాబ్ అనిపించుకోవడానికి పదేళ్లుగా తపస్సు చేస్తున్న పవన్ ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలిచి భారత రాజకీయ చరిత్రలోనే అరుదైన రికార్డును జనసేన పేరిట లిఖించారు.
కానీ ఈ సక్సెస్ పవన్ కళ్యాణ్‌కు రాత్రికి రాత్రి రాలేదు. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలను ఆయన ఎదుర్కొన్నారు. రాజకీయపరంగా కాకుండా వ్యక్తిగతంగా పవన్‌ను విమర్శించేవారు వైసీపీ నేతలు. పవన్ కళ్యాణ్ ఏపీకి వచ్చి ఏదైనా సభ పెట్టినా, మీడియా సమావేశంలో మాట్లాడినా.. క్షణాల వ్యవధిలో కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు ఆయనపై విరుచుకుపడేవారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్‌ను ఎదర్కోలేక పదే పదే పెళ్లిళ్ల ప్రస్తావన తెచ్చేవారు.. ఏదో గల్లీ లీడర్లు అవగాహన లేక విమర్శలు చేశారని అనుకుంటే ఓకే.. కానీ వైసీపీ అధినేత, ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వైఎస్ జగన్ సైతం గడిచిన ఐదేళ్లుగా పవన్ మూడు పెళ్లిళ్లతో ఆయనను టార్గెట్ చేశారు.
దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్, నిలకడలేని వ్యక్తి అంటూ ఎక్కడ దొరికితే అక్కడ హేళనగా మాట్లాడారు. జగనైతే ఏకంగా పవన్‌కు నాలుగు పెళ్లిళ్లు అయ్యాయని వ్యాఖ్యానించడంతో జనసేనానికి చిర్రెత్తు కొచ్చింది. తనకు మూడు పెళ్లిళ్లే అయ్యాయని.. మరో నాలుగో పెళ్లాం ఎక్కడి నుంచి వచ్చింది.. నా నాలుగో పెళ్లాం నువ్వే అంటూ జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పవన్ . జనసేన అధినేతపై వైసీపీ నేతల నోటీ దురుసు, బురద జల్లుడు కార్యక్రమాలు ఎన్నికల్లో ఆ పార్టీ కొంప ముంచాయన్నది విశ్లేషకుల మాట.
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మరోసారి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఆ మాటలు అన్నది స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు కావడం గమనార్హం. జగన్ హయాంలో ఏపీలో నెలకొన్న శాంతి భద్రతలపై చంద్రబాబు నాయుడు గురువారం శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ క్రమంలోనే పవన్ పెళ్లిళ్లను ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గాన్ని జగన్ ప్రశాంతంగా ఉండనివ్వలేదని.. విపక్ష నేతలను టార్గెట్ చేసి కేసుల మీద కేసులు పెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై జగన్ తెగ కలవరించారని.. నీకు కావాలంటే పోయి వేరే కాపురం చేసుకో అంటూ వైసీపీ అధినేతకు చురకలంటించారు. ఇదే సమయంలో మహిళల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలని.. సోషల్ మీడియాలో వారిని కించపరిచే చర్యలు చేపట్టొద్దని చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం ఏపీ సీఎం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











